12, జనవరి 2011, బుధవారం

నేనూ, సీత, శ్రీనివాసరావు మాస్టారు

నేను స్కూల్ లో  చేరాక ఎక్కడా రెండు సంవత్సరాలు కుదురు గా చదివింది లేదు ..నాన్న ప్రతి ఏట పంటలు మొదలయ్యే టైం కి ఊరు వెళ్లి కావలసిన సామాగ్రి తెచ్చుకొంటూ ఒక సంవత్సరం అకౌంటు పుస్తకాలూ తో పాటు నాకూ ఒక రెండు పుస్తకాలూ ,నోట్సులు పట్టుకొచ్చారు.. . అలా మా నాన్న నాకు ఒక పది ఎక్కాలు , ఒక ఇంగ్లీషు పుస్తకం (చిన్నదే) చదివించేసాక (అంటే బాగా భయపెట్టి అన్నమాట) నన్ను స్కూల్  కి పంపించేసారు ..మిగతా పది ఎక్కాలు రావడానికి నాకు ౪ ఏళ్ళు పట్టిందనుకోండి.

మూడవ క్లాసుకి మేము తాతయ్య వాళ్ళ ఊరుకి మారాము.అక్కడే కాన్వెంట్ లో  సీత , శ్రీనివాసరావు మాస్టారు కలిసారన్నమాట .నేను ౩ వ క్లాసు కి వెళ్ళాలంటే పదమూడవ ఎక్కం దాకా అయినా వచ్చుండాలి అని మాస్టారు నన్ను క్లాసు లో వేరే గా కూర్చోపెట్టి చెప్పేవారు .అదృష్టం బాగుండి ఒక ఆరు, ఏడు  తప్పులతో ఎక్కం అప్ప చెప్పేసాక క్లాసు  లో అందరితో పాటు కలిపేసారు ..ఇలా ముందు నాకు మాస్టారు ఒక్కరే బాగా పరిచయం. మిగతా అందరు కొంచెం తెలుసు.

సీత అనే అమ్మాయి వాళ్ల పెదనాన్న వాళ్ళింట్లో ఉండి చదువుకోడానికి మా ఊరు వచ్చింది. తను మా అందరికీ ఇష్టం. ఇల్లు కూడా మా పక్క వీధి లో అవ్వడం , స్కూల్ తర్వాత కూడా కలిసే వాళ్ళం ఇద్దరమూను.మాస్టారు చెప్పే క్లాసు లో నేను, సీత కాక ఇంక బేబి, తులసి, సునీతా, వెంకట లక్ష్మి , రజని ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఇంకా  అంతే మంది అబ్బాయిలు ఉండేవారు . అబ్బాయిలు ఎప్పుడూ  రాజకీయాలు గురించి  చెప్పుకొనే వాళ్ళు . మేము ఏమో వాళ్ళకు వినిపించకుండా సినిమాలు, పువ్వులు, తిండి  గురించి చెప్పుకొంటూ ఉండేవాళ్ళం. లేకపోతే రాజకీయాలకి విరామం ఇచ్చి మమ్మల్ని ఏడిపించేవాళ్ళు కదా. మొత్తానికి ఒక సంవత్సరం పూర్తి అయ్యి నాలగవ క్లాసు కి వచ్చాం.

శ్రీనివాసరావు మాస్టారు అంతకు ముందు టీచర్ల కన్నా ప్రత్యేకం గా కనిపించేవారు..అందరికీ అలాగే అనిపించిందేమో మరి. నేను ఎప్పుడూ స్కూల్ కి లేట్ గా వెళ్ళేదాన్ని ఇంక వెళ్ళక తప్పదు అన్నట్లు. ఎందుకంటే సంక్రాంతి కి తప్ప సెలవులు ఉండవు ఈ కాన్వెంటు కి. నేనేమో సవత్సరము అంతా ఆ మూడు రోజులకోసమే ఎదురు చూసేదాన్నా, ఈ అమ్మాయిలేమో జనవరి పన్నెండో తారీకు నుంచి సెలవులు అస్సలు ఇష్టం లేనట్లు మాస్టార్ల ముందు చెప్పి చెప్పి నాకు భయాందోళనలు కల్పించేవాళ్ళు. వీళ్ళ మాటలతో అప్పుడు కూడా బడి పెట్టేస్తారేమో అని నిజం గా భయపడే దాన్ని. అలా లేటు గా క్లాసు కి వెళ్తే ఉండే శిక్షలు తప్పించుకోడానికి ఒక్కోసారి మానేసేదాన్ని. ఇది ఇంకా కష్టం,  ఎందుకంటె ఇంట్లో వాళ్ళకి, ఆటలు  ఆడుకుంటుంటే వీధి కనిపించే పిన్ని, బాబాయి లకి అందరికీ  సమాధానం చెప్పుకోవాలి. ఒకరోజు మాస్టారు పిలిచి నువ్వు ఆలస్యం గా వచ్చినా పర్వాలేదు, కొట్టను, లేటు అయ్యిందని మానేయ్యకు అని చాలా ముద్దు గా, ప్రేమ గా చెప్పారు. ఆనందమే ఆనందం. నేను యధేచ్చ గా వెళ్ళేదాన్ని. ఆయనేమో ఇచ్చిన మాట ఒక నాలుగురోజులు కూడా గుర్తు పెట్టుకోలేదు. గుర్తు వస్తుందన్న ఆశ తో ఆలస్యం అయినా నేను మాత్రం ఆ తర్వాత స్కూల్ మానేయ్యలేదు.

సాయంత్రం కధలు బాగా చెప్పేవారు ..పరీక్షలో తప్పితే మాత్రం సాయంత్రం ఇంకో గంట నిలబెట్టే వారు.అక్కడ అమ్మాయిలం మాత్రం అందరూ ఉండేవాళ్ళం, చదివితే కదా. అదీ కాక సినిమాలు తో పాటు  మాస్టారు గురించి కూడా చెప్పుకోవాల్సి వచ్చేసరికి టైం సరిపొయ్యేది కాదు . ఒక్కోసారి సాయంత్రం పనిష్మెంటు సెక్షన్ తప్పించుకోడానికి అమ్మ తలంటు పోస్తాను త్వరగా రమ్మని చెప్పింది అనగానే పంపించేసే వారు. తర్వాత రోజు తలంటు ఏది అంటారేమో అని ఇంకో టెన్షను :)

ఇలా ఒకరోజు మాస్టారు అలా మధ్యలో బయటికి వెళ్లాక, అమ్మాయిలం ముచ్చట్లు మొదలు,  శ్రీలక్ష్మి లా సినిమా టైటిల్స్ మొదలవుతాయి దగ్గర్నించి, ఏమి  మిస్సవ్వకుండా చెప్పేవాళ్ళం చూడని వాళ్ళకి.  ఆ రోజు సీత ఉన్నట్లుండి మాటల్లో 'నాకు రాత్రి కలలో  శ్రీనివాసరావు మాస్టారు వచ్చారు' అని చెప్పింది. ముందు కుంచెం షాక్ అయినా తేరుకొని అవునా ఏం జరిగింది చెప్పు చెప్పు అని ఒకటే అడగడం.....అది కాస్త చెబితే, మేము నెక్స్ట్ సీను ఊ హిం చే స్తూ బ్రతిమలుకోడం. చెప్పాలంటే మనసులో నేను తెగ బెంగ పెట్టేస్కున్నా :)..సరే అదేమో ఊరించి ఊరించి చెప్తూ అప్పుడేమయ్యిందంటే అని ఆగిపోయింది. సినిమాల్లో అయితే కచ్చితం గా సాంగ్ వచ్చే సీను అన్నమాట..మాకు అందరికీ వెలిగింది కాని చెపితే వినాలని ..అంతకంటే సిగ్గు మా సీతమ్మ కి ... ఇంకా నాకు అర్ధమైపోయింది నాకు ఈ పిల్ల కాంపిటీషను అని. మిగతా వాళ్ల గురించి నాకు అప్పట్లో అనుమానాలు లేవు :)

చదువులో కూడా  అందరం పోటి గా ఉండేవాళ్ళం, టెస్ట్ లు అవి పెట్టినపుడు. హోం వర్క్ బాగా చేస్తే నోట్ బుక్ లో సైన్ చేసే వారు . అలా ఆ రోజు ఎవరికి ఎక్కువ సంతకాలు మాస్టారు చేస్తే వాళ్ళకి చప్పట్లు..ఇంక ఆ రోజంతా వాళ్ళు స్పెషల్. మొదట్లో నాకు బాగా సంతకాలు పెట్టేవారు ..తర్వాత అబ్బాయిలు మాకు చెక్ పెట్టారనుకోండి ..నా మనసులో మాత్రం మాష్టారుకి నేనంటే నే అభిమానం అని మురిసిపోయ్యేదాన్ని..కాని నిజం నిప్పులాంటిది కదా. ఒక రోజు నాకు  ఇంకో షాక్ తగిలింది. ఏంటి అంటే, ఎప్పటిలానే టెస్ట్ పెట్టారు . 25 కి 8 మార్కులతో అంకమ్మ అనే అబ్బాయి క్లాస్ ఫస్టు..మిగతావాళ్ళు 5 కి అటు ఇటు అన్నమాట ..పంతుల్ గార్కి బాఘా  కోపం వచ్చింది. మాకు ఒక్కొక్కరికి 20 కన్నా ఎన్ని మార్కులు తక్కువ వస్తే వాళ్ళకి అన్ని దెబ్బలు అని నిర్ణయించేశారు. ఫస్ట్ వచ్చిన  అంకమ్మ సగర్వం గా వెళ్లి 12 దెబ్బలు తినేసాడు..నా టైం వచ్చింది, బెత్తం తో చెయ్యి పైన ఒక్కో దెబ్బకి , చెయ్యి దాచేసుకోడం. బ్రతిమిలాడుకోవడం వద్దండీ అని..అర్ధం చేసికోకుండా మొత్తం పూర్తి చేసారు. అందరికీ పక్క వాళ్ళని కొట్టేప్పుడు లెక్కపెడుతూ భలే ఆనందం :) అప్పుడే సీత వంతు మొదలయ్యింది ..16 దెబ్బలు, నాకన్నా ఒకటి ఎక్కువే అని నేను సంతోష పడేలోపలె అయిపోయాయి. ఒక్కసారి గుర్తు చేసికొంటే , ఆయన కొడుతూనే ఉన్నారు , ఈ పిల్ల చెయ్యి ఇంచు కూడా కదపకుండా ...అస్సల్ ఏడవకుండా ఆయన్నే చూస్తూ ఉంది. అంకమ్మ నా కన్నా ముందు తేరుకుని మాస్టారు సీతా మా లక్ష్మి ని అందరిలా గట్టిగ కొట్టలేదు అని ప్రశ్నించాడు. నిజమే, మా కన్నా కొంచెం చిన్న దెబ్బలు అన్నమాట. కాని గట్టిగానే కొట్టారు. మాస్టారు నవ్వుతూ సమాధానం చెప్పారు.మీలాగా కాదు ,ఆ అమ్మాయి చెయ్యి ఒక్కసారి కూడా వెనక్కి తీసికోలేదు అందుకే సీత కి చిన్న దెబ్బలు అన్నారు.
 
ఆ అబ్బాయి కేమి అర్ధం అయ్యిందో తెలిదు కాని..కాస్సేపు ఆలోచిస్తే నాకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అంటారు కదా అలా అయ్యింది.ఎందుకంటె ఈ  పిల్ల అస్సలు నొప్పి అనకుండా ఎలా అన్ని దెబ్బలు తినేసింది. అంటే మాస్టారు మీద ప్రేమే కదా ... మరీ ఇంతలా పోటి పడాలంటే మనవల్ల అయ్యేపని కాదు అనిపించింది. బాధ గా అనిపించినా సీతా మా లక్ష్మి దీ నిజమైన ప్రేమ అని ఒప్పేసుకున్న మనసులో. అలాగని పూర్తిగా ప్రేమించడం మానేయ్యలేదనుకోండి ..ఈ లోగా హెడ్ మాస్టారు శ్రీనివాసరావు గారి ప్లేస్ లో ఇంకో టీచర్ ని పిలిపిస్తున్నట్లు చెప్పారు , అంటే ఈయన వెల్లిపోతారన్నమాట..చాలా బాధ అందరికీ , పాపం ఆ వచ్చే పంతులమ్మ ని మాకు వచ్చిన తిట్లు, శాపాలు అన్ని పెట్టేశాం ..వెళ్ళద్దు అని ఆయనికి కూడా చెప్పాం :) ...సరే ఈ సీత కి యెవ్వరికి రాని ప్రశ్నలు వస్తాయి. ఆ వచ్చే కొత్త టీచరమ్మ పేరు అడిగింది మాస్టారుని. సరే ఆయన నోటితో చెప్పొచ్చు కదా ...ఉహూ, చక్క గా సిగ్గు పడుతున్న ఈ పిల్ల అరచేతిలో పెన్నుతో 'శ్రీ లక్ష్మి' అని రాసేస్తిరి...ఈ చోద్యం ఎక్కడన్నా ఉందా. అంటే ఆయనికి కూడా బోల్డంత ప్రేమ అని రుజువైపోయింది :) ...ఇంకా మనం పూర్తి గా ఆశలు వదిలేసుకున్నా౦   అని వేరే చెప్పక్కరలేదు కదా.

తర్వాత సంవత్సరమే నేను,సీత  ఇద్దరం వేర్వేరు ఊర్లు వెళ్లి , మల్లి  హైస్కూల్ కి ఊరిలో కలిసాము.ప్రతి న్యూ ఇయర్ కి మాస్టారు కి  తప్పకుండ గ్రీటింగ్ కార్డు ఇచ్చి వచ్చేది..ఆయన కూడా వాళ్ల ఇంటిదగ్గరి అబ్బాయిలతో కార్డు పంపించేవారు. ఇద్దరం కలిసే కొనేవాళ్ళం చెరో కార్డు ..కానీ తనకి రిప్లై వచ్చింది కానీ మనకి వస్తుందా లేదా అన్న అనుమానం తో ఇవ్వడం మానేశా అన్నమాట. తర్వాత  సెవెంతు క్లాస్ కి వాళ్ల అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.తర్వాత నేను కూడా గురుకుల పాఠశాలా లో చేరాను.

నేను ఇంజనీరింగ్ కి  వచ్చాక ఒకసారి ఊరిలో ఫ్రెండ్స్ ని కలసినప్పుడు తెలిసింది , అప్పటికీ  శ్రీనివాసరావు మాస్టారు ఎవరైనా మా అమ్మాయిలు  ఎదురైతే మా సీతా మా లక్ష్మి కబుర్లు (ఎక్కడున్నది, ఏమి చదువుతుంది ) చెప్పేవారు  అని. అంత అభిమానం పొందిన సీత నిజం గా అదృష్టవంతురాలు. PG చదివింది అని తెలుసు, తర్వాత పెళ్లి కూడా వెంటనే అయిపొయింది ఇప్పుడు ఎక్కడున్నది తెలిదు. పిల్లా, పాపలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను.

8 వ్యాఖ్యలు:

 1. సంక్రాంతి శుభాకాంక్షలు మౌళి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. స్కూలు జ్ఞాపకాలెప్పుడూ తీయగానే ఉంటాయి. కాలేజీ లో ఉండే అలజడులు అప్పుడుండవు, స్వచ్ఛమైన అమాయకత్వం తప్ప!

  బాగుంది మీ టపా!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నీహారిక గారు ,

  మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సుజాత గారు,
  కరెక్టు గా చెప్పారండీ ,ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ల స్కూల్ లో జరిగిన ఇవే విశేషాలు చెబుతుంటే,భలే ముద్దు గా అనిపిస్తుంది నాకయితే.

  స్పందించినందుకు ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. nice post.. :)
  సంక్రాంతి శుభాకాంక్షలు మౌళి గారు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. hi..mauli garu.. my mail id
  orange.fan19@gmail.com

  ప్రత్యుత్తరంతొలగించు
 7. టపా నచ్చినందుకు ధన్యవాదములు వేణూరాం గారు :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అజ్ఞాత(orange.fan19) గారు

  నా బ్లాగ్ మొదటి అజ్ఞాత పాఠకులు మీరే :)
  ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు