18, సెప్టెంబర్ 2013, బుధవారం

ఏ పీ ఆర్టీసీ జిందాబాద్
ఇండియా ట్రిప్ కి వెళ్లోచ్చిన గుంటూరు వాసులు చెబుతున్నారు , అక్కడ 'ఈనాడు' ఒకింత ను వెయ్యింతలు  చేసి రాయడం తప్ప , హదావిడెం లేదు అని . మొన్న 7 వ తారీకు  హైదరాబాద్ లో రాత్రిపూట బస్సుల  బందుకు భయపడి ముందు రోజు సాయంత్రమే ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు . తీరా చూస్తె ఈడ్కోలు ఇచ్చి తిరిగి వచ్చే బంధు మిత్రులకి ఎక్కడా ఇబ్బందే లేదు. ఛా రాత్రంతా ఎయిర్పోర్ట్  లో జాగారం, తెలంగాణా వాళ్ళు ఇలా కసి తీర్చుకున్నారన్నమాట.

ప్రభుత్వం లేకపోతె జన జీవనమ్ నిలిచి పోవాలి కదా , ఏమిటో ఆర్టీసీ వాళ్ళని సమ్మె విరమించమంటే వాళ్ళు ఎన్జీవోలు ఆపితేనే అన్నారుట. మరి వీళ్ళు ఆపేస్తే జనం ఎమ్జీవోల సమ్మెని మరు నిమిషంలో మర్చిపోతారు.

ఆర్టీసీ లేకుంటే సమైక్య గళమే లేదు. కాబట్టి ఆర్టీసీ జిందాబాద్.  జీరో ఉద్యోగులను హీరోలుగా చూపిస్తున్న ఆర్టీసీ  కి వాళ్ళు జన్మంతా రుణపడి ఉండాలి.

అందుకే బొత్స బాబాయ్ ఆర్టీసీ ని ప్రభుత్వ సంస్థగా ప్రకటించి ఋణం తీర్చేసుకుంటాను అంటున్నాడు .

ఇప్పుడు ఇంకో అనుమానం , అసలు ఆర్టీసీ తో సమ్మె చేయిస్తున్నది ఎవరూ బొత్స బాబాయి కాదు కదా !!!

తెలంగాణా రాదా?ఈ సమైక్య, తెలంగాణా ఉద్యమాల  గొడవ సంగతేంటి రా శ్రీనూ ....

తెలంగాణా రాదు అక్కా, ఇది మారదు అని ఖచ్చితంగా అని అనేసాడు ...

హ్మ్ , చిత్రంగా  శ్రీను మా ఊర్లో తన ఈడు కుర్రాళ్ళతో పోల్చితే ఉలిపి కట్టె అని చెప్పొచ్చు. మా ఇంటికి తప్ప ఇంకెవ్వరి ఇంటికి వెళ్ళడు కూడా. ఎప్పుడో పాతికేళ్ళ క్రితం  వాళ్ళ నాన్న ఉద్యోగ రీత్యా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. అంటే మా వూరు హైదరాబాద్ అయితే, వీడు అక్కడ సీమాంన్ధ్రుడు అంటే సరిపోతుంది . వీడికి వూర్లో  మా తమ్ముడు తప్ప  మిగిలిన క్లాస్మేట్స్ తెలివితక్కువ దద్దమ్మలు అని బాగా నమ్మకం కాబొలు, కాస్త కూడా లెక్క చెయ్యడు. ఇక వాళ్ళు సరే సరి.


అనుకోకుండా ఈ వారం లో  మాట్లాడాల్సి వచ్చింది, ఆ మాట ఈ మాట అయ్యాక ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు తెలంగాణా ప్రకటించిన సందర్భంగా , సమైక్యాంధ్ర లో అక్కడక్కడా ఉన్న హదావిదిని ఈనాడు చించి చాటంత చేసి చూపిస్తున్నది  కదా. వాడి అభిప్రాయం తెల్సుకుందామని జస్ట్ అడిగాను అంతే . ఒక్క ముక్క లో తేల్చేసాడు .


అసలు ఈ అపర మేధావిని అడగడానికి కారణం ఉందండోయ్. నాలుగేళ్ల క్రితం చంద్రబాబు మహాకూటమి ని పోగు చేసి సమర శంఖం  పూరించగానే ఇంకేముంది తిరుగులేదు అన్న గట్టి నమ్మకం తో ఎంట్రా సీనూ సంగతీ అని పొరపాటున అడిగాను . అక్కోయ్ పక్కా మళ్ళీ వై ఎస్సే అని ధంకా భజాయించాడు. చా అంత  లేదేమోరా !!! (వీడికి ఊర్లోని మా సామాజిక కులం  కుర్రాళ్ళు అంటే అస్సలు పడదు కాబట్టి చంద్రబాబు ని కర్వేపాకులా  తీసేస్తున్నాడే అని అనుమానం అన్నమాట )


కాదక్కా జనంలో  దీపం పధకం, ఇందిరమ్మ ఇల్లు ఇంకెవో  యజ్ఞాలు లో తెగ ఉబ్బి తబ్బిబ్బయ్యారు , ఇంక వైయెస్సు కి తిరుగే లేదు అని బల్ల విరక్కోట్టేసాడు. అయినా ఇంకోసారి బాబు సంగతిరా అని కాస్త మెత్తగా  అడిగాను.   కాస్త అయినా జాలి దయా లేకుండా తెలుగు బాబు కి మళ్ళీ  చీఫ్ అయ్యే యోగమే లేదక్కా అని చప్పరిన్చేసాడు .


ఆ కారణంబేవిటా  అని ఆరాతీస్తే , మన హైటెక్కు బాబు కి శని గండం పట్టేసిందట . ఏవిటో ఆ శనీశ్వరుడు పోతూ పోతూ దేబ్బేసి పోతాడుట . అలా అలిపిరి లో ఉగ్ర వాదుల దాడి లో  చావు తప్పి  వెంటనే తొందరపడి  సానుభూతి ఓట్ల కోసం ముందస్తు హడావిడి చేసిన తప్పిదం వల్ల  కన్ను లొట్ట పోయిమ్దిటా . అలా కాక మామూలుగా మిగిలినా ఆర్నెల్లు ఆగి ఉంటె గెల్చేసే  వాడే నుట  కాని మరి శని కుదురుగా ఉండనిస్తే కదా .

హతవిధీ మరి టీ డీ పీ ఇక గెలవదా !!!! ( ఇంకా నయ్యం , మా ఇంట్లో ఎవరన్నా ఈ సంభాషణ వింటే వీడికి బడితె పూజే బహుమానం )

అంటే అక్కా  ఇంకెవరన్నా అయితే పార్టీ గెలవచ్చేమో కాని, బాబు ఉంటె మాత్రం కధ  కంచికే అని చావు కబురు చల్లగా వినిపించాడు.

ఎలక్షన్ అయ్యాక తెలుస్తుంది లే , దొరికాం కదా అని నీ జాతకాల పాండిత్యం అంతా వదలకు అన్నా చిరాగ్గా .

అసలు వీడు డిగ్రీ చదవడం మానేసి జాతకాల పుస్తకాలు నమిలేసాడు.  అవి అయ్యాక పూజలు పిచ్చోకటి . ప్రముఖ ఆస్ట్రాలజర్ అని ఫీలయిపోతాడు కూడాను.


ఇంతలో ఎలక్షన్ లో వైఎస్స్ హైదరాబాద్  వీసాల డైలాగ్ కి  బాబుకి మహా బూడిదే మిగిలింది .  అబ్బా మా సీనుగాడు చెప్పినట్లే ఇక బాబు పనయిపోయిందా అని కించిత్ అనుమానం కలిగి కారణాలు పీకి పందిరేస్తే అర్ధం అయ్యింది. కాంగ్రెస్ లో సామూహిక మరియు సమైక్య  అవినీతి కి, బాబు  ఎప్పటికి పోటి ఇవ్వలేడు. అసలు ఇంట్లో వాళ్ళకే దిక్కులేదు . ఇంకెక్కడ అధికారం  చేతికోచ్చేది .

ఇక తెలుగు దేశం ప్రజల ఓట్లు  వెలుగు లో కొచ్చేదేలా అంటే  ఉడిపి హోటళ్ళు.. ఒక రాజకీయ విశ్లేషణ.. ! చదివి తీరాల్సిందే .


ఇప్పుడు వీడు ఏ నమ్మకం తో చెప్పాడో కాని తెలంగాణా రాదు అని , ఈ సీమాంధ్ర ఉద్యోగులంతా కలిసి సీమాన్ధ్రని ఇంకో యాభై ఏళ్ళు ఎనక్కి తీసికేల్లెట్లున్నారు.


ఒక అమ్మకం లేదు , కొనడం లేదు. ఆ చేసేదేదో బంగారం షాపులోల్లతో బందు చేయిస్తే జనం లో ఫాలోయింగు పెరుగుతుంది కాని,  హాస్పిటల్లో ఉన్న పురిట్లో  పసికందులను వరుసగా  పడుకో పెట్టి సమైక్య  ఉద్యమం ని వీధి డ్రామా స్థాయికి దిగజార్చడం ఏమిటో.
9, సెప్టెంబర్ 2013, సోమవారం

సీమాంధ్ర ఉద్యమం - తిప్పడు వచ్చాడు, వెళ్ళాడు

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యెక తెలంగాణా ను ఈ ఆగస్ట్ 30 న ప్రకటించిన వెంటనే పెద్దగా సీమాంధ్ర  నుండి స్పాదన లేకున్నా చిన్నగా బందులు, నినాదాలు మొదలయ్యాయి.


సమైక్య ఉద్యమం కాని, హైదరాబాద్ ఉద్యమం కాని జరగాలి , కాదనే వారెవరూ లెరు. కాని ప్రజల భాగ స్వామ్యం తో జరగాలి , రాజకీయ వర్గాలు నేరుగా పాల్గొనాలి. ఈ సమస్యలో భావ సారూప్యత ఉన్న అన్ని రాజకీయ పార్టీలు సంయుక్తంగా పోరాడాలి. ఇవేవి లేకుండా ఉద్యోగుల ముసుగులో రాజకీయ పార్టీలు జరిపే రచ్చ కాకూదడదు. 

కొద్ది మంది ఎన్జీవోలు విధులు బహిష్కరించాల్సింది గా ఇచ్చ్చిన పిలుపు కు దాదాపు తొంబయి శాతం ఉద్యోగులు విదులకి దూరం గా ఉన్నారని సమాచారం , కాని వీరిలో ఎంతమంది సమైక్యవాదులు అని నిర్ధారించడానికి వీలు లేదు. ప్రస్తుతం వీరి నిలజీతాలను ప్రభుత్వం నిలిపివేసింది కాని, రాష్ట్ర విభజన జరిగినా .జరగకున్నా వీరి జీతాలు వీరికి జమ అవుతాయి, రెండు సందర్భాలలోనూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రమె  ఉంటుంది కాబట్టి.  వీళ్ళని కాదంటే చంద్రబాబుకి పట్టిన గతి పట్టిస్తారు . 


కేవలం ఉద్యోగులు మాత్రమె , సెక్యురిటీ మధ్య వెళ్లివచ్చిన సభ కి ప్రాధాన్యత యెంత? వారు సీమంధ్ర ప్రజల్లోని సమైక్యవాదులందరూ పాల్గొనాల్సిన అవసరం లేదా?  లేక మిగిలిన ప్రజలు వారి స్థాయికి తగరనుకొన్నారా ? ఈ మీటింగు కి 'సేవ్ సీమాంధ్ర' అని పెడితే ఇంకాస్త సవ్యంగా, కన్ఫ్యూజన్ లేకుండా ఉండేది .'సేవ్  ఆంధ్రప్రదేశ్' అంటే  సమైక్యాంధ్ర అని కాకున్నా పాత రాష్ట్రమే అని వీరి భావన అయ్యుండొచ్చు . ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పుడు రెండురూపాలు ఉన్నాయి , ఒకటి  విభజన ప్రకటనకి ముందు మరియు రెండవది తర్వాత . ఈ ఎన్జీవోలకి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు .

 వీరు కేవలం విభజన సమయం లో హడావిడి చెయ్యడానికి కెసిఆర్ పుణ్యమా అని రోడ్దేక్కినవారు మాత్రమె . అలాగే సేవ్ సీమాంధ్ర అంటే హైదరాబాదులో ఉన్న సమైక్యవాదులు, ఇంకా హైదరాబాదుతో మాత్రమె పని ఉన్న సమైక్యవాదులు కలవరు . సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఈ బంద్ కి పూర్తిగా దూరం , ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం జీతం   చస్తే జమ చెయ్యదు కాబట్టి .  ఇదే ఉద్యోగుల సమ్మెలో పెద్ద డొల్లతనం


మొత్తానికి   'సేవ్  ఆంధ్రప్రదేశ్' సభకి సీమాంధ్ర కి సంబంధం అసలు లేదా అంటే ... వివరాల్లోకి వెళ్ళాలి


ఎవరో చెప్పినట్లు సభలో ఒక్కో భాగానికి ఒక్కో ప్రముఖుడి పేరు, తెలంగాణా వారితో సహా కలిపి పెట్టగానే సరిపోదు, మాట్లాడే మాటల్లో , చర్చల్లో మొత్తం తెలంగాణా తో కలిపిన ఆంధ్ర ప్రదేశ్ యొక్క  మంచి చెడులు ఉండాలి. విభజన వల్ల సమైక్యవాడులనబడే కొద్దిమంది కి వచ్చే నష్టాలను మాత్రమె చర్చించడం హాస్యాస్పదమ్.


ఇందులో తెలంగాణా, సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు, సమస్యలు ఎంతవరకు పరిగణనలోకి తీసికోబడ్డాయి ??? అంటే సమాధానం లేదు .  విభజన వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉంటాయి. కేవలం నష్టాలు మాత్రమె చర్చించడం తప్పుకాదు , కాని అటు తెలంగాణా, ఇటు కొంతవరకు సీమాంధ్ర ని వదిలేసి కేవలం ఒక వర్గానికి మాత్రమె పరిమితం అయితే అది సమైక్యాంధ్ర సభ అవుతుందా?


సరే విభజన వల్ల  వచ్చే నష్టాలు సాధికారంగా వివరించడానికి తగినట్లుగా అన్ని వర్గాల ఇంజినీర్లు, మేధావులు ప్రసంగించారా? కనీసం సదరు ఎంజీవోలు ప్రజలతో చర్చించారా?


 ఈ మాత్రం సభలు సీమాంధ్ర లో ఇంతవరకూ పెట్టలేక పోయారేమి ? వీళ్ళకంత దృశ్యం లేదు , రాజకీయ పార్టీల కూలీలు గా ఉద్యమం చేస్తున్నారు, రాజకీయ నాయకుల్లానే వీరు విస్తృతమైన ప్రయోజనాలగురించి మాట్లాడడం లేదు . అలాగే సమైక్యాంధ్ర లో ఉన్న తెలంగాణా వారి సమస్యల గురించి వీరు చచ్చినట్లు మాట్లాడాల్సిందే , నిజంగా సమైక్యవాదులు అయితె. కాని ముందు చెప్పినట్లు గా వివిధ రాజకీయ వర్గాల తొత్తులు ముందుంది నడిపించిన కార్యక్రమాలకు మాత్రమె వీరు పరిమితం

 కే  సి ఆర్ పుణ్యమా అని ఎన్జీవో లు పని విరామం ప్రకటించి ఊరికే కూర్చుంటే విధులకి వెళ్ళాలి కాబట్టి (ఉస్మానియా విద్యార్ధులు కొందరితో  పొల్చడం తప్పవుతుందా?) అక్కడక్కడా గర్జిస్తూ ఈ వారం లో హైదరాబాదులో  'సేవ్  ఆంధ్రప్రదేశ్' నినాదాన్ని వినిపిస్తూ పెద్ద సభ నిర్వహించారు.


వీళ్ళు ఉద్యమం, ఆందోళన అంటే   ప్రజలకి అన్ని ప్రభుత్వ సర్వీసులు నిలిపివేసి , ప్రజలని వేధించడమే అని క్రొత్తగా కనిపెట్టారు.కొన్ని సర్వీసులు సెంట్రల్ గవర్నమెంట్ఆధ్వర్యం లో ఉన్నాయి కాబట్టి జనం కొద్దిగా ఊపిరి పీల్చుకో గలుగుతున్నారు. హైదరాబాదు లో ఒక నెల సమ్మె జరిగితే గగ్గోలుపెడతారు కాని సీమాంద్ర ఉద్యోగులు మొత్తం నెలల తరబడి విధులకు దూరంగా ఉంటె , అక్కడి ప్రజల ఇబ్బందులగురించి అడిగే దిక్కులేదు.


2, సెప్టెంబర్ 2013, సోమవారం

బందోత్సవాలు

ఈనాడులో తాజావార్త :  "విజయవాడలో రేపు ప్రైవేటు ఆస్పత్రుల మూసివేత "

ఇదేంటబ్బా  గత నెలరోజులుగా జరుగుతున్న సమైక్యాంద్ర ఉద్యమం మూలంగా బస్సులు లేక, ఆటోలు అందకా ఎప్పుడో మూసివేసారుగా చాలా ప్రైవేట్ క్లినిక్కులు అని సందేహం వచ్చింది. ప్రస్తుతం ముందే డబ్బులు చెల్లించిన వారు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తూ కూర్చోవాల్సిన పరిస్థితి. ఫోన్ చేస్తే పలకదు , అక్కడెవరూ లేరని నిర్దారించేసుకొని వాళ్ళే మల్లి ఫోన్ చేసే వరకు గోళ్ళు కొరుక్కుంటూ కూర్చోడమే (డెంటల్ ప్రాబ్లెమ్ అయితే ఆ ఆప్షన్ కూడా ఉండదనుకోండి ) .   


ఇప్పుడు అఫీషియల్గా పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్స్ కి కూడా గిరాకీలు తగ్గిపోయాయి కావచ్చు. పోష్ గా ఉంటుందని సమైక్యాంద్ర కి మద్దతుగా అని కూడా చెప్తున్నారు.లేదంటే  ఆంధ్రాకి కొత్త రాజధాని వస్తే  ప్రైవేట్ హాస్పిటల్స్ బిజినెస్ దెబ్బతింటుందేమో ?


ఒక్క ఆర్టీసీ బందు, ఇన్ని తప్పనిసరి బందులను తెస్తుందా అని బోలెడంత ఆశ్చర్యం వేసింది. 

ఆర్టీసీ ఎందుకు బంద్  చేస్తోంది అంటే వాళ్లకి కి వచ్చే ఆదాయం లో సింహభాగం తెలంగాణా /హైదరాబాదు నుండే వస్తున్నది(ట ). మనకి కూడా రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ కి బస్సు/టోల్  చార్జీలు పెరిగిపోతాయి. అలాగే తెలంగాణా, హైదరాబాదుల్లో ఉన్న ఆంధ్రులకి కూడా స్వగ్రామం వచ్చి వెళ్ళడానికి ఖర్చులు పెరుగుతాయి కదా.


అయినా అప్పుడు హైదరాబాద్ కి ఎందుకు వెళ్తాం..హ్మ్ ఎయిర్పోర్ట్  కి అంటే తప్పదు . త్వరగా ఆంధ్రా  కి (లేదా సమైక్యం లో మా ఆంధ్రా కి )ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్  వచ్చేస్తే బాగుణ్ణు. ఇంకేమున్నాయబ్బా హైదరాబాదు లో !!!!

బంధువులు ఉన్నారు కాని , వాళ్ళే చక్కగా ఊర్లకి రావాలి కాని మనమెందుకూ వెళ్ళడం . అదీ సంగతి సగటు ఆంద్ర పౌరుడికి హైదరాబాదుతో పనేం లేదు. అక్కడ వచ్చే ఆదాయం తో ఇక్కడ అభివృద్ధిగట్రా చేస్తారనుకోడం భ్రమ. 


సమస్యలేమయినా ఉంటె గింటే ఉద్యోగులకే.  దాచుకొన్న సేవింగ్స్ అక్కడ హైదరాబాదులో  ఇన్వెస్ట్ చేసిన వుద్యోగులకయితే ఇంకాస్త కష్టమూ.  అయినా ఏదయినా స్థలం కొనుక్కునే ముందు, దేశం లో ఎక్కడయినా  కాని పనికొస్తుందా లేదా అని చూడకుండా రేటు పెరుగుతుందని మాత్రమే కొనడం శాడిజం క్రిందకి వస్తుంది . దాని వల్ల ఇప్పుడు భూముల అసలువిలువ లెక్క కట్టడం మానవ మాత్రులకి సాధ్యం కాదు. సామాన్యుడు ఈ పోటీలో  కాస్తంత చిన్న గూడు కూడా కట్టుకోలేడు . పంట పండించే రైతుకూలీ కి పొలం దొరకదు.