30, మే 2023, మంగళవారం

సంఘ సంస్కర్త పోతులూరి వీరబ్రహ్మం


(సినిమాలకీ, గుడిగోపురాల్లోని విగ్రహాలకీ, పనికిరాని కాలఙ్ఞాలకీ ఆవల వాస్తవికమైన వీరబ్రహ్మం జీవితం చదవడవాలనేవాళ్లకోసం)

రచయిత-యం.వి. ఆంజనేయులు, విజయవాడ, 2018. చదవండి..

సాంఘిక దురాచాలతో మగ్గుతున్న ఈభారత సమాజాన్ని సంస్కరించాలని ఎందరో మహానుభావులు కలలు కన్నారు. దానికై ఎంతో కృషిచేశారు. అలాంటి సంస్కర్తలలో పోతులూరి వీరబ్రహ్మం అగ్రగణ్యుడు.

బ్రహ్మంగారుగా, కాలజ్ఞానకర్తగా తెలుగుప్రజలకు పరిచితులైన పోతులూరి వీరబ్రహ్మం కడప జిల్లాలో క్రీ.శ.1608వ సంవత్సరంలో పరిపూర్ణమయా చార్యులు, ప్రకృతాంబ దంపతులకు జన్మించారు. వీరిది వడ్రంగి కుటుంబం. పుట్టిన వెంటనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అనాధ అయిన ఆ బిడ్డను, బిడ్డలు లేని వీరభోజయాచార్యులు,వీరపాపమాంబ అనేదంపతులు చేరదీసి కొంతమేరకు పెంచారు. అయితే వృధ్ధాప్యంవల్ల ఆ దంపతులు పెంచలేక పోయారు. ఫలితంగా అతను గరిమిరెడ్డి బ్రహ్మానంద రెడ్డి, అచ్చమ్మగారి ఇంటికి చేరాడు. వారు రెడ్డి కులస్తులు. వ్యవసాయం, పశుపోషణ వారి వృత్తిగా ఉండేది. వారి ఇంట్లో చాలాకాలం పశువుల కాపరిగా ఉన్నాడు. నిజానికి వడ్రంగి కులంవారు వ్యవసాయదారులకు వ్యవసాయపనిముట్లు చేసి ఇచ్చే వారు. అంతేగాని పశువులు కాసేవారు కాదు.ఎవరి ఇంట పాలేరు పని చేసేవారుకాదు. అలాంటిది వీరబ్రహ్మం శూద్ర కులస్తుల ఇంట పశువుల కాపరిగా మారాడు.
(బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య కులస్తులు కాని వారందరు శూద్రులే,నేడు విశ్వ బ్రాహ్మణులుగా పిలువబడేవారు కూడ శూద్రులే)ఈ సంఘటనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆలోచింప జేసింది. 

ఆనాటి బ్రాహ్మణులు కులాధిక్యతను ప్రదర్శించేవారు. వారిని అనుకరిస్తూ విశ్వ బ్రాహ్మణులు కూడ పోటీబడి అంటరాని తనాన్ని పాటించేవారు.వేరే కులస్తుల ఇళ్ళలో భోజనాలు చేసేవారు కాదు. కులాచారాలు అంత నిక్కచ్చిగా పాటిస్తున్న రోజులలో, విశ్వబ్రాహ్మణ కులంలో పుట్టిన బ్రహ్మంగారు అనివార్యంగా రెడ్ల ఇంట భోజనం చేయటమే కాకుండా వారి ఇంట పశువులు కాయవలసి వచ్చింది. అప్పుడే ఈ కులాలు తప్పని, దీనివలన ప్రయోజనం లేదు అని మనుషులందరు సమానమేనన్న విషయం ఆయనకు ఆర్ధమయింది. 

అంతే కాకుండా ఆనాటి దేశ పరిస్థితులుకూడా ఆయన ఈ ప్రపంచాన్ని, దాని గమనాన్ని పరిశీలించడానికి దోహద పడింది. ఆనాడు కడప ప్రాంతం విజయనగర రాజుల ఏలుబడిలో ఉండేది. బ్రహ్మంగారు జన్మించేనాటికి విజయనగర సామ్రాజ్యాన్ని రెండవ వేంకట రాయలు(1586-1614) పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ తర్వాత రెండవ శ్రీరంగరాయలు ప్రభువయ్యాడు. 
ఆయనకుటుంబం హత్యకు గురైన అనంతరం రామదేవుడు, ఆయన అనంతరం మూడవ వెంకట రాయలు, ఆయన అనంతరం మూడవ శ్రీరంగరాయలు (1642-1652) ఆ ప్రాంతాన్ని పరిపాలించారు. మూడవ శ్రీరంగరాయలు తర్వాత విజయనగర సామ్రాజ్యం పతన మయింది. అంటే బ్రహ్మంగారి కళ్ళముందే ఈ మార్పులన్నీ జరిగాయి. 

బహ్మనీ సుల్తానులు, దక్కను సుల్తానులు విజయనగరంపై తరచు దండయాత్రలు చేస్తుండేవారు. బ్రహ్మంగారు జీవించిన కడప ప్రాంతం విజయనగర ప్రభువులకు గవర్నరుగా నియమితులైన గండికోట నాయకుల ఆధీనంలో సుమారు రెండు శతాబ్దాలపాటు ఉన్నది. 1565లో గోల్కండకు చెందిన మిర్జాముల్లా అనే అతను, గండికోట నాయకుడైన పెమ్మసాని తిమ్మయ నాయుడును ఓడించి ఆప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆనాటినుండి 1800లో బ్రిటీష్‌ వారు స్వాధీనంలోకి తీసుకునే వరకు కడప ప్రాంతానికి ముస్లింలే పాలకులుగా ఉండేవారు. అదేవిధంగా ఆయన కాలంలోనే భారత దేశంలోకి, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోకి విదేశీయులు రావటం, వారి అధికారం నానాటికీ విస్తరించటం జరిగాయి. 

1639లో ఈస్టిండియా కంపెనీ మద్రాసు నగరాన్ని స్థాపించింది.1661లో పోర్చుగీసువారు పశ్చిమతీరమైన గోవా నుండి బొంబాయి వరకు ఆక్రమించారు. 1690లో ఈస్టిండియా కంపెనీవారు హుగ్లీనది ఒడ్డున కలకత్తా నగరాన్ని ఏర్పాటుచేశారు. ఈస్టిండియా కంపెనీ వారు, పోర్చుగీసువారు, సుల్తానులు పరస్పరం నిరంతరం కలహించుకుంటూ ఉండేవారు. ప్రభువుల మధ్యవచ్చిన ఈ కలహాల ప్రభావం కడప, కర్నూలు ప్రాంతాలపై తీవ్రంగా ఉండేది. ఈ రాజకీయ పరిణామాలు కూడా బ్రహ్మంగారి జీవితాన్ని ప్రభావితం చేశాయి. తాను పుట్టినది ఇతర కులాలపట్ల అంటరానితనాన్ని పాటిస్తున్న విశ్వబ్రాహ్మణకులం. కాని పెరిగింది రెడ్డి కులస్తుల ఇంట. పాలిస్తున్న ప్రభువు ముస్లిం. దేశంలో అధికారాన్ని విస్తరింప జేస్తున్నది క్రైస్తవ మతస్తులైన విదేశీయులు. ఈ పరిస్థితి కులానికి, మతానికీ ఉన్న సంబంధాన్ని,రాజకీయ విషయాలను తరచిచూసే విధంగా ఆయనను ప్రేరేపించింది. అలా సమాజ పరిశీలననుండి ఆవిర్భవించినదే ఆయన కాలజ్ఞానం.

ఆయన కులాలను గురించి అధ్యయనం చేశాడు. అధ్యయనం చేయటానికి ఆనాటికి ఆయనకు లభించినవి సాహిత్యం పురాణాలే. ఆ పురాణాలలో కులాలు ఉన్న తీరును ఆయన అధ్యయనం చేశాడు. కులాలు ప్రారంభం నుంచి లేవని, మధ్యలో కొందరి స్వార్ధంకోసం ఏర్పాటు చేసినవేనన్న నిర్ణయానికి వచ్చాడు. గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంటి నుండి బయటకు వచ్చిన అనంతరం కందిమల్లయ్యపల్లె చేరాడు. అక్కడే వడ్రంగం చేసుకుంటూ 80 సంవత్సరాల వయసు వచ్చేవరకు జీవించాడు. ఐదుగురు బిడ్డలకు తండ్రి అయినాడు. 

ఆరోజులలో గ్రామ దేవతైన పోలేరమ్మకు జంతువులను బలి ఇచ్చే ఆచారం ఉండేది. కందిమల్లయ్యపల్లెలో జరుగుతున్న జంతుబలిని ఆయన అడ్డుకున్నాడు. ఏజంతువుదైనా ప్రాణం, ప్రాణమేనని. ప్రాణాలను బలికోరే దేవుళ్ళు రాక్షసులౌతారేతప్ప దేవతలు కాలేరని ఆయన వారితో వాదించి వారిని అంగీకరింప జేశాడు. తన జీవిత కాలంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలను సందర్శించాడు. వెళ్ళిన ప్రతి చోట కులాలు తప్పని బోధించాడు. నేటి నిమ్నకులాలవారే రేపు పాలకులౌతారని ప్రబోధించాడు. ఇలా ప్రబోధించడంవలన ఈయన అనేక దూషణ భూషణలను ఎదుర్కొన్నాడు. 

తన పర్యటనలో భాగంగా ఒకసారి పుష్పగిరి అగ్రహారం వెళ్ళాడు. అగ్రహారీకులైన బ్రాహ్మణులు ఆయనను అడ్డుకుని అవమానించడానికి ప్రయత్నించారు. కులవ్యవస్థను అప్రతిష్టపాలు చేస్తున్నాడని ఆయనను నిందించారు. వేదాధ్యయనం చేసి వేదాలకు భాష్యంచెప్పే అధికారం విప్రులకే తప్ప అన్యులకు లేదని, విప్రుడు కానివాడవైన నీవు వేదాలకు భాష్యం ఎలా చెబుతావని ప్రశ్నించారు. వీటికి సమాధానం చెప్పనిదే అక్కడనుండి కదలనివ్వమని బెదిరించారు. ఆసందర్భంలో ఆయన కులాలపుట్టుకను గురించి పురాణ సాదృశంగా చేసిన ప్రసంగం పరిశీలిస్తే ఆయన పురాణాలను ఎంతలోతుగా, ఎంత హేతుబధ్ధంగా అధ్యయనం చేశాడో అర్ధమవుతుంది. అది చదివిన వారికి ఆశ్చర్యం కలిగించక మానదు. 

ఆరోజులలో చదువు నేర్చుకోవడమంటే వేదాలను, పురాణాలను నేర్చుకోవటమే. చదువు నేర్చుకునే హక్కు బ్రాహ్మణులకు మాత్రమే ఉన్నదని, శూద్రులకు లేదని,శూద్రులు వేదం చదివితే నాలుకను కోయాలని, శూద్రుడు వేదం వింటే అతని చెవిలో సీసం కరిగించి పోయాలని బ్రాహ్మణులు ప్రచారం చేసేవారు. చెవులకు ఉన్న సహజ లక్షణం వినడమేనని, శూద్రుడు వేదం వినకూడదు అనుకుంటే, తప్పు వినపడేటంత బిగ్గరగా చదివినవారి గొంతుదే తప్ప, వినేవారి చెవులది కాదని బ్రహ్మంగారు వారికి జవాబిచ్చాడు. వేదాలను నేర్చుకునే అధికారం శూద్రులకు కూడా ఉందని ఆయన స్పష్టం చేశాడు. ఆవిధంగా చదువు సామాజికమైనదని, ఎదో ఒక కులానిది కాదని,శూద్రులు,అస్పృశ్యలతో సహా అందరికీ చదువుకునే హక్కు ఉందని ఆయన ఆనాడే ఎలుగెత్తి చాటాడు. ఆవిధంగా విద్య విషయంలో శూద్రులకు, హరిజన గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని, వివక్షతను ఆయన నిరసించాడు. 

కులతత్వం తప్పని ప్రచారం చేస్తున్న ఆయనపై దాడి జరిపిన వారు కేవలం బ్రాహ్మణులే కాదు. తన కులస్తులైన విశ్వబ్రాహ్మణుల నుండి కూడా ఆయన దాడులను ఎదుర్కొన్నాడు. ఒకసారి ఆయన పెద్దఆరికట్ల అనే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు, తమ కులాన్ని భ్రష్టుపట్టిస్తున్నావని ఆయనను ఆక్షేపించారు. వారిని కూడా ఆయన .ఎదుర్కొని కులం తప్పని బ్రాహ్మణులకు స్పష్టపరిచిన విధంగానే వారికీ స్పష్టం చేశాడు. 

బ్రహ్మంగారు కేవలం కులతత్వాన్ని వ్యతిరేకించడమే కాదు. మతసామరస్యాన్ని కూడా ప్రబోధించాడు. ముస్లింలకు హిందూ మతాన్ని బోధిస్తున్నాడన్న ఆరోపణపై విచారించడానికి కడప నవాబు బ్రహ్మంగారిని తన ఆస్థానానికి పిలిపించాడు. హిందూ, ముస్లిం మతాలలో ఏమతం గొప్పదని నవాబు బ్రహ్మంగారిని ప్రశ్నించినపుడు, ఏ మతానికుండే ప్రత్యేకత ఆ మతానికున్నదని, మతాల మధ్య పరస్పర గౌరవం ప్రేమ ఉండాలని బోధించాడు. ఆయన వాదనలు విన్న కడప నవాబు సంతృప్తితో తమ పాలనలో హిందూ ముస్లింల ఆచార సాంప్రదాయాలు సమానంగా గౌరవించబడతాయని ప్రకటించాడు. ఆవిధంగా మతసామరస్యానికి తోడ్పడ్డాడు.

అయితే బ్రహ్మంగారు కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం కాలేదు. ఆయన ప్రబోధించిన వాటిని ఆచరణలో చేసి చూపాడు. ఆయన కుల,మత తత్వానికి వ్యతిరేకంగాను, కాలజ్ఞానాన్ని బోధిస్తున్న తరుణంలో తన బిడ్డలనుకూడా కాదని దూదేకుల సిద్దయ్యను తనకు శిష్యుడుగా చేర్చుకున్నాడు. దూదేకుల అనేవారు ముస్లిం మతంలోకి మారిన దళితులు. అటువంటి దూదేకుల సిద్దయ్యను తన ప్రధమ శిష్యుడుగా చేర్చుకొని తన ఇంట్లోనే ఉంచుకొని, తన పెద్దబిడ్డగా ఆదరించాడు. తన తదనంతరం తన సిద్ధాంతాల ప్రచార బాధ్యతను సిద్దయ్యకే అప్పగించాడు. బ్రహ్మంగారి బోధనలకు ప్రేరితులైన వారు ముత్తి, కక్కయ్య దంపతులు. వీరు మాదిగ కులస్తులు. 
ఆ రోజులలో మాదిగలు గ్రామాలలోకి వచ్చే అవకాశంలేదు. పంచములని వారిని దూరంగా ఉంచేవారు. వారు ఎదురు పడితేనే మహాపాపమని తలచేవారు. అలాంటి స్థితిలో బ్రహ్మంగారు వారి ఇంటికి వెళ్ళి, వారితో కలిసి భోజనం చేసి, వారిని తమ శిష్యులుగా స్వీకరించాడు. ఆరోజులలో అది గొప్ప సాహసమే.

ఆయన అంతటితో ఆగలేదు. 80 సంవత్సరాల వయస్సులో ఆయన సమాధి పొందాడు. తన తదనంతరం వైశాఖ శుధ్ధ పంచమి రోజున అంటే తాను సమాధి చెందిన రోజున ప్రతి ఏటా ఆరాధనను నిర్వహించాలని, ఆరోజున తన సమాధివద్ద కక్కయ్య వంశస్తులే అంటే మాదిగ కులస్తులే ప్రధమ నైవేద్యం పెట్టాలని ఆయనే ప్రకటించాడు. ఆయన కోరిక మేరకు బ్రహ్మంగారి మఠంలో ఆయన ఆరాధన రోజున మాదిగ కులస్తులు ప్రధమ నైవేద్యం పెట్టిన అనంతరమే తదుపరి కార్యక్రమాలు జరగటం ఇటీవలవరకు పాటించారు. గత కొంతకాలగా మఠ నిర్వాహకులు ఆ సంప్రదాయాన్ని నిలిపివేయటం బాధాకరం. 

ఆయన అనంతరం ఎంతోమంది కులమతాలకతీతంగా తమ బిడ్డలకు బ్రహ్మయ్య, బ్రహ్మానందం,సిద్దయ్య అని పేర్లు పెట్టుకున్నారంటే ఆయన ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడో అర్దమవుతున్నది. 
మొత్తంగా చూచినప్పుడు కులానికి వ్యతిరేకంగా పోతులూరి వీరబ్రహ్మం చేసిన కృషి చాలా గొప్పది. కులాలు సమసి పోవాలన్న ఆశయం చాలా గొప్పది. అయితే కులాలు నేటికీ సమసి పోలేదు. ఆయన కులాన్ని తప్పు అన్నాడు. కులం పోవాలని కోరుకున్నాడు. ఆ విషయాన్ని అయన మనసా, వాచా, కర్మణా నమ్మాడు. అందుకే అయన ఆచరించి చూపాడు. కాని ఆయన కులం తప్పు అనడానికి కేవలం పురాణాలనే ఆధారంగా ఎంచుకున్నాడు. అంతకు మించి ఆయన చూడలేక పోయారు. అందుకే ఆయన వరకైతే ఆయన ఆచరించి చూపగలిగాడు గాని, ఇతరులను ప్రేరేపించలేక పోయాడు. ఆయన జీవ సమాధి పొందిన 400 ఏళ్ల తర్వాత కూడా తన కులస్తులైన విశ్వబ్రాహ్మణులు కాని, విశ్వబ్రాహ్మణేతరులుకాని ఏ ఒక్కరు కులాన్ని వదలి పెట్టలేదు. 

బ్రహ్మంగారు కులానికి పునాదిగా ఉన్న ఆర్ధిక సంబంధాలను చూడలేక పోయినందువలననే, అందరూ ఆచరించేవిధంగా కుల సమస్యకు పరిష్కారాన్ని చూపలేక పోయారు. ప్రపంచ వ్యాపితంగా పక్కా ఫ్యూడలిజం అమలు జరుతుతున్నరోజులవి. కనుక ఆయన అంతకంటే లోతులలోకి చూసే అవకాశం ఆనాడు లేదు. ఒక్క బ్రహ్మంగారే కాదు. ఆ తర్వాత వచ్చిన జ్యోతీరావుపూలే, రామస్వామి పెరియార్‌, అంబేద్కర్‌ లాంటివాళ్ళుకూడా కులానికి వ్యతిరేకంగా పోరాడారు. అయితే వీరి పోరాటం కూడా పైకి కనుపించే కులచట్రం వరకే పరిమితమైంది. వీరుకూడా ఎక్కువ భాగం పురాణాలమీదనే ఆధారపడ్డారు. దాని వెనుకనున్న ఫ్యూడల్‌ ఆర్ధిక సంబంధాలను పెద్దగా పట్టించుకోలేదు. అందుకే అవి కుల పోరాటాలుగానే మిగులుతున్నాయి. ఏది ఏమైనా వీరందరి ఆశయం చాలా గొప్పది. వీరి ఆశయాన్ని నెరవేర్చటం మనందరి కర్తవ్యం. ఫ్యూడల్‌ ఆర్ధిక సంబంధాలను బద్దలు కొట్టడం ద్వారానే ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలం.
(బ్రహ్మంగారి జయంతి 25.4.18 సందర్భంగా వ్రాసిన వ్యాసం)