9, మే 2012, బుధవారం

మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఈ  సిరీస్ లో మొదటి బాగం చూడాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


నేను ఈ సిరిస్ లో సరి అయిన సమయం లో దత్తత తీసికొన్న పిల్లలకి నిజం చెప్పక పోవడం వలన కలిగే సమస్యలని, తీసికోవలసిన జాగ్రత్తలను మాత్రమె చర్చించ దలుచు కొన్నాను. అందువల్ల తల్లిదండ్రుల పొరబాట్లను చర్చించడం తప్పని సరి, దాని అర్ధం దత్తత తీసికొనే తల్లిదండ్రులని తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం కాదు. అలాగే సరి అయిన సమయం అంటే ఆ పిల్లలకి మెచ్యురిటి వచ్చిన తర్వాత అన్న అపోహ ను కూడా బ్లాగర్లలో చూసాను.



దత్తత తీసికోదలచిన తల్లిదండ్రులకు ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన అవగాహనలు:



౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ఆ తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొకరిద్వారా ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము కాబట్టి, ఆ బిడ్డ చెవితో విన్నదానిని అర్ధం చేసికొనే వయసుకు రాగానే చెప్పెయ్యాలి. అలా చెప్పకూడదు అంటే కృష్ణప్రియ గారి ఈ టపా లో దంపతుల మాదిరిగా, బంధువులకు కూడా తమ బిడ్డ దత్తత చేసికొన్న బిడ్డ అని తెలియనివ్వకూడదు (వారు అందరికి దూరంగా నివసించడం వాళ్ళ ఇది సాధ్యపడి ఉండొచ్చు )



౨. తల్లిదండ్రులకు తాము దత్త త తీసికోబోయే బిడ్డ యొక్క అసలు తల్లిదండ్రులు తెలిసే అవకాసం లేనందున, వారి కులము మతము కూడా తెలిసే అవకాసం లేదు. కాబట్టి అప్పటి నుండి తల్లి దండ్రులు కుల మత విశ్వాసాలను వదిలెయ్యాలి. అలా వదిలెయ్యడమే న్యాయం కుడా నిజం గా దత్తత తీసికొన్న బిడ్డపై నిజమైన ప్రేమ ఉంటె. ఎందుకంటే నిజం తెలిసాక ఆ బిడ్డకి తన కులము మతము ఇది కాదు అన్న బాధ కలగ కూడదు. అగ్ర వర్ణాలలో ఈ సమస్య అధికం, ఎందుకంటే వారికి ఉండే కుల దురాభిమానం ఆ బిడ్డకి కూడా వస్తుంది. నిజం తెలిసాక తన అసలు కులం ఏదో తెలియక, అప్పటి వరకు పెంచుకొన్న దురాభిమానం వదులుకోలేక 'సంఘర్షణకు' లోనవుతారు. ఆ సంఘర్షణ ప్రభావం వారి వివాహ సమయం లో మరీ ఎక్కువవుతుంది. అదేకులం కి చెందినా వ్యక్తిని పెళ్ళాడినా, వారికి నిజం తెలిస్తే ప్రేమను పంచుతారా అన్న సంకోచం వారిని వేధిస్తుంది. ఆ బిడ్డకి తప్ప, అందరికీ తెలిసిన నిజం, ఎక్కడి నుండో వచ్చిన జీవిత భాగ స్వామికి తెలియకుండా ఉంటుందా? అదే చిన్నతనం లోనే నిజం తెలిస్తే, తన జీవితాన్ని తము మలచుకోగలగుతారు ఈ కులాలకి, మతాలకి అతీతం గా.



౩. సాధారణం గా ఆస్తి ఉండి పిల్లలలు లేని చాలామంది ఇప్పటి తల్లి దండ్రులు ఈ రహస్య దత్తత ప్రక్రియ ద్వారా ఒక్క బిడ్డనే దత్తత చేసికొంటారు. ఆ బిడ్డను చాలా రిచ్ గా పెంచుకొంటారు (అప్పటి దాకా బందువులకు ఆశ ఉండి ఉంటుంది ) ఇది ఎవరు కాదనలేనిది. బిడ్డను విలాసాలకు, సంపదకు అతీతం గా పెంచుకోవాలా, సంపదలో ముంచి తెల్చుకోవాలా అన్నది ఆ తల్లిదండ్రుల స్వ విషయమే. కాని అదే సమయం లో అంతకు ముందు వరకు ఉన్న బంధుత్వాలను వీలయినంత వరకు నిలుపుకోగలిగితే, ఆ బిడ్డకి ఒంటరి తనం ఉండదు. అప్పుడు ఒకవేళ నిజం తెలిసినా ఆ బిడ్డలో ఈ సంపద నాది కాదు అన్న న్యూనతా భావం కాని, సంపద తనదే అన్న అహంభావం కాని ఉండదు. డబ్బే ఆ బిడ్డకు పెద్ద శత్రువు కాకుండా కాపాడాలి అన్నది ఈ పాయింట్ యొక్క సారాంశం.



౧. తమ సంతోషం కోసం 'మాత్రమె' ఆ బిడ్డని దత్తత చేసికోదలచామన్న విషయాన్ని దత్తత చేసికొన్న వారు మరచి పోకూడదు. ఆ బిడ్డ కాకుంటే ఇంకో బిడ్డను తీసికొంటారు. అలాగే వీరు కాకుంటే ఇంకొకరు ఆ బిడ్డను దత్తత చేసికొంటారు లేదా తను ఉన్నచోటే ఉండాల్సి వస్తుంది. ( కాని ఎక్కడో రోడ్డు మీద దిక్కులేక పడి ఉన్న బిడ్డపై జాలి చూపి దగ్గరకు తీసికొన్న దానితో సమానం అవదు. ) కాబట్టి ఆ బిడ్డకి విశ్వాసం ఉండాలన్న డిమాండ్ పూర్తిగా స్వార్ధపూరితమైనది. ఆ అబిప్రాయం మాములుగా జనం నుండి వస్తుంది, చూడండి వాళ్ళు తీసికొచ్చి పెంచితే రుణపడి వుండకుండా స్వార్ధం చూసుకొన్నాడు అని అంటూ ఉంటారు . నిజానికి తానెవరో తనవాల్లెవరో తెలియక కలతపడి, చదువు పై శ్రద్ద చూపలేక, మొండిగా నిర్లక్ష్యం గా మారిన పిల్ల లేదా పిల్లవాడి పై చూపాల్సింది జాలి మాత్రమె. కాని అవేవి సమాజానికి అక్కరలేదు, తమకి దక్కనిది ఆబిడ్డకి దక్కినది అన్న ఉక్రోషం తప్ప. కాబట్టి తల్లిదండ్రులే కాస్త వివేకం తో నడుచుకోవాలి.



౫. వేరేవారి ద్వార నిజం తెలిసినపుడు, ఆ మాట్లాడిన వారిని నిందించే జనాన్ని చుస్తే నవ్వు వస్తుంది. ఆ బిడ్డకి తెలియకుండా దాచిన సంగతి ఈ తల్లిదండ్రులేమైనా దండోరా వేసి చెప్పారా!!! లేదే?అలాగని అందరితో ఈ తల్లిదండ్రులకు మిత్రత్వం మాత్రమె ఉండడం సాధ్యం కూడా కాదు. అసలు అనుకోకుండా మాట్లాడిన వారందరూ స్వార్ధపరులు కాదు, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా కాదు.



౬. దత్తత చేసికొన్న బిడ్డని అతిగారాబం చేసి వారి భవిష్యత్తును పాడు చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఉందొ లేదో వారికే వదిలేద్దాము. కాని దండించే సమయం లో ఆ తల్లిదండ్రులకు నిజం గానే చెయ్యి రాదు. తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి దండించే హక్కు లేదు అన్న భావం వెంటాడుతోంది. అది ఆ బిడ్డ కి చెప్పలేనంత చెడు చేస్తుంది.



౮. ఆడపిల్లకు నిజం తెలిస్తే (బయటి వారి ద్వారా) ఇంట్లో ఉండే పిల్ల కాబట్టి పెంచిన తల్లి దండ్రులకి నిజం తెలిసి పోతుంది. అపుడు ఎలా తెలిసింది అన్న వివరాల్లోకి వెళ్ళడం మానేసి ఆ పిల్లకి తాము ఏపరిస్తితిలో దత్తత చేసికొన్నామో, తెలియచేసి అర్ధం అయ్యేలా చెప్పుకోవాలి. అవసరమైతే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి (బిడ్డకి కాదు). అసలు ఇలా దత్తత కి ఏర్పాట్లు చేసే హాస్పిటల్స్ లోనే , డాక్టర్స్ కాని ఎవరైనా దత్తకు ముందే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తే ఎంత బావున్ను.



౯.మగపిల్లలకి బయటి వారి ద్వారా తమ తల్లిదండ్రులు,స్వంత తల్లిదండ్రులు వేరు అని తెలిస్తే అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే వారు ఆ చెప్పిన వారిని పూర్తి వివరాలు అడగలేరు, అలాగని ఇంట్లో ను అడగలేరు. క్రమంగా విలాసాలకు మాత్రం దూరం అవుతారు. ఇంట్లో సమయం గడపడం తగ్గించి ఫ్రెండ్స్ తో బయట ఆటల పేరుతో గడిపేస్తారు . చదువు పై సహజం గానే ఆసక్తి పోతుంది. వారి భవిష్యత్తు అంధకారమై పోతుంది .ఇక నటించడం కూడా మొదలుపెడతారు పాపం. క్రమంగా తమ చుట్టూ ఉన్నవారి పై లోలోపల ద్వేషం పెరుగుతుంది.చుట్టూ ఉన్నవారు ఎలా నటిస్తున్నారో ఈ పిల్లలు కూడా అలాగే నటిస్తారు. పెంచిన తల్లి దండ్రులకు దూరం గా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు, కుల మత కారణాలు పెద్ద పాత్ర వహిస్తాయి. తల్లిదండ్రులకి విష్యం తెలిసే సరికి పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. రెండువైపులా తెగిన గాలి పటాలవుతారు.



మగపిల్లల్ని పెంచుకోవాలని ఆశపడే తల్లిదండ్రులు కాని, వారి చుట్టూ పక్క ల సమాజం కాని సమస్యని అర్ధం చేసికోవాలని ఆశిద్దాం.





4 కామెంట్‌లు:

  1. ౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ఆ తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొకరిద్వారా ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము కాబట్టి, ఆ బిడ్డ చెవితో విన్నదానిని అర్ధం చేసికొనే వయసుకు రాగానే చెప్పెయ్యాలి. ..... మీరన్నట్లు ఇలా చెప్పటమే నయం అనిపిస్తోందండి.

    రిప్లయితొలగించండి
  2. @Anrd

    నిజం గా పిల్లల పై ప్రేమ కలిగి, నిస్వార్ధం గా పెంచుకొనే వాళ్ళు పిల్లలకి నిజం చెప్పకపోయినా , వేరే వారి ద్వారా తమ పుట్టుకకు సంబంధించిన నిజం తెలిసినా అది పెద్ద సమస్యగా మారదు.కేవలం ఆస్తి కోసమో, తమను చూసే వాళ్ళు ఉండాలన్న ఆశ తోనో ఉన్న వాళ్ళకే ఈ సమస్య.

    ఇది సలహా మాత్రమే, తల్లిదండ్రులు తమకు తాముగా పెంచుకొన్న బిడ్డకు నిజం చెప్పగలగాలి అంటే వారు చాలా నిజాయితీ పరులై ఉండాలి, తమ పెంపకం పై నమ్మకం ఉండాలి.

    రిప్లయితొలగించండి
  3. http://www.sudatta.org/beginning.htm

    the prospective adoptive parents and those parents who has already adopted kids should definitely visit this site. it is a voluntary organization which help such couples. They give counseling and conduct workshops for pre- adoptive parents.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారు

      చక్కని సమాచారం ఇచ్చారు. మరియు అక్కడ చాలామంది అనుభవాలు అభిప్రాయాలు కు దగ్గరగానే నా విశ్లేషణ కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరింత మందికి ఈ సమాచారం అవగతం అవాలని, వారికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను.

      ధన్యవాదములు

      తొలగించండి