ఆరెంజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆరెంజ్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, డిసెంబర్ 2012, ఆదివారం

వోడ్కా విత్ వర్మ -1 ( నిర్జన వారధి )

ఈ మధ్యకాలం లో అనుకోకుండా చదివిన రెండు పుస్తకాలు నిర్జన వారధి , వోడ్కా విత్ వర్మ.  తెలుగు పుస్తకాలు చదవాలి అని ఆసక్తి లేదు. కాని వివాహం లో ఆత్మాభిమానం గురించి, నాకు తెలిసిన ఒక మంచి జంట గురించి ఆలోచిస్తూ మొదట  డాక్టర్ రమణ   గారి టపా నుండి కొన్ని ప్రశ్నల కోసం అన్వేషణ మొదలయ్యింది. అదే రోజు అదృష్టవశాత్తు  జాజిమల్లి గారితో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాసం కలిగింది. నిర్జన వారధి గురించి నా ఆలోచనలు  ఇక్కడ పంచుకొన్నాను  .

వోడ్కా విత్ వర్మ అది ఒక పుస్తకమని నిన్నటి దాకా తెలియదు  . ఏదో ఒక రివ్యు కంటబడింది. అది వ్రాసినది శ్రీ రమణ గారు కాదనుకుంటా. అందుకే రివ్యు కాస్త సిల్లీ గా అనిపించింది.  క్రిస్మస్ సెలవులు కదా అలా గ్రేట్ ఆంధ్రాలో విహరిస్తూ ఎంబీయస్ గారి వ్యాసం చూడడం,  వెంటనే పుస్తకం చదవాలి అనిపింఛి చదివేసాను. నాకయితే పుస్తకంలో ఎక్కడా వర్మ ని  పొగిడినట్లు అనిపించలేదు. కొంచెం తిట్లు ఎక్కువ కనిపించాయి :) . అలాగే నా ఇష్టం పుస్తకం, అప్పట్లో  నేనే  ఫ్రీ కాపి సంపాదించి బ్లాగుల్లో , బజ్జుల్లో  జానలకి షేర్ చేసికొన్నాను. నా ఇష్టం కి ఏ మాత్రం సంబంధం , పొంతన లేని పుస్తకం వోడ్కా విత్ వర్మ అవడం వల్ల ఆ పుస్తకం లా కేవలం హైప్, క్రేజ్ తో కాక చక్కని కంటెంట్ వల్ల బోలెడన్ని సార్లు ముద్రించ బడుతుంది . అయినా చదివే వారి దృష్టికోణాన్ని బట్టి మాత్రమె వారికి అంతవరకే అర్ధం అవుతుంది, ఈ పుస్తకం కూడా అన్ని పుస్తకాలు లానే. 

నిర్జన వారధి  కీ,  వర్మ పుస్తకానికీ ఉన్న దగ్గరి సంబంధం బహుసా అందరికీ అనుభవం లోకి రానిదేమో.  ఈ రెండింటి ఉన్న సంబంధం నాకయితే నచ్చింది. అచ్చు కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఈ టపా లో నా చివరి వ్యాఖ్య లో ఉన్న నా అభిప్రాయం  లానే , ఇంకొకరు ఇంచుమించు అదే విధం గా వర్మ వివాహం విషయం లో ఆయన కుటుంబ సభ్యులు  ప్రస్తావించారు.

మిగిలిన భాగాలలో పుస్తకం పై నా అభిప్రాయాలు వ్రాయాలి.  ఎంబీఎస్ గారికి చాలా చాలా ధన్యవాదములు, ఒక మంచి పుస్తకాన్ని చక్కగా  పరిచయం చేసినందుకు.

19, ఏప్రిల్ 2011, మంగళవారం

లౌక్యం ముదిరితే రాజకీయం అవుతుంది

నెమలికన్ను గారి లౌక్య౦ టపా చదివారా . లేద౦టే ఒక్క సారి చూడ౦డి.  లౌక్యము అంటే ఏమిటి?  అన్న ఆలోచన తొ  మొదలుపెట్టారు కాని, తనకు తాను గానె చాలా ప్రశ్నలు వేసుకొని సమాధానాలు చెప్పడానికి ప్రయత్ని౦చారు. ఈ టపా శీర్షిక కూడా వారు అభిప్రాయపడినదె.

ఇ౦కెవరో అన్నట్లు టపా కాస్త కన్నా ఎక్కువగానే కన్ఫ్యూస్ చేశారు... వ్యాఖ్య వ్రాస్తు౦టే అదే ఒక పుట అయ్యి౦ది. చెసెది లెక టపా పోష్టు చెస్తున్నాను. వారి టపాను౦డి ఒక నాలుగు వ్యాక్యాలపై నా అభిప్రాయ౦ ఇలా ఉ౦ది.

@అవతలి వాళ్ళని నొప్పించకుండా, మనకి కావాల్సిన విధంగా వాళ్ళని ఒప్పించడం లౌక్యం అనిపించుకుంటుందా?

కాదు.  కానే కాదు.

@లౌక్యంలో యెంతో కొంత మోసం ఇమిడి ఉందా?


మోస౦ ఉ౦డే అవకాశ౦ ఉ౦ది. కాని అది రె౦డువైపులా ఆలోచి౦చి నిర్ధారి౦చాలి.ఆ మోస౦ ఎ౦తవరకు అని.

ఉదా: 'తెల్లవారకు౦డు గాక' అన్న సతీసుమతి ని మాట వెనక్కి తిసికొమని అడగడానికి వచ్చిన అనసూయ మొదట లౌక్యాన్నే ప్రదర్శి౦చేది. కాని అక్కడ లోకానికి ఉపకార౦ చెయ్యడమే కాక, చివరికి సుమతికి నష్ట౦ జరుగని బాధ్యత కూడా తను తీసికొ౦టు౦ది.

అలా 'స్వార్ధ౦' లేన౦త వరకు 'లౌక్య౦' మోస౦ అవ్వదు.

@అబద్ధం చెప్పక పోవడానికీ, నిజం చెప్పకుండా ఉండడానికీ ఉన్న భేదం లాంటిదే ఏదన్నా మోసానికీ, లౌక్యానికీ మధ్యన ఉందా?


అబద్ద౦, నిజ౦ రె౦డూ చెప్పకు౦డా ఉ౦డట౦ సాధ్యమా? ఏదో ఒకటి తధ్య౦. స్వార్ధాన్ని బట్టి ఆ అబద్ద౦ చిన్నదా, పెద్దదా అని ఉ౦టు౦ది.

లౌక్యం అనేదే చూపించకుండా బతకడం సాధ్యమా?


స్వార్ధ౦ ఉన్నప్పుడు లౌక్య౦ లేకు౦టె కష్ట౦. స్వార్ధ౦ మ౦చిది గా ఉన్నన్ను నాళ్ళు, లౌక్య౦ కూడా మ౦చిది గానె ఉ౦టు౦ది. ఇదే మీరన్న పరిమితి అనుకు౦టున్నాను.

@ఆయన లౌక్యం ముందు మన జాగ్రత్త ఎందుకూ పనికి రాలేదు కదా అనిపించక మానదు.

మీకు నిజ౦ తెలిసినా, అనుమాన౦ ఉన్నా అవతలి వాళ్ళ 'లౌక్య౦' తెలుస్తు౦ది. లేకపొతే తెలిదు. నమ్మక౦ ఉన్నచోట లౌక్య౦ కనిపి౦చదు కదా?

ఇంతకీ లౌక్యము అంటే ఎదుటి వాళ్ళని మరీ ఎక్కువ మోసం చేయకుండా మనక్కావాల్సింది సాధించుకోడమేనా???

సుఖ౦ గా ఉ౦డాల౦టే స్వార్ధానికి సమపాళ్ళలో లౌక్య౦ ఉ౦టే, పులుపు కు సరిపడా వేసిన వుప్పు లాగా బాగు౦టు౦దేమొ :)
 

17, జనవరి 2011, సోమవారం

ఆరెంజ్ - హీరో జానూ ని ఎందుకు ప్రేమించాడు అసలు అంటే!!

నిజానికి సినిమా చూసిన వారికి సామాన్యం గా ఈ అనుమానము రాదు. మొదటే రామ్, జానూ కి  తను  గీసిన బొమ్మ (హీరోయిన్ దీ )  చూపించిన సీన్ లో చెప్పేస్తాడు  కదా, తన  మొహం  ఎందుకు   నచ్చింది అని. అలాగే చివరి లో కూడా చెప్తాడు, అప్పుడు అలా ఉండేది ,ఇలా ఉండేది అని ...ఇంకా తర్వాత .ఒక సాంగ్ మధ్య లో నేమో, అసలా మొహం చూస్తె ప్రేమే రావడం లేదని భలే నిజం చెప్పేస్తాడు!!!  మరి ఆ అమ్మాయి మొహం ఇప్పుడు అతనికి నచ్చడం లేదు (బాగా ఏడిపిస్తున్నది కదా అప్పటికి ) ..ఆ సీన్ లో అచ్చు నాగబాబు నవ్వినట్లే మనమందరం ఫక్కున నవ్వుతాము ..సరదాగా, నిజం లాగా ఉంటుంది వాళ్ళ పోట్లాట ...


అయినా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాక, ఎలాంటి వారు నచ్చుతారు అనేది చూసినప్పుడు తెలిసిపోవడం ఒక పద్దతి.. ఇక్కడ హీరో జానూ ఒక్కమ్మాయి  తోనే  మొదటిసారి సారి చూడగానే ప్రేమ అని వెంట పడలేదు. ముందు కూడా అలానే జరిగింది. కాకపోతే మొదటి సారి  అందం చూసి  వెంట వెళ్ళాడు. ఇంకా ఒక వ్యక్తి కళ్ళు, నవ్వు మనకి యెంతో కొంత నిజాన్ని తెలియ చేస్తాయి ..మనం చూడగలిగితే ..ఇక్కడ జానూ ని మొదట హీరో అలాంటి స్తితి లోనే చూస్తాడు ..ఆ అమ్మాయికి ప్రేమ అంటే ఇష్టం అని అనుకొంటాడు(ట), ఇక రామ్ కి కూడా ప్రేమ అంటే ఇష్టమే మరి (అంటే మనకి ఉండే ఇష్టం కాదండోయ్ ..అతను చెప్పే ప్రేమ వేరే కదా ) .   'జానూ' (జెనిలియా) నవ్వు సీన్ చాలామందికి అతిగా ఉంది కాని , మన బ్లాగుల్లోను , బజ్ , చాట్ లో ..కెవ్వు ..కేక ..నా బొంద అని ఒక్కో రేంజ్ లో చెప్తారు కదా..అదే ఇది ..కాబట్టి మీకు అర్ధం అయ్యిందనుకుంటాను ఆ అమ్మాయి చేసి చూపిస్తే అసయ్యం గా  ఉంది అంటూ  మరి అలా కెవ్వ్!!  కెవ్వ్!!!  మనే  వాళ్ళలో మనమూ ఉంటున్నామే



ఈ అమ్మాయి అలా సంకోచాలు అవి లేకుండా  తన ఆనందాన్ని  ఎక్ష్ప్రెస్స్ చెయ్యడం అతనికి నచ్చింది ( నానా అర్ధాలు తియ్యకండి ప్లీజ్ :) ) మరి తొలిప్రేమ లో కీర్తి రెడ్డి కూడా  పవన్ కళ్యాణ్ కి అందుకే నచ్చిందేమో తెలిదు.అందగత్తె అని పవన్ పడిపోయాడు అంటారా...ఇంకా బోల్డు మందిని చూసాను అందగత్తెల్ని అంటాడేమో అని నా అనుమానం.బాఘా తెలిదు. మనం ఈ సందర్భం లో ఇంకో సినిమా ని గుర్తు చేసుకోవాలి మరి ..అది ఇడియట్.రవితేజ ఎందుకు ప్రేమిస్తాడు , మనం చక్కగా ఒప్పుకొన్నాము ఆ సినిమా లో. అలాగే ప్రతి తొలిచూపు ప్రేమకి మంచిదో ,చెడ్డదో ఒక కారణం ఇలానే ఉంటాయి . ఎవరము ఒప్పుకొన్న ఒప్పుకోకున్నా


సరే హీరో సెలక్షన్ ఈ సారి కూడా తప్పింది అనుకోండి ఏమవుతుంది .11 లవ్ స్టొరీ లు అవుతాయి ఫైనల్ గా ఒక్క మంచి అమ్మయిని కూడా ప్రేమించలేక పోతే,   చివరికి పెళ్లి చేసికోకుండా మన అటల్ బిహారీ వాజపాయ్ గారి లాగా ప్రధాన మంత్రి అయ్యి , 'నిజం'  ప్రభుత్వం అని నానా గొడవ చేసి  నెల రోజులూ , మహా అయితే ఒక సంవత్సరం ఉంటాడేమో !!! ఓర్పు చాలా తక్కువ కాబట్టి మన్మోహన్ సింగ్ గారిలాగా చాలా రోజులు మాత్రం అస్సలు ఉండడు.

12, జనవరి 2011, బుధవారం

నేనూ, సీత, శ్రీనివాసరావు మాస్టారు

నేను స్కూల్ లో  చేరాక ఎక్కడా రెండు సంవత్సరాలు కుదురు గా చదివింది లేదు ..నాన్న ప్రతి ఏట పంటలు మొదలయ్యే టైం కి ఊరు వెళ్లి కావలసిన సామాగ్రి తెచ్చుకొంటూ ఒక సంవత్సరం అకౌంటు పుస్తకాలూ తో పాటు నాకూ ఒక రెండు పుస్తకాలూ ,నోట్సులు పట్టుకొచ్చారు.. . అలా మా నాన్న నాకు ఒక పది ఎక్కాలు , ఒక ఇంగ్లీషు పుస్తకం (చిన్నదే) చదివించేసాక (అంటే బాగా భయపెట్టి అన్నమాట) నన్ను స్కూల్  కి పంపించేసారు ..మిగతా పది ఎక్కాలు రావడానికి నాకు ౪ ఏళ్ళు పట్టిందనుకోండి.

మూడవ క్లాసుకి మేము తాతయ్య వాళ్ళ ఊరుకి మారాము.అక్కడే కాన్వెంట్ లో  సీత , శ్రీనివాసరావు మాస్టారు కలిసారన్నమాట .నేను ౩ వ క్లాసు కి వెళ్ళాలంటే పదమూడవ ఎక్కం దాకా అయినా వచ్చుండాలి అని మాస్టారు నన్ను క్లాసు లో వేరే గా కూర్చోపెట్టి చెప్పేవారు .అదృష్టం బాగుండి ఒక ఆరు, ఏడు  తప్పులతో ఎక్కం అప్ప చెప్పేసాక క్లాసు  లో అందరితో పాటు కలిపేసారు ..ఇలా ముందు నాకు మాస్టారు ఒక్కరే బాగా పరిచయం. మిగతా అందరు కొంచెం తెలుసు.

సీత అనే అమ్మాయి వాళ్ల పెదనాన్న వాళ్ళింట్లో ఉండి చదువుకోడానికి మా ఊరు వచ్చింది. తను మా అందరికీ ఇష్టం. ఇల్లు కూడా మా పక్క వీధి లో అవ్వడం , స్కూల్ తర్వాత కూడా కలిసే వాళ్ళం ఇద్దరమూను.మాస్టారు చెప్పే క్లాసు లో నేను, సీత కాక ఇంక బేబి, తులసి, సునీతా, వెంకట లక్ష్మి , రజని ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఇంకా  అంతే మంది అబ్బాయిలు ఉండేవారు . అబ్బాయిలు ఎప్పుడూ  రాజకీయాలు గురించి  చెప్పుకొనే వాళ్ళు . మేము ఏమో వాళ్ళకు వినిపించకుండా సినిమాలు, పువ్వులు, తిండి  గురించి చెప్పుకొంటూ ఉండేవాళ్ళం. లేకపోతే రాజకీయాలకి విరామం ఇచ్చి మమ్మల్ని ఏడిపించేవాళ్ళు కదా. మొత్తానికి ఒక సంవత్సరం పూర్తి అయ్యి నాలగవ క్లాసు కి వచ్చాం.

శ్రీనివాసరావు మాస్టారు అంతకు ముందు టీచర్ల కన్నా ప్రత్యేకం గా కనిపించేవారు..అందరికీ అలాగే అనిపించిందేమో మరి. నేను ఎప్పుడూ స్కూల్ కి లేట్ గా వెళ్ళేదాన్ని ఇంక వెళ్ళక తప్పదు అన్నట్లు. ఎందుకంటే సంక్రాంతి కి తప్ప సెలవులు ఉండవు ఈ కాన్వెంటు కి. నేనేమో సవత్సరము అంతా ఆ మూడు రోజులకోసమే ఎదురు చూసేదాన్నా, ఈ అమ్మాయిలేమో జనవరి పన్నెండో తారీకు నుంచి సెలవులు అస్సలు ఇష్టం లేనట్లు మాస్టార్ల ముందు చెప్పి చెప్పి నాకు భయాందోళనలు కల్పించేవాళ్ళు. వీళ్ళ మాటలతో అప్పుడు కూడా బడి పెట్టేస్తారేమో అని నిజం గా భయపడే దాన్ని. అలా లేటు గా క్లాసు కి వెళ్తే ఉండే శిక్షలు తప్పించుకోడానికి ఒక్కోసారి మానేసేదాన్ని. ఇది ఇంకా కష్టం,  ఎందుకంటె ఇంట్లో వాళ్ళకి, ఆటలు  ఆడుకుంటుంటే వీధి కనిపించే పిన్ని, బాబాయి లకి అందరికీ  సమాధానం చెప్పుకోవాలి. ఒకరోజు మాస్టారు పిలిచి నువ్వు ఆలస్యం గా వచ్చినా పర్వాలేదు, కొట్టను, లేటు అయ్యిందని మానేయ్యకు అని చాలా ముద్దు గా, ప్రేమ గా చెప్పారు. ఆనందమే ఆనందం. నేను యధేచ్చ గా వెళ్ళేదాన్ని. ఆయనేమో ఇచ్చిన మాట ఒక నాలుగురోజులు కూడా గుర్తు పెట్టుకోలేదు. గుర్తు వస్తుందన్న ఆశ తో ఆలస్యం అయినా నేను మాత్రం ఆ తర్వాత స్కూల్ మానేయ్యలేదు.

సాయంత్రం కధలు బాగా చెప్పేవారు ..పరీక్షలో తప్పితే మాత్రం సాయంత్రం ఇంకో గంట నిలబెట్టే వారు.అక్కడ అమ్మాయిలం మాత్రం అందరూ ఉండేవాళ్ళం, చదివితే కదా. అదీ కాక సినిమాలు తో పాటు  మాస్టారు గురించి కూడా చెప్పుకోవాల్సి వచ్చేసరికి టైం సరిపొయ్యేది కాదు . ఒక్కోసారి సాయంత్రం పనిష్మెంటు సెక్షన్ తప్పించుకోడానికి అమ్మ తలంటు పోస్తాను త్వరగా రమ్మని చెప్పింది అనగానే పంపించేసే వారు. తర్వాత రోజు తలంటు ఏది అంటారేమో అని ఇంకో టెన్షను :)

ఇలా ఒకరోజు మాస్టారు అలా మధ్యలో బయటికి వెళ్లాక, అమ్మాయిలం ముచ్చట్లు మొదలు,  శ్రీలక్ష్మి లా సినిమా టైటిల్స్ మొదలవుతాయి దగ్గర్నించి, ఏమి  మిస్సవ్వకుండా చెప్పేవాళ్ళం చూడని వాళ్ళకి.  ఆ రోజు సీత ఉన్నట్లుండి మాటల్లో 'నాకు రాత్రి కలలో  శ్రీనివాసరావు మాస్టారు వచ్చారు' అని చెప్పింది. ముందు కుంచెం షాక్ అయినా తేరుకొని అవునా ఏం జరిగింది చెప్పు చెప్పు అని ఒకటే అడగడం.....అది కాస్త చెబితే, మేము నెక్స్ట్ సీను ఊ హిం చే స్తూ బ్రతిమలుకోడం. చెప్పాలంటే మనసులో నేను తెగ బెంగ పెట్టేస్కున్నా :)..సరే అదేమో ఊరించి ఊరించి చెప్తూ అప్పుడేమయ్యిందంటే అని ఆగిపోయింది. సినిమాల్లో అయితే కచ్చితం గా సాంగ్ వచ్చే సీను అన్నమాట..మాకు అందరికీ వెలిగింది కాని చెపితే వినాలని ..అంతకంటే సిగ్గు మా సీతమ్మ కి ... ఇంకా నాకు అర్ధమైపోయింది నాకు ఈ పిల్ల కాంపిటీషను అని. మిగతా వాళ్ల గురించి నాకు అప్పట్లో అనుమానాలు లేవు :)

చదువులో కూడా  అందరం పోటి గా ఉండేవాళ్ళం, టెస్ట్ లు అవి పెట్టినపుడు. హోం వర్క్ బాగా చేస్తే నోట్ బుక్ లో సైన్ చేసే వారు . అలా ఆ రోజు ఎవరికి ఎక్కువ సంతకాలు మాస్టారు చేస్తే వాళ్ళకి చప్పట్లు..ఇంక ఆ రోజంతా వాళ్ళు స్పెషల్. మొదట్లో నాకు బాగా సంతకాలు పెట్టేవారు ..తర్వాత అబ్బాయిలు మాకు చెక్ పెట్టారనుకోండి ..నా మనసులో మాత్రం మాష్టారుకి నేనంటే నే అభిమానం అని మురిసిపోయ్యేదాన్ని..కాని నిజం నిప్పులాంటిది కదా. ఒక రోజు నాకు  ఇంకో షాక్ తగిలింది. ఏంటి అంటే, ఎప్పటిలానే టెస్ట్ పెట్టారు . 25 కి 8 మార్కులతో అంకమ్మ అనే అబ్బాయి క్లాస్ ఫస్టు..మిగతావాళ్ళు 5 కి అటు ఇటు అన్నమాట ..పంతుల్ గార్కి బాఘా  కోపం వచ్చింది. మాకు ఒక్కొక్కరికి 20 కన్నా ఎన్ని మార్కులు తక్కువ వస్తే వాళ్ళకి అన్ని దెబ్బలు అని నిర్ణయించేశారు. ఫస్ట్ వచ్చిన  అంకమ్మ సగర్వం గా వెళ్లి 12 దెబ్బలు తినేసాడు..నా టైం వచ్చింది, బెత్తం తో చెయ్యి పైన ఒక్కో దెబ్బకి , చెయ్యి దాచేసుకోడం. బ్రతిమిలాడుకోవడం వద్దండీ అని..అర్ధం చేసికోకుండా మొత్తం పూర్తి చేసారు. అందరికీ పక్క వాళ్ళని కొట్టేప్పుడు లెక్కపెడుతూ భలే ఆనందం :) అప్పుడే సీత వంతు మొదలయ్యింది ..16 దెబ్బలు, నాకన్నా ఒకటి ఎక్కువే అని నేను సంతోష పడేలోపలె అయిపోయాయి. ఒక్కసారి గుర్తు చేసికొంటే , ఆయన కొడుతూనే ఉన్నారు , ఈ పిల్ల చెయ్యి ఇంచు కూడా కదపకుండా ...అస్సల్ ఏడవకుండా ఆయన్నే చూస్తూ ఉంది. అంకమ్మ నా కన్నా ముందు తేరుకుని మాస్టారు సీతా మా లక్ష్మి ని అందరిలా గట్టిగ కొట్టలేదు అని ప్రశ్నించాడు. నిజమే, మా కన్నా కొంచెం చిన్న దెబ్బలు అన్నమాట. కాని గట్టిగానే కొట్టారు. మాస్టారు నవ్వుతూ సమాధానం చెప్పారు.మీలాగా కాదు ,ఆ అమ్మాయి చెయ్యి ఒక్కసారి కూడా వెనక్కి తీసికోలేదు అందుకే సీత కి చిన్న దెబ్బలు అన్నారు.
 
ఆ అబ్బాయి కేమి అర్ధం అయ్యిందో తెలిదు కాని..కాస్సేపు ఆలోచిస్తే నాకు మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది అంటారు కదా అలా అయ్యింది.ఎందుకంటె ఈ  పిల్ల అస్సలు నొప్పి అనకుండా ఎలా అన్ని దెబ్బలు తినేసింది. అంటే మాస్టారు మీద ప్రేమే కదా ... మరీ ఇంతలా పోటి పడాలంటే మనవల్ల అయ్యేపని కాదు అనిపించింది. బాధ గా అనిపించినా సీతా మా లక్ష్మి దీ నిజమైన ప్రేమ అని ఒప్పేసుకున్న మనసులో. అలాగని పూర్తిగా ప్రేమించడం మానేయ్యలేదనుకోండి ..ఈ లోగా హెడ్ మాస్టారు శ్రీనివాసరావు గారి ప్లేస్ లో ఇంకో టీచర్ ని పిలిపిస్తున్నట్లు చెప్పారు , అంటే ఈయన వెల్లిపోతారన్నమాట..చాలా బాధ అందరికీ , పాపం ఆ వచ్చే పంతులమ్మ ని మాకు వచ్చిన తిట్లు, శాపాలు అన్ని పెట్టేశాం ..వెళ్ళద్దు అని ఆయనికి కూడా చెప్పాం :) ...సరే ఈ సీత కి యెవ్వరికి రాని ప్రశ్నలు వస్తాయి. ఆ వచ్చే కొత్త టీచరమ్మ పేరు అడిగింది మాస్టారుని. సరే ఆయన నోటితో చెప్పొచ్చు కదా ...ఉహూ, చక్క గా సిగ్గు పడుతున్న ఈ పిల్ల అరచేతిలో పెన్నుతో 'శ్రీ లక్ష్మి' అని రాసేస్తిరి...ఈ చోద్యం ఎక్కడన్నా ఉందా. అంటే ఆయనికి కూడా బోల్డంత ప్రేమ అని రుజువైపోయింది :) ...ఇంకా మనం పూర్తి గా ఆశలు వదిలేసుకున్నా౦   అని వేరే చెప్పక్కరలేదు కదా.

తర్వాత సంవత్సరమే నేను,సీత  ఇద్దరం వేర్వేరు ఊర్లు వెళ్లి , మల్లి  హైస్కూల్ కి ఊరిలో కలిసాము.ప్రతి న్యూ ఇయర్ కి మాస్టారు కి  తప్పకుండ గ్రీటింగ్ కార్డు ఇచ్చి వచ్చేది..ఆయన కూడా వాళ్ల ఇంటిదగ్గరి అబ్బాయిలతో కార్డు పంపించేవారు. ఇద్దరం కలిసే కొనేవాళ్ళం చెరో కార్డు ..కానీ తనకి రిప్లై వచ్చింది కానీ మనకి వస్తుందా లేదా అన్న అనుమానం తో ఇవ్వడం మానేశా అన్నమాట. తర్వాత  సెవెంతు క్లాస్ కి వాళ్ల అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది.తర్వాత నేను కూడా గురుకుల పాఠశాలా లో చేరాను.

నేను ఇంజనీరింగ్ కి  వచ్చాక ఒకసారి ఊరిలో ఫ్రెండ్స్ ని కలసినప్పుడు తెలిసింది , అప్పటికీ  శ్రీనివాసరావు మాస్టారు ఎవరైనా మా అమ్మాయిలు  ఎదురైతే మా సీతా మా లక్ష్మి కబుర్లు (ఎక్కడున్నది, ఏమి చదువుతుంది ) చెప్పేవారు  అని. అంత అభిమానం పొందిన సీత నిజం గా అదృష్టవంతురాలు. PG చదివింది అని తెలుసు, తర్వాత పెళ్లి కూడా వెంటనే అయిపొయింది ఇప్పుడు ఎక్కడున్నది తెలిదు. పిల్లా, పాపలతో చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నాను.

10, జనవరి 2011, సోమవారం

అందరికీ నమస్కారములు

అందరికీ నమస్కారములు

మరపురాని జ్ఞాపకాలు కొన్ని ఈ బ్లాగుద్వారా అందరితో పంచుకోవాలని కోరిక. చదవడమే కాని వ్రాయడం అలవాటు లేదు.,  చిన్నప్పటినుండీ చాల పుస్తకాలూ చదివాను, సాహిత్యం అని చెప్పబడే పుస్తకాలూ కూడా, ఎందుకంటె కనిపించిన ప్రతి పేపర్ చదివే అలవాటు వల్ల :)  వారెన్ బుఫేట్ చదివాకా, అసలు అందరూ వ్రాసింది ఒకటే అనిపిస్తుంది .తర్వాత  భగవద్గీత ని కొంచెమే చూసా, మరి  బుఫేట్ కూడా  భగవద్గీత చదివాడా వ్యాపార రహస్యాలకోసం అని పెద్ద అనుమానం :)        

నా వ్రాతలు కొంతమందికైనా నచ్చుతాయన్న  ఆశతో ..