23, డిసెంబర్ 2012, ఆదివారం

వోడ్కా విత్ వర్మ -1 ( నిర్జన వారధి )

ఈ మధ్యకాలం లో అనుకోకుండా చదివిన రెండు పుస్తకాలు నిర్జన వారధి , వోడ్కా విత్ వర్మ.  తెలుగు పుస్తకాలు చదవాలి అని ఆసక్తి లేదు. కాని వివాహం లో ఆత్మాభిమానం గురించి, నాకు తెలిసిన ఒక మంచి జంట గురించి ఆలోచిస్తూ మొదట  డాక్టర్ రమణ   గారి టపా నుండి కొన్ని ప్రశ్నల కోసం అన్వేషణ మొదలయ్యింది. అదే రోజు అదృష్టవశాత్తు  జాజిమల్లి గారితో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాసం కలిగింది. నిర్జన వారధి గురించి నా ఆలోచనలు  ఇక్కడ పంచుకొన్నాను  .

వోడ్కా విత్ వర్మ అది ఒక పుస్తకమని నిన్నటి దాకా తెలియదు  . ఏదో ఒక రివ్యు కంటబడింది. అది వ్రాసినది శ్రీ రమణ గారు కాదనుకుంటా. అందుకే రివ్యు కాస్త సిల్లీ గా అనిపించింది.  క్రిస్మస్ సెలవులు కదా అలా గ్రేట్ ఆంధ్రాలో విహరిస్తూ ఎంబీయస్ గారి వ్యాసం చూడడం,  వెంటనే పుస్తకం చదవాలి అనిపింఛి చదివేసాను. నాకయితే పుస్తకంలో ఎక్కడా వర్మ ని  పొగిడినట్లు అనిపించలేదు. కొంచెం తిట్లు ఎక్కువ కనిపించాయి :) . అలాగే నా ఇష్టం పుస్తకం, అప్పట్లో  నేనే  ఫ్రీ కాపి సంపాదించి బ్లాగుల్లో , బజ్జుల్లో  జానలకి షేర్ చేసికొన్నాను. నా ఇష్టం కి ఏ మాత్రం సంబంధం , పొంతన లేని పుస్తకం వోడ్కా విత్ వర్మ అవడం వల్ల ఆ పుస్తకం లా కేవలం హైప్, క్రేజ్ తో కాక చక్కని కంటెంట్ వల్ల బోలెడన్ని సార్లు ముద్రించ బడుతుంది . అయినా చదివే వారి దృష్టికోణాన్ని బట్టి మాత్రమె వారికి అంతవరకే అర్ధం అవుతుంది, ఈ పుస్తకం కూడా అన్ని పుస్తకాలు లానే. 

నిర్జన వారధి  కీ,  వర్మ పుస్తకానికీ ఉన్న దగ్గరి సంబంధం బహుసా అందరికీ అనుభవం లోకి రానిదేమో.  ఈ రెండింటి ఉన్న సంబంధం నాకయితే నచ్చింది. అచ్చు కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఈ టపా లో నా చివరి వ్యాఖ్య లో ఉన్న నా అభిప్రాయం  లానే , ఇంకొకరు ఇంచుమించు అదే విధం గా వర్మ వివాహం విషయం లో ఆయన కుటుంబ సభ్యులు  ప్రస్తావించారు.

మిగిలిన భాగాలలో పుస్తకం పై నా అభిప్రాయాలు వ్రాయాలి.  ఎంబీఎస్ గారికి చాలా చాలా ధన్యవాదములు, ఒక మంచి పుస్తకాన్ని చక్కగా  పరిచయం చేసినందుకు.

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కమ్యూనిజమూ కమామీషూ

శీర్షిక చూడగానే తల  పట్టేసుకున్తున్నారా ? అబ్బే నేనే పుస్తకాలు సదవలే,  కాబట్టి అంత సినిమా  లేదండీ. కాపోతే  మనికి కుడా ఈ ఇసయం తో కూసంత పని బడింది. మరి మన పని అవ్వుద్దో లేదో గాని, ప్రయత్నిస్తే పోలా !!

 మన పనేదో సెప్పే ముందల, మనకేమి అరదం అయ్యిందో చెప్పుకుందాం. సంపాదించిన సొమ్ములో ప్రతి నెలా ముప్పై శాతం ప్రతి ఒక్కరూ ధర్మం చేసేత్తే చాలు కమ్యూనిజమూ కాకరకాయా అవసరమే లేదు దేశానికి. సరే
మళ్ళీ ముప్పై శాతం  ఎందుకు  , టాక్సు లు గట్రా పడేత్తన్నాము గా అంటే, గుళ్ళో హుండీ లో రూపాయి బిళ్ల  వెయ్యడం మానేయ్యండి.

సరే సరే , సూత్తా సూత్తా ముప్పై శాతం అంటే ఎట్టా కుదురుతదీ అంటే , తప్పదు మరి. కలేజా సైన్మా లో మహేశ్ బాబే ముందల కాదు కూడదు అని ఖరాఖండిగా సెప్పి కూడా తప్పించుకోలేక  పొయ్యాడు, మనమెంతా ?

అయినా మన సేత్తో మనము చెయ్యకపోతే , హుండీ లో రూపాయి వేసిన పాపానికి, ఆ  దేవుడు మన పాపాలు కడిగెయ్యడానికి ఈ కమ్యునిష్టులని పుట్టిస్తన్నాడేమో!!. మరి దేవుడు అందరినీ  మంచోల్లనే పుట్టించడు గా, వాళ్ళలో కూడా కొన్నాళ్ళకి సంపాదన వైపు వెళ్లి మనలా మారిపోయ్యేవాళ్ళు కొందరు వచ్చేస్తారు. అప్పుడు మన బలం పెరిగి 'పాపం' కూడా ఇంకా  ఎక్కువయి పోతుంది. షరా మామూలు.

ఇదంతా ఆసికాలికి వ్రాశా కాని , కమ్యూనిజం ఇక్కడ  నేను   అడిగే  రెండు, మూడు   ప్రశ్నలకి జవాబు చెబుతుందా ?????  అబ్బే పెద్ద ప్రశ్నలు కాదండీ , చిన్న చిన్నవే !

1.  ఈ టపా లో   దత్తత సమస్య పై చర్చించాను. మరి కమ్యునిజం కేవలం ఆస్తి మైకం లో తీసికొనే దత్తతలను    ప్రశ్నిస్తుందా ? ఆ పసి వాళ్లకు ఆస్తులకు ఆతీతం గా ప్రేమను అందిస్తుందా ?  ( ఒకటి కాదు రెండు కాదు ,  మూడు ప్రాణాలు బలి అయ్యాయి మరి ఈ సమస్యలో )

2. ఇంకో టపా లో ఈ అబ్బాయికి పెళ్లి అంటే కట్నాలు కానుకలు, నెల నెలా  జాబు లో సంపాదించే జీతం కాదని  చెపుతుందా? లేక బాగా చదివే పక్కింటబ్బాయి సంపాదనతో పోల్చుకొని స్త్రుగుల్ అవ్వద్దని ఆ అబ్బాయి కి నేర్పుతదా?  తల్లిదండ్రులకు అబ్బాయి ఏదో ఒక లా చదివి చిన్నదయినా పెద్దదయినా ఉద్యోగం లో చేరితే చాలు అన్న మూస లో ఆలోచించి సమస్యల పాలవ్వద్దు అని చెపుతుందా?

అబ్బాయి కి ఎప్పుడు చదువు, ఉద్యోగం అన్నవి జీవిత సమస్యలు కాకుండా చేస్తుందా (చేతనయ్యింది చేసి బ్రతికే అవకాశం చాలదా? )

అమ్మాయిలకి, అబ్బాయిలకి  అమ్మా నాన్న సంబంధం చుస్తే తప్ప తన పెళ్లి తను అరేంజ్ చేసుకొనే  ఆలోచనని ఇస్తుందా ?

అమ్మాయి తనకన్నా తక్కువ సంపాదించే అబ్బాయి పెళ్లి చేసుకొని, కట్న కానుకలు అతని ఆస్తికి తగ్గట్టు గా సమర్పించి మరీ .. ఇంకా అతని లో న్యూనత కి తన జీవితాన్ని బలి చేసుకోకుండా ఉండగలదా ? అంతెందుకు ... ఎక్కువ సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయి లో ఇతర ఆలోచనలు రాకుండా ఆపగలదా ?

3. మరి ఈ టపా లో  మీ కమ్యూనిజం ఆ అబ్బాయికి తన లైఫ్ తాను నిర్ణయించు కొని ,స్వేచ్చ గా బ్రతికే సదుపాయాన్ని ఇస్తుందా?????

ఇవన్ని ఇస్తే ఇంకేది ఇవ్వకపోయినా పర్వాలేదు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా!!! లేదంటే కాపిటలిజమో, కమ్యునిజమో  ఏ రాయైతే నేఁ ??




18, జూన్ 2012, సోమవారం

ఇంకొక ప్రేమ జంట ఆత్మహత్య, కారణమెవరు ?

పుట్టి భూమ్మీద పడగానే చిన్నారులకు సమాజం వల్ల బోలెడన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి. అబ్బాయి ఉన్నాడు అంటే, వరసయ్యే  అమ్మాయిని భార్యగా పరిచయం చేస్తారు. ఆడపిల్ల తండ్రి కాస్త ఎక్కువ సంపన్నుడై,  అమ్మాయి కి రూపం చదువు అబ్బి ఉంటె అతనిపై రెట్టింపు బాధ్యత ఉంటుంది తగిన అల్లుడిగా తనను తను ప్రూవ్ చేసికోవడానికి.  ఏ అమెరికానో ఆస్ట్రేలియా నో వెళ్లి చదివి తిరిగొచ్చి అమ్మాయిని పెళ్లాడాలి. ఆ చిన్న మనసు ఎంత వత్తిడి తట్టుకోగలదు !!!


 సరే మామయ్య అల్లుడిని  తిరస్కరించాడు. అయితే జీవితం అక్కడితో ఆగిపోదు కదా. ఆశలు కలిపించమని తాను అడిగేడా, చిన్న తిరస్కారం అయినా తన ప్రపంచాన్ని మార్చెయ్యదా . ఆ బాధ అంతా పక్కింటి ఇంకో అమ్మాయి పై ప్రేమ గా మారింది, కాని కులాల మధ్య అంతరాలు ఆ అమాయక పెద్దల్ని మరొకసారి దోషుల్ని చేసింది. ఇద్దరు వెళ్లి పోయారు. చెయ్యని ప్రయత్మ లేదు ఆచూకి కోసం. కొద్దిగా తెలిసాయి కాని ఇరవై రోజులతరువాత గోవా నుండి కబురు, ఇద్దరు ఆత్మహత్య చేసికొన్నారు,  SIM Card ఆధారం గా అడ్రస్ ట్రేస్ చేసి తెలియపరుస్తున్నాము అనీను.



ఆంద్ర రాష్ట్రం నుండి గోవా దాకా వెళ్ళారా కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య కోసం !! అందరికీ దూరం అవ్వలేని సున్నితత్వం, కలిసి ఎక్కడో ఒకచోట బ్రతుకలేని నిస్సహాయత .అయినా చేతులారా ప్రాణం ?  ఎలా ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు.   ఆత్మ హత్య కావచ్చు ఇంకోసమస్య కావచ్చు, మానవ సంబందాలన్నే ఆర్దికసంబందాలన్న భావన సమాజం లో అంతర్లీనం గా పెనవేసుకుపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందీ తెలియని ఎందరో తల్లిదండ్రుల గుండెకోత కు సమాధానం ఎవరు వివరిస్తారు.  ఇంకొకరు ఇలా బలి కాకూడదు అని చిన్న ఆశ తో ఈ టపా. ఆ ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని !!!

14, జూన్ 2012, గురువారం

కాంగ్రెస్ జగన్ నే టార్గెట్ చేసిందా లేక ఓటర్లను టార్గెట్ చేసిందా ?



ప్రజాస్వామిక వాదులందరూ అడుగుతున్న ప్రశ్న!  ప్రభుత్వం కేవలం జగన్ యొక్క అవినీతిని మాత్రమె ఎందుకు నేరం  గా పరిగణిస్తున్నది ?  ప్రతిఒక్కరికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వానికి తెలుసు, జగన్ ని జైల్లో పెడితే సానుభూతి పెరిగి అతను రాజకీయంగా సక్సెస్ అవుతాడు అని. అయినా అతన్ని అరెస్టు చేసి విచారణ జరిపించడానికి కారణాలు ఏమిటి?

కాంగ్రెస్ కి కావలసినది 2014 లో మళ్ళి పార్టీ అధికారం లోకి రావడం, గెలుపు కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్ ని వదిలేస్తే పెద్దమొత్తం లో కాంగ్రెస్ ఓట్లు  చీల్చుకొంటాడు. జగన్ కు చెక్ పెట్టాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి  వల్ల లబ్ది పొందిన ప్రజలను ఎలాగు మార్చలేరు కాబట్టి, ఆయన వల్ల నష్టపోయిన ప్రజల మద్దతు సంపాదించడం ముఖ్యం. అటువంటి జీవో లు రద్దు చెయ్యాలి అంటే ముందు ఆ ప్రాజెక్టు కు సంబంధిత వ్యక్తులను అనర్హులు గా ప్రకటించాలి కాబట్టి వాన్ పిక్ కేసులో ముద్దాయిలంతా అరెస్టు చెయ్యబడ్డారు, జీవో రద్దవుతున్నది . అదేసమయం లో కాకరపల్లి, సోంపేట థర్మల్ ప్రాజెక్టులకు అనుమతుల్ని రద్దు చెయ్యడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రైతులంతా నేరం చేసిన వైఎస్సార్ లేని ఈ కాంగ్రెస్ కి బ్రహ్మరధం పట్టాలి కదా మరి.

కాంగ్రెస్ కి వ్యతిరేక ప్రచారం చెయ్యడమే పనిగా పెట్టుకొన్నందువల్ల , సాక్షి పై కొన్ని దాడులు చేసినా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చాలావరకు బెడిసికొట్టాయి. జలయజ్ఞం కు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ కదిలించకపోవడానికి కారణం, ఈ ప్రాజెక్టులు అన్నింటికీ ఉన్న ప్రజామోదం కాదా ?

ఇకముందు స్పీకర్ ఎవ్వరి రాజీనామాలు అంగీకరించేది లేదు అని ప్రకటించారు కాబట్టి, అవిశ్వాసం ప్రవేశపెట్టడం మినహా జగన్ మోహన్ రెడ్డి చెయ్యగలిగినదేమీ లేదు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ అంటే ప్రస్తుతం జగన్మోహన రెడ్డి కే కనెక్ట్ అయి వున్నారు. కాబట్టి  రాబోయే రెండుసంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి ని మరిపించేలా కాంగ్రెస్ పరిపాలన సాగిస్తే కొంతవరకు రాష్ట్రం లో  పార్టీ నిలబడుతుంది. 

అలాగే చంద్రబాబు అవినీతిని బయట పెట్టాలి అంటే, టి ది పి ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నే ప్రయత్నించాలి. కాని అవ్వన్నీ Y S రాజశేఖర్ రెడ్డి గారు ఉపయోగించేసారు కదా. బయట పడితే జనానికి పనికొచ్చే స్కాములు బాబు ఖాతాలో ఎమున్నాయబ్బా ?  మీకు తెలుసా !!!

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

6, జూన్ 2012, బుధవారం

ఒక అబ్బాయి - ఒక అమ్మాయి - వేధింపుల పర్వం



ఆ అబ్బాయి ఎందుకు వేదిస్తున్నాడు రేణుక ను??? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న. మొదట సీనియర్  గా యెంతో అభిమానం గా సాయం చేసాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అందరు చెప్పేది ఒకటే  మాములు గా చాలామంచి వాడు  స్టేట్ రాంకర్ కూడా. ఇంకెవరితోనూ అమర్యాదగా మాట్లాడిందే లేదు. రేణుక గురించి చెప్పాలంటే చదువుల సరస్వతి. అందరితో స్నేహం గా ఉండే తత్త్వం. సరదాకి కూడా ఎవరినీ నొప్పించదు తను. అతని తో సమస్యను వీలయినంత సామరస్యం గానే పరిష్కరించుకోవాలని ఆశ పడింది.

ప్రెషర్స్ పార్టి లో ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన కు బోల్డన్ని ఫోటో లు తీసాడు. నెగెటివ్స్ తో సహా అడక్కుండానే తెచ్చి అమ్మాయికి ఇచ్చేసాడు. ఒక రోజు ఉన్నట్టుండి నెగెటివ్స్ కావాలని అడిగాడు. రేణుక ఇవ్వడం ఇష్టం లేకో , నిజం గానే కనిపించకో ఎక్కడో పెట్టేసాను లేవు అని సమాధానం చెపుతూ వచ్చింది. ఉహూ అతనికా సమాధానం నచ్చలేదు. అహం దెబ్బతిందో ఏమో ఆ అమ్మాయిని మాత్రమె బెదిరిస్తూ పోయాడు.పాపం అతన్ని వదిలించుకోవడానికి అని నిజం గానే వెతికింది ఫోటోలు , నెగెటివ్స్ కోసం  కాని దొరకలేదు. అక్కడే సమస్య మరింత జటిలం అయ్యింది.

కాలేజ్ మానేజ్మెంట్ కి పలు కంప్లైంట్స్ వెళ్ళాయి , అతన్ని హాస్టల్ నుండి కొన్నాళ్ళు తొలగించారు. ఆ అమ్మాయికి రక్షణ కావాలి అని అందరికి అర్ధం అయ్యింది. కాని సంవత్సరం పొడుగుతా రక్షణ ఇవ్వలేరు కదా. ఇంకా గట్టిగా అడిగితె అమ్మాయిని హాస్టల్ నుండి పంపేసినా దిక్కులేదు. మధ్యలో కొంచెం మారాడు అనుకొంటున్నారు. మిగిలిన అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసేవారు తనని ఏమి చెయ్యొద్దు అని, విని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.


అసలు వాళ్ళిద్దరి పరిచయమే పెద్దవారి ద్వార జరిగింది. అమ్మాయి కాలేజ్ లో జాయిన్ అయ్యేసమయం లో , తమ ప్రాంతం అనో ఒకే ఊరు అనో తెలిసి సీనియర్ అయిన ఆ  అబ్బాయి ని కలిసి , అమ్మాయి తల్లి  'చెల్లె ని' బాగా చూసుకో నాయనా అని బోల్డంత బాధ్యత అబ్బాయికి అప్పగించేరన్న మాట. కాని ఇపుడు అమ్మాయిని బాధ పెడుతున్నాడు అని తెలిసి అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయి తరపువారు  సమస్య చెప్పారు. మేము చెప్పగలిగినది చెప్పాం అని, ఇంకా తాము కొడుకు కి పలుమార్లు చెప్పి విసిగిపోయామని  వదిలేశామని వారు చేతులెత్తేశారు !!!

 ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే వేళ ఒకరోజు తాపిగా పరీక్షా వ్రాసి , అమ్మాయి మెస్ నుండి బయటికి వచ్చే టైం లో గేటు దగ్గర కాపలా కాసి వెంట పడ్డాడు. పదునైన కత్తి(బ్లేడు ?)  తో మొహం నిండా, ఇంకా చేతి మణి కట్టు దగ్గరా కసితీరా గాయ పరిచాడు. ఆ  అమ్మాయి అందం గా కనిపించ కూడదని మొహం పై పాశవికం గా దాడిచేసాడు. చెయ్యి అడ్డుపెట్టడం తో మణికట్టు దగ్గర నరం తెగి రక్తం ధార కట్టింది . కళ్ళు మూసి తెరిచేంత లో పరారు అయ్యాడు.  గబా గబా తనని హాస్పిటల్ కి తీసికొనే వెళ్ళడమే కాక ప్రిన్సిపాల్ కి మరియు పేరెంట్స్ కి కూడా సంఘటన గురించి తెలియపరచడం జరిగాయి. విద్యార్ధినీ విద్యార్దులు అందరు రేణుకకు మద్దతు గా నిలిచారు. చాలా రక్తం పోయింది కాని, గండం గట్టెక్కినట్లే. వాళ్ళ ఒక్క బాచ్ కి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి.

 పోలీసులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. నాలుగు రోజులకి ఎమ్మెల్యేని వెంట బెట్టుకొని వచ్చి పోలీసుల ముందు తనే లొంగిపోయాడు. ఒక ఫోటో ఆమ్మయితో కలిసి ఉన్నది చూపి , నాతొ ఆ అమ్మాయి తిరిగినది అని అభియోగం మోపాడు. అప్పటి దాకా అమ్మాయికి అండగా నిలిచినా తండ్రి , ఆ పిల్లని తిట్టిపోయ్యడం మొదలుపెట్టారు. ఆయనకీ తెలుసు అది అంత అబద్దం అని , కాని ఫోటో దిగి చెప్పలేదు అని బాగా కోపం తెచ్చు కొన్నారు .


నిజానికి ఒక సెలవురోజు అమ్మాయి తన మిత్ర బృందం తో ఫోటో లు తీసికొంటూ ఉండగా, అటుగా వెళ్తున్న ఈ అబ్బాయి నాతొ కూడా ఫోటో అని మొహమాట పెట్టి  తన ప్రక్క నిలుచున్నాడు . అందరు అన్నయ్య అని పిలుస్తారు కదా, అందునా సీనియర్ కాబట్టి వద్దు అని ధైర్యము చెయ్యలేదు, అలాగని అనుమానమూ లేదు. అదన్నమాట ఫోటో వెనుక కధ. అసలా సంగతే మర్చిపోయారు. కాని తండ్రి అర్ధం చేసుకొంటే కదా. ఆయనకీ కూతురు అమాయకత్వం కన్నా, కేసు నీరుకారిపోతున్నదన్న బాదే ఎక్కువయ్యిందా, ఏం చేస్తాం.

బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులు  గా ఉన్న ఆ అమ్మాయి సహ విద్యర్దినులను అందరినీ  కత్తి తో బెదిరించి  వెళ్ళాడు .నిజానికి ప్రత్యక్ష సాక్షి గా ఉన్న  రేణుక కు రూం మేటు ఒక అమ్మాయి , ముందే తను మాత్రం సాక్ష్యం చెప్పేది లేదు అని నిర్ణయించుకొంది, కెరీర్ కి ట్రబుల్ రావోచ్చును అని.  ప్రిన్సిపాల్ కూడా కొన్ని అనివార్య కారణాలు, స్వప్రయోజనాలు కూడా దృష్టి లో ఉంచుకొని విచారణ కి దూరం గా ఉన్నారు. ఇంకా మిగిలిన వారిలో వేరే బ్రాంచ్ కి చెందిన ఒకమ్మాయి ( పేరు స్వాతి ) మాత్రం మనస్సాక్షి ముఖ్యం అని సాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా తన స్నేహితులు  ఒట్టు పెట్టిన్చుకొన్నారు, అబ్బాయి చంపేస్తాడు అన్న భయం తో . సాక్ష్యం చెప్పనివ్వని మిత్రులపై కూడా అలిగి తానూ మౌనాన్ని ఆశ్రయించింది.



అప్పటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఆ ఫోటో ని ఆధారం గా చూపడం మోసం కాదా అని. సమాధానం ఇంకో అమ్మాయి ఇందు ద్వార వెలుగులోకి వచ్చింది. తనతో ఉన్నట్టుండి ఒకసారి ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు , పెద్ద వాళ్ళు తను చెల్లి వరుస అవుతుంది అని మొదట చెప్పారు కాని ఇంకో వరుసలో మరదలు అవుతుందని అతనికి తెలిసింది అని . ఇందు ఆ విషయం అప్పుడే వదిలేసింది పొడిగించడం సభ్యత కాదు కాబట్టి. హ్మ్ అలా  అతను రేణుకను ప్రేమించాడు, వ్యక్త పరిచడానికి వీలు లేదు అన్నయ్య గా పరిచయం అయ్యాడు కాబట్టి. అలాగని తనలో తాను దాచుకోలేక, మణిరత్నం సినిమా లో విలన్ గా మారిపోయాడు .



తర్వాతి సంవత్సరం మొదలయ్యింది. కేసు చాలా మలుపులు తీసికొంది. అబ్బాయి తల్లి దండ్రులకి కడుపు తీపి గుర్తుకొచ్చింది, అమ్మాయి కాళ్ళా వేళ్ళ పడ్డారు  కేసు వెనక్కి తీసికొమ్మని, ఇద్దరికీ పెళ్లి ఒక పరిష్కారం గా కూడా సూచించారు. ప్రాణహాని గురించి  చెప్పి కాదంటే వ్రాయడానికి వీలు కానన్ని తిట్లు శాపనార్ధాలు పెట్టారు. సాక్ష్యము ఇవ్వాలని ఉన్న స్వాతి  కి మిత్ర బృందం చివరికి తామంతా రక్షణ గా ఉంటాము ఏదయితే అది అవుతుంది అని ఆమెని సాక్ష్యం ఇవ్వడానికి అనుమతించారు  . ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మాయిని మాత్రం ఎవరు బలవంత పెట్టలేదు. ఈ లోగా ఆ అబ్బాయి తన బెదిరింపుల పర్వం లో ప్రిన్సిపాల్ ని కూడా  ఈ కేసు లో ఇన్వాల్వ్ అయితే చంపేస్తా అని  బెదిరించేసరికి  ఆయన అహం బోల్డంత దెబ్బతినేసింది .ఇంకేం ఆయన తను చెప్పాల్సింది కోర్టు లో న్యాయమూర్తి ఎదుట చెప్పేశారు, మిగిలిన సాక్ష్యాలు అన్ని కూడా విన్న జడ్జి అతనికి పదేళ్ళు జైలు శిక్ష విధించాడు.

ఇంకో మూడు సంవత్సరాలు గడిచాయి, ఇన్ని సమస్యలను దాటి రేణుక చదువు అయిపోయింది . ఒక కాలేజి లో లెక్చరర్ గా ఉద్యోగం లో చేరింది. తను నేను ఇపుడు బాగానే ఉన్నాను , అతని భవిష్యత్తు పాడయిపోతున్నది అని కేసు వాపస్ తీసికొని అతని విడుదల అయ్యేలా చూసింది అని తెలిసి చాలా సంతోషం వేసింది. అంత మంచి అమ్మాయి రేణుక.

అబ్బాయి కూడా మంచి వాడే. కాని మన వ్యవస్థ లో ఈ పెద్ద వాళ్ళు అమ్మాయి కి అదే కాలేజి లో చదువుతున్న అబ్బాయి రక్షణ అని వాళ్ళిష్టం వచ్చినట్లు పరిచయం చెయ్యడం, పదే పదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెల్లె జాగ్రత్త అని చెప్పడం కూడా స్వార్ధం తో కూడిన  సామాజిక పొరపాటు అని నా అభిప్రాయం . అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం  కావాలి అని ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుంది.  ఇక రేణుక లాంటి అమ్మాయిలు పెద్దవాళ్ళ పిరికితనం, అభద్రతా భావం తమని, తమ స్నేహాల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి.

ఆడపిల్లల పై దాడి జరిగిన చాలా సంఘటనల్లో అబ్బాయిలని మాత్రమె బాధ్యులని చెయ్యకుండా , అమ్మాయిలు వీలయినంత వరకు తమ తమ పరిచయాలను పునః పరిశీలన చేసుకొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎవరి రక్షణ కు వారే మొదటి బాధ్యత వహించాలి.

 ఒక అబ్బాయి  , లేదా అమ్మాయి ని 'సెలెక్టివ్' గా అన్న, చెల్లి ,అక్క  లేదా తమ్ముడు అని వ్యవహరించాల్సిన ఖర్మ తెలుగువాళ్ళకే నేమో . ఇది నవీన కాలపు సామజిక దురాచరమా అని అనుమానం వస్తుంది.



30, మే 2012, బుధవారం

సాఫ్ట్ వేర్ పెళ్ళిళ్ళు





అబ్బాయి అమ్మాయి ని ఒకే చేసాడు. అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబే, జీతం మరీ ఎక్కువా ,తక్కువా కాదు. ఆస్తి మాత్రం బానే ఉంది. అమ్మాయి ఉజ్జోగం వేరే రాష్ట్రం లో . అదీ పర్మనెంట్ కాదు కాబట్టి, పెళ్లి తర్వాత మనికి కావాల్సిన చోట జాబు చూసుకోవచ్చు అని అనుకొన్నారు . సంబంధం కుదిరింది. ఆర్భాటం గా ఎంగేజ్మెంట్, బంధు మిత్రుల సమక్షం లో పలు లాంచనాలు, కానుకలతో పెళ్లి జరిగాయి. పదహారు రోజుల పండుగ కూడా ముగించుకొని క్రొత్త జంట వారి వారి ఉద్యోగ విధుల్లో చేరిపోయారు. మొదటి ఆరునెలలు విడి  విడి గ వేర్వేరు పట్టణాల్లో ఉంటూ , సెలవలుకు ఇంటికి వచ్చినపుడు కొత్త అల్లుడు మర్యాదలు అక్కడ, కొత్త కోడలు మురిపెం ఇక్కడా, ఇలా గడిచిపోయాయి. అమ్మాయి కి మొదటి రెండు మూడు నెలలు జీతం కి , అంతే మొత్తం కలిపి అత్త గారు బంగారు గాజులు చేయించి ఇచ్చింది.

 మొత్తానికి ఆరునెలల తర్వాత దంపతులు  ఒకచోటికి చేరారు. అబ్బాయి అంతే ఎంతో ప్రేమ ఉన్న అమ్మ, అక్క  వచ్చి కావలసినవి అన్ని ఇంటి లో అమర్చి పెట్టి వెళ్లారు.అమ్మాయి క్రొత్త ఉద్యోగ ప్రయాలు  మొదలు పెట్టింది. అలా పది రోజులు గడచాయి, స్వంత ఊరికి వచ్చారు. అబ్బాయి తల్లి దండ్రులతో చెప్పి బాధ పడ్డాడు, ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరో అబ్బాయి తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అని. పెద్దవాళ్ళ దాకా వచ్చాక విషయం విడాకులకు దారి తీసింది.






కోర్టు బయట సెటిల్మెంట్ జరుగుతుండగానే, మధ్యవర్తుల ప్రమేయం తో అమ్మాయి తరుపు నుండి రాజి ప్రయత్నాలు జరిగాయి. కాని అబ్బాయి వైపువారు, మధ్య లో అనుకొన్న మాటల వల్ల నొచ్చుకొని అంగీకరించలేదు, మొత్తానికి సెటిల్మెంట్ కుదిరి విడాకులు కుడా వచ్చేసాయి.

సమస్య ఎక్కడుంది. పది రోజుల కాపురాన్ని  విడాకులదాకా తీసికెళ్ళిన కారణం సరైనదేనా?



9, మే 2012, బుధవారం

మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఈ  సిరీస్ లో మొదటి బాగం చూడాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


నేను ఈ సిరిస్ లో సరి అయిన సమయం లో దత్తత తీసికొన్న పిల్లలకి నిజం చెప్పక పోవడం వలన కలిగే సమస్యలని, తీసికోవలసిన జాగ్రత్తలను మాత్రమె చర్చించ దలుచు కొన్నాను. అందువల్ల తల్లిదండ్రుల పొరబాట్లను చర్చించడం తప్పని సరి, దాని అర్ధం దత్తత తీసికొనే తల్లిదండ్రులని తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం కాదు. అలాగే సరి అయిన సమయం అంటే ఆ పిల్లలకి మెచ్యురిటి వచ్చిన తర్వాత అన్న అపోహ ను కూడా బ్లాగర్లలో చూసాను.



దత్తత తీసికోదలచిన తల్లిదండ్రులకు ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన అవగాహనలు:



౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ఆ తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొకరిద్వారా ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము కాబట్టి, ఆ బిడ్డ చెవితో విన్నదానిని అర్ధం చేసికొనే వయసుకు రాగానే చెప్పెయ్యాలి. అలా చెప్పకూడదు అంటే కృష్ణప్రియ గారి ఈ టపా లో దంపతుల మాదిరిగా, బంధువులకు కూడా తమ బిడ్డ దత్తత చేసికొన్న బిడ్డ అని తెలియనివ్వకూడదు (వారు అందరికి దూరంగా నివసించడం వాళ్ళ ఇది సాధ్యపడి ఉండొచ్చు )



౨. తల్లిదండ్రులకు తాము దత్త త తీసికోబోయే బిడ్డ యొక్క అసలు తల్లిదండ్రులు తెలిసే అవకాసం లేనందున, వారి కులము మతము కూడా తెలిసే అవకాసం లేదు. కాబట్టి అప్పటి నుండి తల్లి దండ్రులు కుల మత విశ్వాసాలను వదిలెయ్యాలి. అలా వదిలెయ్యడమే న్యాయం కుడా నిజం గా దత్తత తీసికొన్న బిడ్డపై నిజమైన ప్రేమ ఉంటె. ఎందుకంటే నిజం తెలిసాక ఆ బిడ్డకి తన కులము మతము ఇది కాదు అన్న బాధ కలగ కూడదు. అగ్ర వర్ణాలలో ఈ సమస్య అధికం, ఎందుకంటే వారికి ఉండే కుల దురాభిమానం ఆ బిడ్డకి కూడా వస్తుంది. నిజం తెలిసాక తన అసలు కులం ఏదో తెలియక, అప్పటి వరకు పెంచుకొన్న దురాభిమానం వదులుకోలేక 'సంఘర్షణకు' లోనవుతారు. ఆ సంఘర్షణ ప్రభావం వారి వివాహ సమయం లో మరీ ఎక్కువవుతుంది. అదేకులం కి చెందినా వ్యక్తిని పెళ్ళాడినా, వారికి నిజం తెలిస్తే ప్రేమను పంచుతారా అన్న సంకోచం వారిని వేధిస్తుంది. ఆ బిడ్డకి తప్ప, అందరికీ తెలిసిన నిజం, ఎక్కడి నుండో వచ్చిన జీవిత భాగ స్వామికి తెలియకుండా ఉంటుందా? అదే చిన్నతనం లోనే నిజం తెలిస్తే, తన జీవితాన్ని తము మలచుకోగలగుతారు ఈ కులాలకి, మతాలకి అతీతం గా.



౩. సాధారణం గా ఆస్తి ఉండి పిల్లలలు లేని చాలామంది ఇప్పటి తల్లి దండ్రులు ఈ రహస్య దత్తత ప్రక్రియ ద్వారా ఒక్క బిడ్డనే దత్తత చేసికొంటారు. ఆ బిడ్డను చాలా రిచ్ గా పెంచుకొంటారు (అప్పటి దాకా బందువులకు ఆశ ఉండి ఉంటుంది ) ఇది ఎవరు కాదనలేనిది. బిడ్డను విలాసాలకు, సంపదకు అతీతం గా పెంచుకోవాలా, సంపదలో ముంచి తెల్చుకోవాలా అన్నది ఆ తల్లిదండ్రుల స్వ విషయమే. కాని అదే సమయం లో అంతకు ముందు వరకు ఉన్న బంధుత్వాలను వీలయినంత వరకు నిలుపుకోగలిగితే, ఆ బిడ్డకి ఒంటరి తనం ఉండదు. అప్పుడు ఒకవేళ నిజం తెలిసినా ఆ బిడ్డలో ఈ సంపద నాది కాదు అన్న న్యూనతా భావం కాని, సంపద తనదే అన్న అహంభావం కాని ఉండదు. డబ్బే ఆ బిడ్డకు పెద్ద శత్రువు కాకుండా కాపాడాలి అన్నది ఈ పాయింట్ యొక్క సారాంశం.



౧. తమ సంతోషం కోసం 'మాత్రమె' ఆ బిడ్డని దత్తత చేసికోదలచామన్న విషయాన్ని దత్తత చేసికొన్న వారు మరచి పోకూడదు. ఆ బిడ్డ కాకుంటే ఇంకో బిడ్డను తీసికొంటారు. అలాగే వీరు కాకుంటే ఇంకొకరు ఆ బిడ్డను దత్తత చేసికొంటారు లేదా తను ఉన్నచోటే ఉండాల్సి వస్తుంది. ( కాని ఎక్కడో రోడ్డు మీద దిక్కులేక పడి ఉన్న బిడ్డపై జాలి చూపి దగ్గరకు తీసికొన్న దానితో సమానం అవదు. ) కాబట్టి ఆ బిడ్డకి విశ్వాసం ఉండాలన్న డిమాండ్ పూర్తిగా స్వార్ధపూరితమైనది. ఆ అబిప్రాయం మాములుగా జనం నుండి వస్తుంది, చూడండి వాళ్ళు తీసికొచ్చి పెంచితే రుణపడి వుండకుండా స్వార్ధం చూసుకొన్నాడు అని అంటూ ఉంటారు . నిజానికి తానెవరో తనవాల్లెవరో తెలియక కలతపడి, చదువు పై శ్రద్ద చూపలేక, మొండిగా నిర్లక్ష్యం గా మారిన పిల్ల లేదా పిల్లవాడి పై చూపాల్సింది జాలి మాత్రమె. కాని అవేవి సమాజానికి అక్కరలేదు, తమకి దక్కనిది ఆబిడ్డకి దక్కినది అన్న ఉక్రోషం తప్ప. కాబట్టి తల్లిదండ్రులే కాస్త వివేకం తో నడుచుకోవాలి.



౫. వేరేవారి ద్వార నిజం తెలిసినపుడు, ఆ మాట్లాడిన వారిని నిందించే జనాన్ని చుస్తే నవ్వు వస్తుంది. ఆ బిడ్డకి తెలియకుండా దాచిన సంగతి ఈ తల్లిదండ్రులేమైనా దండోరా వేసి చెప్పారా!!! లేదే?అలాగని అందరితో ఈ తల్లిదండ్రులకు మిత్రత్వం మాత్రమె ఉండడం సాధ్యం కూడా కాదు. అసలు అనుకోకుండా మాట్లాడిన వారందరూ స్వార్ధపరులు కాదు, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా కాదు.



౬. దత్తత చేసికొన్న బిడ్డని అతిగారాబం చేసి వారి భవిష్యత్తును పాడు చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఉందొ లేదో వారికే వదిలేద్దాము. కాని దండించే సమయం లో ఆ తల్లిదండ్రులకు నిజం గానే చెయ్యి రాదు. తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి దండించే హక్కు లేదు అన్న భావం వెంటాడుతోంది. అది ఆ బిడ్డ కి చెప్పలేనంత చెడు చేస్తుంది.



౮. ఆడపిల్లకు నిజం తెలిస్తే (బయటి వారి ద్వారా) ఇంట్లో ఉండే పిల్ల కాబట్టి పెంచిన తల్లి దండ్రులకి నిజం తెలిసి పోతుంది. అపుడు ఎలా తెలిసింది అన్న వివరాల్లోకి వెళ్ళడం మానేసి ఆ పిల్లకి తాము ఏపరిస్తితిలో దత్తత చేసికొన్నామో, తెలియచేసి అర్ధం అయ్యేలా చెప్పుకోవాలి. అవసరమైతే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి (బిడ్డకి కాదు). అసలు ఇలా దత్తత కి ఏర్పాట్లు చేసే హాస్పిటల్స్ లోనే , డాక్టర్స్ కాని ఎవరైనా దత్తకు ముందే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తే ఎంత బావున్ను.



౯.మగపిల్లలకి బయటి వారి ద్వారా తమ తల్లిదండ్రులు,స్వంత తల్లిదండ్రులు వేరు అని తెలిస్తే అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే వారు ఆ చెప్పిన వారిని పూర్తి వివరాలు అడగలేరు, అలాగని ఇంట్లో ను అడగలేరు. క్రమంగా విలాసాలకు మాత్రం దూరం అవుతారు. ఇంట్లో సమయం గడపడం తగ్గించి ఫ్రెండ్స్ తో బయట ఆటల పేరుతో గడిపేస్తారు . చదువు పై సహజం గానే ఆసక్తి పోతుంది. వారి భవిష్యత్తు అంధకారమై పోతుంది .ఇక నటించడం కూడా మొదలుపెడతారు పాపం. క్రమంగా తమ చుట్టూ ఉన్నవారి పై లోలోపల ద్వేషం పెరుగుతుంది.చుట్టూ ఉన్నవారు ఎలా నటిస్తున్నారో ఈ పిల్లలు కూడా అలాగే నటిస్తారు. పెంచిన తల్లి దండ్రులకు దూరం గా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు, కుల మత కారణాలు పెద్ద పాత్ర వహిస్తాయి. తల్లిదండ్రులకి విష్యం తెలిసే సరికి పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. రెండువైపులా తెగిన గాలి పటాలవుతారు.



మగపిల్లల్ని పెంచుకోవాలని ఆశపడే తల్లిదండ్రులు కాని, వారి చుట్టూ పక్క ల సమాజం కాని సమస్యని అర్ధం చేసికోవాలని ఆశిద్దాం.