18, జూన్ 2012, సోమవారం

ఇంకొక ప్రేమ జంట ఆత్మహత్య, కారణమెవరు ?

పుట్టి భూమ్మీద పడగానే చిన్నారులకు సమాజం వల్ల బోలెడన్ని బాధ్యతలు వచ్చేస్తున్నాయి. అబ్బాయి ఉన్నాడు అంటే, వరసయ్యే  అమ్మాయిని భార్యగా పరిచయం చేస్తారు. ఆడపిల్ల తండ్రి కాస్త ఎక్కువ సంపన్నుడై,  అమ్మాయి కి రూపం చదువు అబ్బి ఉంటె అతనిపై రెట్టింపు బాధ్యత ఉంటుంది తగిన అల్లుడిగా తనను తను ప్రూవ్ చేసికోవడానికి.  ఏ అమెరికానో ఆస్ట్రేలియా నో వెళ్లి చదివి తిరిగొచ్చి అమ్మాయిని పెళ్లాడాలి. ఆ చిన్న మనసు ఎంత వత్తిడి తట్టుకోగలదు !!!


 సరే మామయ్య అల్లుడిని  తిరస్కరించాడు. అయితే జీవితం అక్కడితో ఆగిపోదు కదా. ఆశలు కలిపించమని తాను అడిగేడా, చిన్న తిరస్కారం అయినా తన ప్రపంచాన్ని మార్చెయ్యదా . ఆ బాధ అంతా పక్కింటి ఇంకో అమ్మాయి పై ప్రేమ గా మారింది, కాని కులాల మధ్య అంతరాలు ఆ అమాయక పెద్దల్ని మరొకసారి దోషుల్ని చేసింది. ఇద్దరు వెళ్లి పోయారు. చెయ్యని ప్రయత్మ లేదు ఆచూకి కోసం. కొద్దిగా తెలిసాయి కాని ఇరవై రోజులతరువాత గోవా నుండి కబురు, ఇద్దరు ఆత్మహత్య చేసికొన్నారు,  SIM Card ఆధారం గా అడ్రస్ ట్రేస్ చేసి తెలియపరుస్తున్నాము అనీను.



ఆంద్ర రాష్ట్రం నుండి గోవా దాకా వెళ్ళారా కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఆత్మహత్య కోసం !! అందరికీ దూరం అవ్వలేని సున్నితత్వం, కలిసి ఎక్కడో ఒకచోట బ్రతుకలేని నిస్సహాయత .అయినా చేతులారా ప్రాణం ?  ఎలా ఆ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు.   ఆత్మ హత్య కావచ్చు ఇంకోసమస్య కావచ్చు, మానవ సంబందాలన్నే ఆర్దికసంబందాలన్న భావన సమాజం లో అంతర్లీనం గా పెనవేసుకుపోయింది. ఎక్కడ పొరపాటు జరిగిందీ తెలియని ఎందరో తల్లిదండ్రుల గుండెకోత కు సమాధానం ఎవరు వివరిస్తారు.  ఇంకొకరు ఇలా బలి కాకూడదు అని చిన్న ఆశ తో ఈ టపా. ఆ ఇద్దరి ఆత్మకు శాంతి కలగాలని !!!

14, జూన్ 2012, గురువారం

కాంగ్రెస్ జగన్ నే టార్గెట్ చేసిందా లేక ఓటర్లను టార్గెట్ చేసిందా ?



ప్రజాస్వామిక వాదులందరూ అడుగుతున్న ప్రశ్న!  ప్రభుత్వం కేవలం జగన్ యొక్క అవినీతిని మాత్రమె ఎందుకు నేరం  గా పరిగణిస్తున్నది ?  ప్రతిఒక్కరికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నది అని అంటున్నారు. అలాగే ప్రభుత్వానికి తెలుసు, జగన్ ని జైల్లో పెడితే సానుభూతి పెరిగి అతను రాజకీయంగా సక్సెస్ అవుతాడు అని. అయినా అతన్ని అరెస్టు చేసి విచారణ జరిపించడానికి కారణాలు ఏమిటి?

కాంగ్రెస్ కి కావలసినది 2014 లో మళ్ళి పార్టీ అధికారం లోకి రావడం, గెలుపు కు ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జగన్ ని వదిలేస్తే పెద్దమొత్తం లో కాంగ్రెస్ ఓట్లు  చీల్చుకొంటాడు. జగన్ కు చెక్ పెట్టాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి  వల్ల లబ్ది పొందిన ప్రజలను ఎలాగు మార్చలేరు కాబట్టి, ఆయన వల్ల నష్టపోయిన ప్రజల మద్దతు సంపాదించడం ముఖ్యం. అటువంటి జీవో లు రద్దు చెయ్యాలి అంటే ముందు ఆ ప్రాజెక్టు కు సంబంధిత వ్యక్తులను అనర్హులు గా ప్రకటించాలి కాబట్టి వాన్ పిక్ కేసులో ముద్దాయిలంతా అరెస్టు చెయ్యబడ్డారు, జీవో రద్దవుతున్నది . అదేసమయం లో కాకరపల్లి, సోంపేట థర్మల్ ప్రాజెక్టులకు అనుమతుల్ని రద్దు చెయ్యడానికి మార్గం సుగమం అయ్యింది. ఈ రైతులంతా నేరం చేసిన వైఎస్సార్ లేని ఈ కాంగ్రెస్ కి బ్రహ్మరధం పట్టాలి కదా మరి.

కాంగ్రెస్ కి వ్యతిరేక ప్రచారం చెయ్యడమే పనిగా పెట్టుకొన్నందువల్ల , సాక్షి పై కొన్ని దాడులు చేసినా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు చాలావరకు బెడిసికొట్టాయి. జలయజ్ఞం కు సంబంధించి ఇప్పటివరకు ఒక్కరినీ కదిలించకపోవడానికి కారణం, ఈ ప్రాజెక్టులు అన్నింటికీ ఉన్న ప్రజామోదం కాదా ?

ఇకముందు స్పీకర్ ఎవ్వరి రాజీనామాలు అంగీకరించేది లేదు అని ప్రకటించారు కాబట్టి, అవిశ్వాసం ప్రవేశపెట్టడం మినహా జగన్ మోహన్ రెడ్డి చెయ్యగలిగినదేమీ లేదు. ప్రజలు మాత్రం కాంగ్రెస్ అంటే ప్రస్తుతం జగన్మోహన రెడ్డి కే కనెక్ట్ అయి వున్నారు. కాబట్టి  రాబోయే రెండుసంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారి ని మరిపించేలా కాంగ్రెస్ పరిపాలన సాగిస్తే కొంతవరకు రాష్ట్రం లో  పార్టీ నిలబడుతుంది. 

అలాగే చంద్రబాబు అవినీతిని బయట పెట్టాలి అంటే, టి ది పి ప్రభుత్వం వల్ల దెబ్బతిన్న ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో నే ప్రయత్నించాలి. కాని అవ్వన్నీ Y S రాజశేఖర్ రెడ్డి గారు ఉపయోగించేసారు కదా. బయట పడితే జనానికి పనికొచ్చే స్కాములు బాబు ఖాతాలో ఎమున్నాయబ్బా ?  మీకు తెలుసా !!!

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

6, జూన్ 2012, బుధవారం

ఒక అబ్బాయి - ఒక అమ్మాయి - వేధింపుల పర్వం



ఆ అబ్బాయి ఎందుకు వేదిస్తున్నాడు రేణుక ను??? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న. మొదట సీనియర్  గా యెంతో అభిమానం గా సాయం చేసాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అందరు చెప్పేది ఒకటే  మాములు గా చాలామంచి వాడు  స్టేట్ రాంకర్ కూడా. ఇంకెవరితోనూ అమర్యాదగా మాట్లాడిందే లేదు. రేణుక గురించి చెప్పాలంటే చదువుల సరస్వతి. అందరితో స్నేహం గా ఉండే తత్త్వం. సరదాకి కూడా ఎవరినీ నొప్పించదు తను. అతని తో సమస్యను వీలయినంత సామరస్యం గానే పరిష్కరించుకోవాలని ఆశ పడింది.

ప్రెషర్స్ పార్టి లో ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన కు బోల్డన్ని ఫోటో లు తీసాడు. నెగెటివ్స్ తో సహా అడక్కుండానే తెచ్చి అమ్మాయికి ఇచ్చేసాడు. ఒక రోజు ఉన్నట్టుండి నెగెటివ్స్ కావాలని అడిగాడు. రేణుక ఇవ్వడం ఇష్టం లేకో , నిజం గానే కనిపించకో ఎక్కడో పెట్టేసాను లేవు అని సమాధానం చెపుతూ వచ్చింది. ఉహూ అతనికా సమాధానం నచ్చలేదు. అహం దెబ్బతిందో ఏమో ఆ అమ్మాయిని మాత్రమె బెదిరిస్తూ పోయాడు.పాపం అతన్ని వదిలించుకోవడానికి అని నిజం గానే వెతికింది ఫోటోలు , నెగెటివ్స్ కోసం  కాని దొరకలేదు. అక్కడే సమస్య మరింత జటిలం అయ్యింది.

కాలేజ్ మానేజ్మెంట్ కి పలు కంప్లైంట్స్ వెళ్ళాయి , అతన్ని హాస్టల్ నుండి కొన్నాళ్ళు తొలగించారు. ఆ అమ్మాయికి రక్షణ కావాలి అని అందరికి అర్ధం అయ్యింది. కాని సంవత్సరం పొడుగుతా రక్షణ ఇవ్వలేరు కదా. ఇంకా గట్టిగా అడిగితె అమ్మాయిని హాస్టల్ నుండి పంపేసినా దిక్కులేదు. మధ్యలో కొంచెం మారాడు అనుకొంటున్నారు. మిగిలిన అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసేవారు తనని ఏమి చెయ్యొద్దు అని, విని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.


అసలు వాళ్ళిద్దరి పరిచయమే పెద్దవారి ద్వార జరిగింది. అమ్మాయి కాలేజ్ లో జాయిన్ అయ్యేసమయం లో , తమ ప్రాంతం అనో ఒకే ఊరు అనో తెలిసి సీనియర్ అయిన ఆ  అబ్బాయి ని కలిసి , అమ్మాయి తల్లి  'చెల్లె ని' బాగా చూసుకో నాయనా అని బోల్డంత బాధ్యత అబ్బాయికి అప్పగించేరన్న మాట. కాని ఇపుడు అమ్మాయిని బాధ పెడుతున్నాడు అని తెలిసి అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయి తరపువారు  సమస్య చెప్పారు. మేము చెప్పగలిగినది చెప్పాం అని, ఇంకా తాము కొడుకు కి పలుమార్లు చెప్పి విసిగిపోయామని  వదిలేశామని వారు చేతులెత్తేశారు !!!

 ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే వేళ ఒకరోజు తాపిగా పరీక్షా వ్రాసి , అమ్మాయి మెస్ నుండి బయటికి వచ్చే టైం లో గేటు దగ్గర కాపలా కాసి వెంట పడ్డాడు. పదునైన కత్తి(బ్లేడు ?)  తో మొహం నిండా, ఇంకా చేతి మణి కట్టు దగ్గరా కసితీరా గాయ పరిచాడు. ఆ  అమ్మాయి అందం గా కనిపించ కూడదని మొహం పై పాశవికం గా దాడిచేసాడు. చెయ్యి అడ్డుపెట్టడం తో మణికట్టు దగ్గర నరం తెగి రక్తం ధార కట్టింది . కళ్ళు మూసి తెరిచేంత లో పరారు అయ్యాడు.  గబా గబా తనని హాస్పిటల్ కి తీసికొనే వెళ్ళడమే కాక ప్రిన్సిపాల్ కి మరియు పేరెంట్స్ కి కూడా సంఘటన గురించి తెలియపరచడం జరిగాయి. విద్యార్ధినీ విద్యార్దులు అందరు రేణుకకు మద్దతు గా నిలిచారు. చాలా రక్తం పోయింది కాని, గండం గట్టెక్కినట్లే. వాళ్ళ ఒక్క బాచ్ కి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి.

 పోలీసులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. నాలుగు రోజులకి ఎమ్మెల్యేని వెంట బెట్టుకొని వచ్చి పోలీసుల ముందు తనే లొంగిపోయాడు. ఒక ఫోటో ఆమ్మయితో కలిసి ఉన్నది చూపి , నాతొ ఆ అమ్మాయి తిరిగినది అని అభియోగం మోపాడు. అప్పటి దాకా అమ్మాయికి అండగా నిలిచినా తండ్రి , ఆ పిల్లని తిట్టిపోయ్యడం మొదలుపెట్టారు. ఆయనకీ తెలుసు అది అంత అబద్దం అని , కాని ఫోటో దిగి చెప్పలేదు అని బాగా కోపం తెచ్చు కొన్నారు .


నిజానికి ఒక సెలవురోజు అమ్మాయి తన మిత్ర బృందం తో ఫోటో లు తీసికొంటూ ఉండగా, అటుగా వెళ్తున్న ఈ అబ్బాయి నాతొ కూడా ఫోటో అని మొహమాట పెట్టి  తన ప్రక్క నిలుచున్నాడు . అందరు అన్నయ్య అని పిలుస్తారు కదా, అందునా సీనియర్ కాబట్టి వద్దు అని ధైర్యము చెయ్యలేదు, అలాగని అనుమానమూ లేదు. అదన్నమాట ఫోటో వెనుక కధ. అసలా సంగతే మర్చిపోయారు. కాని తండ్రి అర్ధం చేసుకొంటే కదా. ఆయనకీ కూతురు అమాయకత్వం కన్నా, కేసు నీరుకారిపోతున్నదన్న బాదే ఎక్కువయ్యిందా, ఏం చేస్తాం.

బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులు  గా ఉన్న ఆ అమ్మాయి సహ విద్యర్దినులను అందరినీ  కత్తి తో బెదిరించి  వెళ్ళాడు .నిజానికి ప్రత్యక్ష సాక్షి గా ఉన్న  రేణుక కు రూం మేటు ఒక అమ్మాయి , ముందే తను మాత్రం సాక్ష్యం చెప్పేది లేదు అని నిర్ణయించుకొంది, కెరీర్ కి ట్రబుల్ రావోచ్చును అని.  ప్రిన్సిపాల్ కూడా కొన్ని అనివార్య కారణాలు, స్వప్రయోజనాలు కూడా దృష్టి లో ఉంచుకొని విచారణ కి దూరం గా ఉన్నారు. ఇంకా మిగిలిన వారిలో వేరే బ్రాంచ్ కి చెందిన ఒకమ్మాయి ( పేరు స్వాతి ) మాత్రం మనస్సాక్షి ముఖ్యం అని సాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా తన స్నేహితులు  ఒట్టు పెట్టిన్చుకొన్నారు, అబ్బాయి చంపేస్తాడు అన్న భయం తో . సాక్ష్యం చెప్పనివ్వని మిత్రులపై కూడా అలిగి తానూ మౌనాన్ని ఆశ్రయించింది.



అప్పటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఆ ఫోటో ని ఆధారం గా చూపడం మోసం కాదా అని. సమాధానం ఇంకో అమ్మాయి ఇందు ద్వార వెలుగులోకి వచ్చింది. తనతో ఉన్నట్టుండి ఒకసారి ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు , పెద్ద వాళ్ళు తను చెల్లి వరుస అవుతుంది అని మొదట చెప్పారు కాని ఇంకో వరుసలో మరదలు అవుతుందని అతనికి తెలిసింది అని . ఇందు ఆ విషయం అప్పుడే వదిలేసింది పొడిగించడం సభ్యత కాదు కాబట్టి. హ్మ్ అలా  అతను రేణుకను ప్రేమించాడు, వ్యక్త పరిచడానికి వీలు లేదు అన్నయ్య గా పరిచయం అయ్యాడు కాబట్టి. అలాగని తనలో తాను దాచుకోలేక, మణిరత్నం సినిమా లో విలన్ గా మారిపోయాడు .



తర్వాతి సంవత్సరం మొదలయ్యింది. కేసు చాలా మలుపులు తీసికొంది. అబ్బాయి తల్లి దండ్రులకి కడుపు తీపి గుర్తుకొచ్చింది, అమ్మాయి కాళ్ళా వేళ్ళ పడ్డారు  కేసు వెనక్కి తీసికొమ్మని, ఇద్దరికీ పెళ్లి ఒక పరిష్కారం గా కూడా సూచించారు. ప్రాణహాని గురించి  చెప్పి కాదంటే వ్రాయడానికి వీలు కానన్ని తిట్లు శాపనార్ధాలు పెట్టారు. సాక్ష్యము ఇవ్వాలని ఉన్న స్వాతి  కి మిత్ర బృందం చివరికి తామంతా రక్షణ గా ఉంటాము ఏదయితే అది అవుతుంది అని ఆమెని సాక్ష్యం ఇవ్వడానికి అనుమతించారు  . ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మాయిని మాత్రం ఎవరు బలవంత పెట్టలేదు. ఈ లోగా ఆ అబ్బాయి తన బెదిరింపుల పర్వం లో ప్రిన్సిపాల్ ని కూడా  ఈ కేసు లో ఇన్వాల్వ్ అయితే చంపేస్తా అని  బెదిరించేసరికి  ఆయన అహం బోల్డంత దెబ్బతినేసింది .ఇంకేం ఆయన తను చెప్పాల్సింది కోర్టు లో న్యాయమూర్తి ఎదుట చెప్పేశారు, మిగిలిన సాక్ష్యాలు అన్ని కూడా విన్న జడ్జి అతనికి పదేళ్ళు జైలు శిక్ష విధించాడు.

ఇంకో మూడు సంవత్సరాలు గడిచాయి, ఇన్ని సమస్యలను దాటి రేణుక చదువు అయిపోయింది . ఒక కాలేజి లో లెక్చరర్ గా ఉద్యోగం లో చేరింది. తను నేను ఇపుడు బాగానే ఉన్నాను , అతని భవిష్యత్తు పాడయిపోతున్నది అని కేసు వాపస్ తీసికొని అతని విడుదల అయ్యేలా చూసింది అని తెలిసి చాలా సంతోషం వేసింది. అంత మంచి అమ్మాయి రేణుక.

అబ్బాయి కూడా మంచి వాడే. కాని మన వ్యవస్థ లో ఈ పెద్ద వాళ్ళు అమ్మాయి కి అదే కాలేజి లో చదువుతున్న అబ్బాయి రక్షణ అని వాళ్ళిష్టం వచ్చినట్లు పరిచయం చెయ్యడం, పదే పదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెల్లె జాగ్రత్త అని చెప్పడం కూడా స్వార్ధం తో కూడిన  సామాజిక పొరపాటు అని నా అభిప్రాయం . అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం  కావాలి అని ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుంది.  ఇక రేణుక లాంటి అమ్మాయిలు పెద్దవాళ్ళ పిరికితనం, అభద్రతా భావం తమని, తమ స్నేహాల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి.

ఆడపిల్లల పై దాడి జరిగిన చాలా సంఘటనల్లో అబ్బాయిలని మాత్రమె బాధ్యులని చెయ్యకుండా , అమ్మాయిలు వీలయినంత వరకు తమ తమ పరిచయాలను పునః పరిశీలన చేసుకొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎవరి రక్షణ కు వారే మొదటి బాధ్యత వహించాలి.

 ఒక అబ్బాయి  , లేదా అమ్మాయి ని 'సెలెక్టివ్' గా అన్న, చెల్లి ,అక్క  లేదా తమ్ముడు అని వ్యవహరించాల్సిన ఖర్మ తెలుగువాళ్ళకే నేమో . ఇది నవీన కాలపు సామజిక దురాచరమా అని అనుమానం వస్తుంది.



30, మే 2012, బుధవారం

సాఫ్ట్ వేర్ పెళ్ళిళ్ళు





అబ్బాయి అమ్మాయి ని ఒకే చేసాడు. అబ్బాయిది సాఫ్ట్వేర్ జాబే, జీతం మరీ ఎక్కువా ,తక్కువా కాదు. ఆస్తి మాత్రం బానే ఉంది. అమ్మాయి ఉజ్జోగం వేరే రాష్ట్రం లో . అదీ పర్మనెంట్ కాదు కాబట్టి, పెళ్లి తర్వాత మనికి కావాల్సిన చోట జాబు చూసుకోవచ్చు అని అనుకొన్నారు . సంబంధం కుదిరింది. ఆర్భాటం గా ఎంగేజ్మెంట్, బంధు మిత్రుల సమక్షం లో పలు లాంచనాలు, కానుకలతో పెళ్లి జరిగాయి. పదహారు రోజుల పండుగ కూడా ముగించుకొని క్రొత్త జంట వారి వారి ఉద్యోగ విధుల్లో చేరిపోయారు. మొదటి ఆరునెలలు విడి  విడి గ వేర్వేరు పట్టణాల్లో ఉంటూ , సెలవలుకు ఇంటికి వచ్చినపుడు కొత్త అల్లుడు మర్యాదలు అక్కడ, కొత్త కోడలు మురిపెం ఇక్కడా, ఇలా గడిచిపోయాయి. అమ్మాయి కి మొదటి రెండు మూడు నెలలు జీతం కి , అంతే మొత్తం కలిపి అత్త గారు బంగారు గాజులు చేయించి ఇచ్చింది.

 మొత్తానికి ఆరునెలల తర్వాత దంపతులు  ఒకచోటికి చేరారు. అబ్బాయి అంతే ఎంతో ప్రేమ ఉన్న అమ్మ, అక్క  వచ్చి కావలసినవి అన్ని ఇంటి లో అమర్చి పెట్టి వెళ్లారు.అమ్మాయి క్రొత్త ఉద్యోగ ప్రయాలు  మొదలు పెట్టింది. అలా పది రోజులు గడచాయి, స్వంత ఊరికి వచ్చారు. అబ్బాయి తల్లి దండ్రులతో చెప్పి బాధ పడ్డాడు, ఆ అమ్మాయి ఎప్పుడు ఎవరో అబ్బాయి తో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అని. పెద్దవాళ్ళ దాకా వచ్చాక విషయం విడాకులకు దారి తీసింది.






కోర్టు బయట సెటిల్మెంట్ జరుగుతుండగానే, మధ్యవర్తుల ప్రమేయం తో అమ్మాయి తరుపు నుండి రాజి ప్రయత్నాలు జరిగాయి. కాని అబ్బాయి వైపువారు, మధ్య లో అనుకొన్న మాటల వల్ల నొచ్చుకొని అంగీకరించలేదు, మొత్తానికి సెటిల్మెంట్ కుదిరి విడాకులు కుడా వచ్చేసాయి.

సమస్య ఎక్కడుంది. పది రోజుల కాపురాన్ని  విడాకులదాకా తీసికెళ్ళిన కారణం సరైనదేనా?



9, మే 2012, బుధవారం

మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

ఈ  సిరీస్ లో మొదటి బాగం చూడాలనుకొంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.


నేను ఈ సిరిస్ లో సరి అయిన సమయం లో దత్తత తీసికొన్న పిల్లలకి నిజం చెప్పక పోవడం వలన కలిగే సమస్యలని, తీసికోవలసిన జాగ్రత్తలను మాత్రమె చర్చించ దలుచు కొన్నాను. అందువల్ల తల్లిదండ్రుల పొరబాట్లను చర్చించడం తప్పని సరి, దాని అర్ధం దత్తత తీసికొనే తల్లిదండ్రులని తక్కువ చేసి మాట్లాడడం ఏమాత్రం కాదు. అలాగే సరి అయిన సమయం అంటే ఆ పిల్లలకి మెచ్యురిటి వచ్చిన తర్వాత అన్న అపోహ ను కూడా బ్లాగర్లలో చూసాను.



దత్తత తీసికోదలచిన తల్లిదండ్రులకు ఉండాల్సిన కొన్ని ముఖ్యమైన అవగాహనలు:



౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ఆ తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొకరిద్వారా ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము కాబట్టి, ఆ బిడ్డ చెవితో విన్నదానిని అర్ధం చేసికొనే వయసుకు రాగానే చెప్పెయ్యాలి. అలా చెప్పకూడదు అంటే కృష్ణప్రియ గారి ఈ టపా లో దంపతుల మాదిరిగా, బంధువులకు కూడా తమ బిడ్డ దత్తత చేసికొన్న బిడ్డ అని తెలియనివ్వకూడదు (వారు అందరికి దూరంగా నివసించడం వాళ్ళ ఇది సాధ్యపడి ఉండొచ్చు )



౨. తల్లిదండ్రులకు తాము దత్త త తీసికోబోయే బిడ్డ యొక్క అసలు తల్లిదండ్రులు తెలిసే అవకాసం లేనందున, వారి కులము మతము కూడా తెలిసే అవకాసం లేదు. కాబట్టి అప్పటి నుండి తల్లి దండ్రులు కుల మత విశ్వాసాలను వదిలెయ్యాలి. అలా వదిలెయ్యడమే న్యాయం కుడా నిజం గా దత్తత తీసికొన్న బిడ్డపై నిజమైన ప్రేమ ఉంటె. ఎందుకంటే నిజం తెలిసాక ఆ బిడ్డకి తన కులము మతము ఇది కాదు అన్న బాధ కలగ కూడదు. అగ్ర వర్ణాలలో ఈ సమస్య అధికం, ఎందుకంటే వారికి ఉండే కుల దురాభిమానం ఆ బిడ్డకి కూడా వస్తుంది. నిజం తెలిసాక తన అసలు కులం ఏదో తెలియక, అప్పటి వరకు పెంచుకొన్న దురాభిమానం వదులుకోలేక 'సంఘర్షణకు' లోనవుతారు. ఆ సంఘర్షణ ప్రభావం వారి వివాహ సమయం లో మరీ ఎక్కువవుతుంది. అదేకులం కి చెందినా వ్యక్తిని పెళ్ళాడినా, వారికి నిజం తెలిస్తే ప్రేమను పంచుతారా అన్న సంకోచం వారిని వేధిస్తుంది. ఆ బిడ్డకి తప్ప, అందరికీ తెలిసిన నిజం, ఎక్కడి నుండో వచ్చిన జీవిత భాగ స్వామికి తెలియకుండా ఉంటుందా? అదే చిన్నతనం లోనే నిజం తెలిస్తే, తన జీవితాన్ని తము మలచుకోగలగుతారు ఈ కులాలకి, మతాలకి అతీతం గా.



౩. సాధారణం గా ఆస్తి ఉండి పిల్లలలు లేని చాలామంది ఇప్పటి తల్లి దండ్రులు ఈ రహస్య దత్తత ప్రక్రియ ద్వారా ఒక్క బిడ్డనే దత్తత చేసికొంటారు. ఆ బిడ్డను చాలా రిచ్ గా పెంచుకొంటారు (అప్పటి దాకా బందువులకు ఆశ ఉండి ఉంటుంది ) ఇది ఎవరు కాదనలేనిది. బిడ్డను విలాసాలకు, సంపదకు అతీతం గా పెంచుకోవాలా, సంపదలో ముంచి తెల్చుకోవాలా అన్నది ఆ తల్లిదండ్రుల స్వ విషయమే. కాని అదే సమయం లో అంతకు ముందు వరకు ఉన్న బంధుత్వాలను వీలయినంత వరకు నిలుపుకోగలిగితే, ఆ బిడ్డకి ఒంటరి తనం ఉండదు. అప్పుడు ఒకవేళ నిజం తెలిసినా ఆ బిడ్డలో ఈ సంపద నాది కాదు అన్న న్యూనతా భావం కాని, సంపద తనదే అన్న అహంభావం కాని ఉండదు. డబ్బే ఆ బిడ్డకు పెద్ద శత్రువు కాకుండా కాపాడాలి అన్నది ఈ పాయింట్ యొక్క సారాంశం.



౧. తమ సంతోషం కోసం 'మాత్రమె' ఆ బిడ్డని దత్తత చేసికోదలచామన్న విషయాన్ని దత్తత చేసికొన్న వారు మరచి పోకూడదు. ఆ బిడ్డ కాకుంటే ఇంకో బిడ్డను తీసికొంటారు. అలాగే వీరు కాకుంటే ఇంకొకరు ఆ బిడ్డను దత్తత చేసికొంటారు లేదా తను ఉన్నచోటే ఉండాల్సి వస్తుంది. ( కాని ఎక్కడో రోడ్డు మీద దిక్కులేక పడి ఉన్న బిడ్డపై జాలి చూపి దగ్గరకు తీసికొన్న దానితో సమానం అవదు. ) కాబట్టి ఆ బిడ్డకి విశ్వాసం ఉండాలన్న డిమాండ్ పూర్తిగా స్వార్ధపూరితమైనది. ఆ అబిప్రాయం మాములుగా జనం నుండి వస్తుంది, చూడండి వాళ్ళు తీసికొచ్చి పెంచితే రుణపడి వుండకుండా స్వార్ధం చూసుకొన్నాడు అని అంటూ ఉంటారు . నిజానికి తానెవరో తనవాల్లెవరో తెలియక కలతపడి, చదువు పై శ్రద్ద చూపలేక, మొండిగా నిర్లక్ష్యం గా మారిన పిల్ల లేదా పిల్లవాడి పై చూపాల్సింది జాలి మాత్రమె. కాని అవేవి సమాజానికి అక్కరలేదు, తమకి దక్కనిది ఆబిడ్డకి దక్కినది అన్న ఉక్రోషం తప్ప. కాబట్టి తల్లిదండ్రులే కాస్త వివేకం తో నడుచుకోవాలి.



౫. వేరేవారి ద్వార నిజం తెలిసినపుడు, ఆ మాట్లాడిన వారిని నిందించే జనాన్ని చుస్తే నవ్వు వస్తుంది. ఆ బిడ్డకి తెలియకుండా దాచిన సంగతి ఈ తల్లిదండ్రులేమైనా దండోరా వేసి చెప్పారా!!! లేదే?అలాగని అందరితో ఈ తల్లిదండ్రులకు మిత్రత్వం మాత్రమె ఉండడం సాధ్యం కూడా కాదు. అసలు అనుకోకుండా మాట్లాడిన వారందరూ స్వార్ధపరులు కాదు, ద్వేషపూరిత మనస్తత్వం ఉన్న వాళ్ళు కూడా కాదు.



౬. దత్తత చేసికొన్న బిడ్డని అతిగారాబం చేసి వారి భవిష్యత్తును పాడు చేసే హక్కు ఆ తల్లిదండ్రులకు ఉందొ లేదో వారికే వదిలేద్దాము. కాని దండించే సమయం లో ఆ తల్లిదండ్రులకు నిజం గానే చెయ్యి రాదు. తమ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదు కాబట్టి దండించే హక్కు లేదు అన్న భావం వెంటాడుతోంది. అది ఆ బిడ్డ కి చెప్పలేనంత చెడు చేస్తుంది.



౮. ఆడపిల్లకు నిజం తెలిస్తే (బయటి వారి ద్వారా) ఇంట్లో ఉండే పిల్ల కాబట్టి పెంచిన తల్లి దండ్రులకి నిజం తెలిసి పోతుంది. అపుడు ఎలా తెలిసింది అన్న వివరాల్లోకి వెళ్ళడం మానేసి ఆ పిల్లకి తాము ఏపరిస్తితిలో దత్తత చేసికొన్నామో, తెలియచేసి అర్ధం అయ్యేలా చెప్పుకోవాలి. అవసరమైతే తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించాలి (బిడ్డకి కాదు). అసలు ఇలా దత్తత కి ఏర్పాట్లు చేసే హాస్పిటల్స్ లోనే , డాక్టర్స్ కాని ఎవరైనా దత్తకు ముందే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తే ఎంత బావున్ను.



౯.మగపిల్లలకి బయటి వారి ద్వారా తమ తల్లిదండ్రులు,స్వంత తల్లిదండ్రులు వేరు అని తెలిస్తే అది ఇంకా ప్రమాదకరమైన పరిస్థితి. ఎందుకంటే వారు ఆ చెప్పిన వారిని పూర్తి వివరాలు అడగలేరు, అలాగని ఇంట్లో ను అడగలేరు. క్రమంగా విలాసాలకు మాత్రం దూరం అవుతారు. ఇంట్లో సమయం గడపడం తగ్గించి ఫ్రెండ్స్ తో బయట ఆటల పేరుతో గడిపేస్తారు . చదువు పై సహజం గానే ఆసక్తి పోతుంది. వారి భవిష్యత్తు అంధకారమై పోతుంది .ఇక నటించడం కూడా మొదలుపెడతారు పాపం. క్రమంగా తమ చుట్టూ ఉన్నవారి పై లోలోపల ద్వేషం పెరుగుతుంది.చుట్టూ ఉన్నవారు ఎలా నటిస్తున్నారో ఈ పిల్లలు కూడా అలాగే నటిస్తారు. పెంచిన తల్లి దండ్రులకు దూరం గా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు, కుల మత కారణాలు పెద్ద పాత్ర వహిస్తాయి. తల్లిదండ్రులకి విష్యం తెలిసే సరికి పూడ్చలేని అగాధమే ఏర్పడుతుంది. రెండువైపులా తెగిన గాలి పటాలవుతారు.



మగపిల్లల్ని పెంచుకోవాలని ఆశపడే తల్లిదండ్రులు కాని, వారి చుట్టూ పక్క ల సమాజం కాని సమస్యని అర్ధం చేసికోవాలని ఆశిద్దాం.





27, డిసెంబర్ 2011, మంగళవారం

ద డర్టీ పిక్చర్ - ఒక అభిప్రాయం

మొదట గా సినిమా పేరు విషయం కొస్తే  సినిమా విడుదలయ్యాక జనం చూసి అసహ్యంతోనో, ఆదరం తోనో  దానికి పెట్టుకునే ముద్దు పేరునే సినిమా పేరు గా పెట్టి, సగం విజయం ముందే సొంతం చేసికొన్నారు. కాబట్టి మహిళలో, విమర్సకులో ప్రశ్నించే అవకాసం లేదు.  సిల్క్ స్మిత జీవిత చరిత్ర లో విద్యాబాలన్ నటించడమా, స్మిత జీవితం ధన్యమైనట్టే!!! ఇదీ మొదటివార్త చూసినపుడు కలిగిన అభిప్రాయం.    పోస్టర్స్ చూసాక, ఒక నటి జీవితాన్ని చులకన చేసారేమో అన్న సంశయం.   కాస్త కోపం కుడా వచ్చింది ఆ చిత్ర నిర్మాతలపై!!!.    కానైతే  ఎంత మందికి ఒకప్పటి నటి సిల్క్ స్మిత పై ఆమె జీవించి  ఉండగా ఇప్పుడున్నంత   అభిమానం ఉన్నదిఇప్పుడింత మంది అభిమానులు హటాత్తు గా వచ్చారా?   లేక వీళ్ళంతా మమైత్  ఖాన్,తదితరులనిని కూడా ఇంతే ప్రేమతో ఆదరిస్తున్నారా????

సినిమా చూసాక ఈ అభిప్రాయాలు పంచుకోవాలనే ఆసక్తి ఉన్నాతెలుగు బ్లాగుల్లో సిల్క్ స్మిత కో, ఏక్తా కపూర్ కో కృష్ణవంశీ , బాపు వంటి వారికి  ఉన్నంత అభిమాన దురభిమానులు లేనందువల్ల  బ్లాగ్లోకం లోని  గొప్ప సినీ విశ్లేషకులంతా మౌనం వహించారు. అదుగో అప్పుడే జగద్దాత్రి గారు ద డర్టీ పిక్చర్ (నా ఆవేదన)   అనే చాల చక్కని వ్యాసం అందించారు.  వారు స్వయం గా రచయిత్రిచక్కని ప్రమాణాలతో వారి అబిప్రాయాన్ని అందించి చివరిగా, " ఏమి మిత్రులారా నా ఆవేదనకీ అర్ధం లేదంటారా? మీకు ఈ వేదన కలగలేదంటారా?"  అని అడగారు కాని, అడగకున్నా నా సమాధానం  వారి ప్రయత్నాన్ని గౌరవించడానికి అయినా వ్రాయాలి. నా అభిప్రాయం తెలియచేయడానికి ఒక వేదిక కల్పించిన జగద్దాత్రి గారికి ధన్యవాదాలు.

అసలు ఈ సినిమా చూసే ధైర్యం చెయ్యడానికి కారణం పాసిటివ్ రివ్యూలు. అవన్నీ నూటికి నూరుపాళ్ళు నిజం అని చెప్పాలి. కాబట్టి వారికి ధన్యవాదములు. కధ ఒక వర్గాన్నిసమాజాన్ని దగ్గరగా చూపిస్తుంది. వ్యాసరచయిత జగద్దాత్రిగారు

"సినీ నటి కావాలనే అభిలాష కలిగిన ఒక స్త్రీ ఎన్నో విధాలుగా ఇలా వాడుకోబడటం అన్నది చాల పెద్ద పెద్ద వాళ్ల విషయాల్లోనే జరిగింది అన్నది వాస్తవమే. " 

 అని చెప్పాక సినిమాలో సిల్క్ అన్న పేరు ఒక రిఫరెన్స్ మాత్రమె కాని, ఆ పెద్ద నటీ మణులకి కూడా కధలో చోటు ఉందనిపించక మానదు. అదే సమయం లో వారిని చులకన చేయడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు.

నేటి యువతకు దర్శక నిర్మాతలు ఏమి చెపుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కాని సమాజం, యువత సినీ దర్శక నిర్మాతలకు ఏమి చెపుతున్నది అన్న ప్రశ్నకు కూడా భాగం ఉంది.  ఇది కేవలం డబ్బుకోసం మాత్రమె తీసిన సినిమా గా చూడబడితే, మరోకోణం లో ఇప్పడు వస్తున్న,మనం చూస్తున్న  సినిమా లన్నింటికి ఒక ఆత్మవిమర్శ గా నిలబడ గల సత్తా కూడా ఉంది.

సినిమాలో విద్య బాలన్ పాత్ర బాగానే నటించినప్పటికీ మొదట్లో ఆమె ఆలోచన ధోరణి నే అసహ్యకరంగా చూపించారు అన్నారు. ఉహూ అదే సమయంలో ఆమె ఖచ్చితత్వాన్ని కూడా చూపారు.  ఒక అభ్యంతరకరమైన ధోరణి  సమాజం లో చెప్పుకోదగ్గ శాతం యువత లో ఇప్పటికే ప్రదర్సించబడుతు ఉన్నది.  మన చుట్టూ ఇలాంటి వాతావరణానికి ఎప్పుడో అలవాటుపడిపోయామే, మరి చిత్రం గురించి ప్రశ్నించేది  ఎలా ?  

 వాల్ పోస్టర్స్ కూడా సినిమాలోవే అయినా కళాత్మకం గా ఉంటె బాగుండేది. కాని అవయినా చూడడానికి తపించిపోయిన సమాజానికి కూడా ఈ పాపం లో భాగం ఉంది. 

సినిమాలో ఒక చోట బ్లాక్ లో టికట్ కొనుక్కునే కుర్రాడితో ఈ డబ్బులకి ఆమె నీకు దొరుకుతుంది కదా అనడం చాలా అవమానంగా అనిపించింది. ఎంత వాంప్ పాత్రలో నో ఐటెం పాట లోనో నటించినప్పటికీ ఆమె శరీరం ఒక బ్లాక్ టికెట్ కొన్నంత వెలతో సమానమా ? ఇది మనసు కలచివేయ్యడం లేదా?ఇది యువతకు ఏ ప్రబోధాన్నిస్తోంది ?

హాస్టల్స్ నడిపే ఆంటీ ల గురించి, కాస్త ఎక్కువ చనువుగా మెలిగే అమ్మాయిల గురించి ఇలాంటి మాటలు విన్నప్పుడల్లా మనసులో కలుక్కుమంటుంది. ఆ అమ్మాయి ఎంత చెడ్డ అయినా ,అనే  హక్కు వారికి లేదని అరచి చెప్పినా అర్ధం చేసికోలేని డర్టీ సమాజం కూడా మన చుట్టూనే ఉంది. 

ఇక కధ విషయానికొస్తే ఎంతమంది కూర్చుని రాసారో కానీ ఎక్కడా పొంతనే లేని కధ. ఒక రికార్డ్ డాన్సర్ జీవితం కన్న ఒక వేశ్య జీవితం కన్న అసహ్యంగా చిత్రీకరించడం బాధ కలిగించింది.

కాస్త ఖరీదైన రికార్డ్ డాన్సర్లు నేటి కధానాయికలు, అప్పటి  గ్లామర్తో కూడిన వగలమారి పడతి పాత్రలు ... కొంచెం బాధ కలిగినా అది వారి పరిస్తితులపైనే కాని, చిత్రీకరణ పై కాదేమో.
 
 ఆ అమ్మాయి పాత్ర పైన సానుభూతి కాని సాహాను భూతి కాని లేకుండా చిత్రించారు.

ఏ సహానుభూతి లేకుండానే అంతమంది వెళ్లి చూస్తున్నారా? కానైతే సహానుభూతి కేవలమే మహిళా పాత్రలచుట్టునే లేదని నా అభిప్రాయం. సినిమా లో ఉన్నా ప్రతి మగ పాత్రకు సహానుభూతి కలిగిన ప్రేక్షకులు ఉండి ఉంటారు.(ఒకటి రెండు మంచి పాత్రలు కూడా ఉన్నాయి )
ఎంతో మంది సినీ నటీమణులు ఇలా మారడానికి కారణాలు చాల ఉన్నాయి ఆర్ధిక పరమైనవి కుటిమ్బాల్ని పోషించుకోవాల్సి రావడం ఇలాంటివెన్నో. ఈ సినిమాలో అలాంటి అవసరమున్నట్టేమీ చూపించలేదు. ఇది చాల నెగెటివ్ ప్రభావాన్ని చూపుతుంది అందరి మీద.ఒక విధంగా అటువంతో నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే భావిస్తున్నాను నేను.
ఏదో ఒక అవసరం చూపితే మనం జాలి పడటానికి వీలుంటుంది అంటారా? అప్పుడు మాత్రం మరోవిధమైన నెగెటివ్ ప్రభావం చూపదా? నటీమణుల జీవితాల్ని అవమాన పరిచినట్టే ఒకవేళ వారు అవమానం గా భావించే పరిస్థితి ఉంటె.  కాస్త పెద్ద నటి పేరు తో ఈ సినిమా తీస్తే నిజం గానే అవమానం గా ఫీలయ్యాము అని నానా యాగీ చేసుండే వారు కూడా. అదయినా వారి మార్కెట్ కాపాడుకోడానికే అవుతుంది. ఈ సినిమా ఎవరి జీవితాన్ని అయినా అవమానపరిచినట్లనిపిస్తే   జగద్దాత్రి గారు , మీరే  వ్యాసం మొదటిలో కొంతమంది పెద్ద పెద్ద నటీమణుల విషయం లో కూడా ఇది నిజమే అని అభిప్రాయం చెప్పడం కూడా  ఆ కోవలోనే వస్తుందేమో అని సందేహం కలుగుతోన్నది.  

వాస్తవ జీవితం ఐనప్పుడు దాన్ని డర్టీ అనాల్సిన అవసరమేరమే ముంది. ఒక స్త్రీ జీవితంలో పడిన బాధలు డర్టీ నా ? లేక ఆ స్త్రీ బతుకు డర్టీ నా? ఏంటి దర్శకుల ఉద్దేశం. ఇది ఒక ఆడదాన్ని అత్మభిమానాన్ని దెబ్బ తీసే విధంగా ఉందనడంలో సందేహమే లేదు.

 డర్టీ అన్నది  ప్రజల అభిప్రాయం గా కూడా అనుకోవచ్చని  ఈ వ్యాసం మొదటిలో వ్రాసుకొన్నాను. ఆడదాని ఆత్మాభిమానం దాకా ఎందుకు. చిత్రంలో ప్రతి ఒక్కరు కధలోని పాత్రధారులే.  మహా నగరాల్లో కాక, మిగిలిన చోట్ల స్త్రీలకూ ఈ సినిమా చూసే అవకాశమే కలగని సందర్భం లో అక్కడి మహిళల ఆత్మాభిమానం కూడా  దెబ్బతింది మరి .  ఒక మహిళా నిర్మించిన, ఇంకొక మహిళా నటించిన సినిమా మేమెందుకు చూడకూడదు అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆత్మాభిమానం మనం చూసే కోణం ని బట్టి ఉంటుంది. నిజానికి మగవారికి ఆత్మాభిమానాన్ని సవాల్ చేస్తాయి సినిమాలో ని చాలా పాత్రలు. ఆ విధం గా దర్శకుడు అభినందనీయుడా మరి

అసలు సినిమా అన్నది ఒక పరిశ్రమ అని మనం చెప్పుకోవడానికే జుగుప్స కలుగుతోంది ఎక్కడో ఒక పది శాతం తప్ప సినిమాలన్నీ ఎక్కడ ఏమి చుపిస్తున్నాయో అసలు ఆలోచిస్తున్నామా? పరిశ్రమ అంటే ఏదైనా సరే ఒక మంచిని ఉత్పత్తి చేసేదిఅలాంటి మంచి ఏదైనా మనం సినిమా పరిశ్రమ నుండి ఆశించా గాలుగుతున్నమా. ప్రతి స్థాయి లోను రాజకీయాలు కక్షలూ ఫాక్షన్లు హింసలు వీటన్నిటితో బాటు ఒక స్త్రీ ఆమె హీరోయిన్ అయినా సరే ఓకే గొప్ప వారి అమ్మాయి అయినా అత్యంత పొదుపుగా బట్టలు వేసుకోవడం లాంటి వికృత వేషాలు చూపించడం. లేదా ఆ పిల్లాడు ఆమె ప్రేమించాక పోతే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇవన్నీ చూసి భగ్న ప్రేమలతో (అనే భ్రమలతో) ఆసిడ్ దాడులు చేస్తున్న యువతకి ఏమని చెప్పగలము. ఎలా వారించగాలము అనిపిస్తుంది.

పది శాతం అని చాల ఎక్కువ చెప్పారేమో నంది. అంత కూడా కనిపించడం లేదు.  మార్పు కోసం ఆరాటం సమాజం నుండి రావాలి, తమిళ సినీపరిశ్రమ ఇంకా పరిశ్రమ గానే మనగలగడానికి అక్కడి ప్రజలే కారణం కాదా. హీరోయిన్ పైన ఆధారపడి బ్రతుకుతున్న సినీపరిశ్రమ ని, ప్రేక్షకులని కలిపి వెలివెయ్యాలి.  

కేవలం ధనార్జన తప్ప మానవ జీవన మర్యాదలు కూడా పాటించకుండా ఒక సినిమా తీయడం దానికి ఎగేసుకుంటూ కుర్రాళ్ళందరూ వెళ్లి చూడటంఅందుకు కొందరు విమర్శకులు చాల వాస్తవిక మైన ది అంటూ మెప్పులు కురిపించడం ఇదంతా ఒక ఫాబ్రికేటేడ్ గా కావాలని అల్లిన వల లా అనిపించడం లేదా ప్రేక్షకులకు. వాస్తవికంగా అయితే ఒక జీవితాన్ని యధాతధంగా తీసి చూపండి మీ క్రూరపు మసాలాలన్నీ ఎందుకు కూరుతారు?,

జీవన మర్యాదలు వ్యాపారాల్లో (అది ఏ వ్యాపారం కానివ్వండి) నేతి బీరకాయ చందమ యినాయి. కుర్రాళ్ళు మాత్రమె చూడడం లేదు. సినిమా బాగుందని విద్యాధికుల  మన్నన కూడా పొందిన  సినిమా ఇటీవలి కాలం లో 'డర్టీ పిక్చర్' అయినందుకు కాస్తంత సంతోషమే. ఎందుకంటే మిగిలినవాటి కన్నా మెరుగ్గానే అనిపిస్తున్నది మరి.ఇకముందు వచ్చే సినిమాలలో గ్లామర్ పై ఆధారపడే కధానాయిక పాత్ర, విద్యాబాలన్ తో పోల్చబడి ,వెల వెల బోతాయని నా నమ్మిక. కాని ఎవరో వ్రాసిన ''రాదే చెలి నమ్మరాదే చెలి- మగవారినిలా నమ్మరాదే చెలీ'' పాటలా, ఈ సినిమాలు మగప్రేక్షకులు ఇంతే అని సరిపుచ్చుకోవలసి వస్తుందేమో.









8, డిసెంబర్ 2011, గురువారం

మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -1

          ఆ౦టీ ఫోన్ చేసారు.  పాపను దత్తత తీసికొన్నాము చూద్దువు  రా వీలయినప్పుడు అని.  హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పాపాయిని దత్తత కాకుండా తనకే పుట్టినట్లు గా డాక్యుమెంట్ వర్క్  చేయించి  తీసికోన్నారు.  తెలిసిన రె౦డు మూడు హాస్పిటల్స్ లో చెప్పి ఉంచారట ఆడపిల్ల కావాలని , అదృష్టం ఫలి౦చి ఒక  మంచిరోజున బుజ్జి పాపాయి వాళ్ళ జీవితాలలోకి వచ్చేసింది. పాప అసలు పేరెంట్స్ ఎవరో వీళ్ళకి తెలీదు , వీళ్ళు కూడా వాళ్లకి తెలిదు.

ఎందుకు పిల్లలని రహస్యం గా దత్తత  తీసికోవాలనుకొంటున్నారు. ఆ తల్లి సరే రహస్యం గా ఉంచాలనుకొంటే వీళ్ళకీ తప్పదనుకోవచ్చు. కాని తమకే పుట్టినట్లు రికార్డులు అవసరం అని ముందే చెప్పి ఉంచడం !!!!!  నాకు తెలిసిన కారణాలు, మొదటిది పసి పిల్లలపై ఉన్న ఆసక్తి ప్రేమ, అదే సమయం లో పసి బిడ్డ అయితే తాము వేరే అన్న భావం బిడ్డకు తెలియకుండా ఉంటుందని. ఆస్తి కి వారసులు కావాలన్న తపన. వృద్దాప్యం లో తమను కనిపెట్టుకొని ఉండేవారు కావాలన్న ఆశ!

బిడ్డని తీసికొని రాగానే అందరికీ అన్ని వివరాలు(నిజాలు) చెపుతారు. అప్పుడు  ఆ బిడ్డ  కి వినిపిస్తుందా , అర్ధం  అవుతుందా  అన్న ధీమా ఏమో . కాని ఆ బిడ్డ పెద్దయ్యాక అనిజాలు ఎవరు ఎక్కడా మాట్లాడకూడదు. కాని ప్రస్తుత  ప్రపంచం  లో ఇది సాధ్యమా. చుట్టూ ఉన్న బోలెడు పసిపిల్లల్ని వదిలేసి ఎవరో తెలియని పసికందుని తెచ్చుకొని, అప్పటికే ఆ బిడ్డకి శత్రువుల్ని తయారు చేస్తారు.  ఎవరింట్లో వాళ్ళు ఇదీ అని మాట్లాడుకోకుండా   ఉంటారా.  బిడ్డకి నిజం తెలిస్తే బాధ పడతాడు /పడుతుంది అని మాత్రమె నిజం దాచారనుకోవడం పూర్తీ గా నిజం కుడా కాదు.

Part 2-  మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2

13, నవంబర్ 2011, ఆదివారం

'మొగుడు' సినిమా ఎ౦దుకు ఆకట్టుకోలేక పోయినది?

మొదటిభాగం ఇక్కడ చూడగలరు .  రె౦డవ భాగం లో ఎ౦టర్టైన్మె౦ట్ ఉండదు, కారణాలనేకం.

౧. సాధారణం గా కృష్ణవంశీ తన సినిమాల్లో ప్రత్యేకంగా కామెడి ట్రాక్ పెట్టడు. హిరో, హిరోయిన్ మిగిలిన కారెక్టర్లు వారి వారి స్థాయి లో హాస్యాన్ని కూడా పండించాలి.

౨. రెండవ భాగం లో హాస్యానికి చోటు లేదనే చెప్పాలి. అమ్మాయి 'పెళ్లి లో తాళి విసిరి కొట్టాక' కామెడీ సీన్లు పెడితే దర్శకుడి మొకాన చెప్పులేస్తారు జనం :)  అప్పటికీ హిరోయిన్ జెలసి, ఉక్రోషం లో కాస్త హ్యుమర్ పెట్టాడనుకో౦డి. బీచి పాట కుడా బాగుందట మరి. 

దర్శకుడు సమస్యను ప్రభావ వంతం గానే చెప్పాడు ఇ౦టర్వెల్ బాంగ్ వరకు. ఒక  వైపు ఈ సంప్రదాయం ఉన్నది (ట)  కాబట్టి అర్ధం లేని లాజిక్ అనుకోడానికి లేదు.  అబ్బాయి తండ్రి మూర్ఖపు పట్టు పట్టగానే  రోజా కుడా  చక్కని సమాధానం చెపుతుంది .

మన పెళ్లి సంప్రదాయాలలో ఇరువైపులా వాదన జరిగితే అమ్మాయి వైపు వారు సర్దుకుపోవడం తప్పని సరి అన్న దురాచారం కూడా ఉంది. ;-)  అలా  మగ పెళ్లి వారు చేసిన చిన్న పొరబాటు అ౦దరి మనోభావాలు  గాయ పడి పోయే స్థితి వచ్చేస్తుంది. అమ్మాయి అతన్ని  నువ్వు నాకొద్దు అనేంత. 

ఇప్పటి సమాజం లో మేలు కోరి ము౦దుకు వచ్చే  మధ్యవర్తి భూతద్దం పెట్టినా దొరకడు(దు). మనకెందుకు వచ్చిన గొడవ అనుకునేవారు, మన మాట వింటారా అని ఆగిపోయే వారు,  మనమే రైటు వాళ్ళని అది చేద్దాం ఇది చేద్దాం అనే వారును (రెండు వైపులా ). అలాగే సినిమా లో ఈ మూడవరకం మధ్యవర్తి ఒకాయన వెళ్లి మాట్లాడగానే , అబ్బాయి తండ్రి కూడా భేషజాలకు పోయి తన డిమా౦డ్ ని చెప్పి పంపుతాడు. ఆ మధ్యవర్తి కాస్తా  (తెలిసో ,తెలియకో ) పచ్చగడ్డి వేసేస్తాడు.  ఇంకేముంది మంత్రి గారు గృహహింస కేసు లా౦టిదె వేసేస్తారు.

సాధారణం గా  గృహహింస నేరం పై కేసు పెట్టడం అమ్మాయి వాల్లకేం సరదా ఉండదు. వాళ్ళ పెయిన్ ఏమిటో కూడా తెలుస్తుంది.  సరిగా చూస్తే. ఒక వివాహం చెడిపోతే నష్టం కేసు ఓడిపోయినా వారికే కాదు. ఇద్దరిదీను , కాని పురుషాహంకార సమాజం లో దీని అవసరం తప్పని సరి. గోపి చంద్ కూడా ఆ సమాజం లో ని మనిషే , తప్పు సరి చేసికోవాల్సిన సమయం లో ఇంకో పొరపాటు చెయ్యడం వలన వచ్చిన పర్యవసానం, విడాకుల కాగితాలపై సంతకం పెట్టేస్తాడు .ఆ తరువాత తన తప్పు ను సరిదిద్దుకునే  అవకాసం వస్తుంది,  అప్పటికీ పెద్దవారి పౌరుషాలు తగ్గవు. అలా అందరిని ఒప్పించి ఒక మంచి ముగింపు ఇవ్వడమే ఈ చిత్ర కధా కమామీషునూ. 

రెండవ భాగం లో  ప్రేక్షకుల ముందు పంచాయితీ పెట్టినట్లుగా ఉంటుంది. డబ్బులు పెట్టి మరీ పక్కవాడి సంసారం గొడవ చూడాలంటే విసుగెయ్యదూ. ఫ్రీ గా అయితే పర్లేదు కాని.  ఈ సినిమాకి  టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే సమాధానం దొరకదు. ఎవరు తమని , తమ కుటుంబాలని అక్కడ ఐడెంటి ఫై చేసికోలేరు,ఇష్టపడరు  కాబట్టి.   కాకపొతే కొన్ని సంవత్సరాల తరువాత కృష్ణవంశీ వెనక్కి తిరిగి చూసుకొంటే ఈ సినిమా ఉంటుంది, ఒక తరాన్ని ప్రతిబింబిం చేందుకు. చూడటం చూడకపోవడం అన్నది ఎవరిష్టం వారిది.



9, నవంబర్ 2011, బుధవారం

కార్తీక పౌర్ణమి - వనభోజనాలు


 బ్లాగర్లు కార్తీక పౌర్ణమి సందర్భంగా అంతర్జాల వనభోజనాలు సందడి లో నా వంతుగా స్కూల్ డేస్ లో నా కార్తీక పౌర్ణమి జ్ఞాపకాలు ఇక్కడ పంచుకొన్నాను .



 "కార్తీక పౌర్ణమి   ఉపవాసాలు ఉండే వాళ్ళు పేర్లు వ్రాసుకొ౦టున్నారని తెలిసి నేను కూడా  చెప్పేసాను. కొ౦తమ౦ది ఉదయాన్నే టిఫిన్ ఏ౦టొ కనుక్కుని చెప్పేస్తాం అనేసారు. " అంటే టిఫిన్ ఇడ్లి, ఉప్మా అయితే కొ౦దరు టిఫిన్లు అయ్యే వరకు ఉపవాసం అన్నమాట. ఇంకొందరు టిఫిన్ వెజ్ బిరియాని అయితే టిఫిన్ మాత్రం తినేసి ఉపవాసం ఉ౦డొచ్చు లేదా మానెయ్యొచ్చు అన్న మీమాంస.

మా స్కూల్ హాస్టల్ లో ఇడ్లి, ఉప్మా టిఫిన్ గురి౦చి కాస్త చెప్పాలి. మ౦చిసినిమా చూడ్డానికి వెళ్తే వందా రెండొందలు అని బ్లాకులో అమ్మేవారిని చూస్తాము కదా. అలాగా ఉంటాయి మా బ్రేక్ఫాస్ట్ క్యూలు ఈ రెండు ఐటమ్స్ చేసినపుడు . కొంతమంది అమ్మాయిలు ఎక్ష్ట్రా ఇడ్లి(లు) కావాలా అని మనికి మాత్రమె వినిపించేలా దాదాపు ముందుకు వెనక్కి నాలుగైదు రవుండ్లు వేస్తారు. ఎందుకంటే ఇడ్లీలు పారేస్తే కా౦పస్ చుట్టూ పరిగేట్టిస్తారు మరి :)  మనం సాంబారు ఇడ్లి రోజు ఒకటి తీసికొందాములే అనుకున్నామా( ఆ రోజు ప్రిన్సిపాల్ గారు వస్తారని ,  ఎర్రమామ్మ సూపర్ గా సాంబారు చేస్తుంది  )  , ఇక అంతే మిగిలిన రోజులు కూడా మన్ని డిమా౦డ్ చేస్తారు పాపం ...కి ...కి.  ఒకసారి గ్రవు౦డ్ లో బిళ్ళ గన్నేరు మొక్కలు నాటడానికి ఇసకలో తవ్వుతు౦తే ఇడ్లి లు బయట పడ్డాయి. అప్పటిను౦డి డైనింగ్ హాలు బయట తినడానికి కుదిరేది కాదు. అ౦త కతుందన్న మాట.

కొత్త ప్రిన్సిపాల్ గారు వచ్చాకా పండుగలే కాక, ఇలా అన్ని ముఖ్యమైన సంప్రదాయాలను ప్రోత్సహించేవారు.  సరే ఉపవాసం ఉండేవాళ్ళు ఆవాల క్లాసులకి వెల్లఖ్ఖర లేదు కాబట్టి నేను ఖుషి  .(కొ౦చెమ్ భయం కూడా మనం చెయ్యకపోతే ఏమవ్వుద్దో అని :) ).  ముందురోజే కొబ్బరి కాయలు తెప్పించుకుంటాము  ఎలాగు.అ౦దరూ  ప్రేయర్ కి వెళ్ళగానే మేము మాత్రం నెమ్మదిగా తయారయ్యి ఎవరి 'ట్రంకు పెట్టి' లో ఉన్న దేవుడికి వాళ్ళం కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరి నీళ్ళు తాగేస్తాము. కు౦చెమ్ కు౦చెం  కొబ్బరి ముక్కల ప్రసాదం ఎక్స్చేంజ్ చేసికొని కబుర్లలో పడిపోయే వాళ్లము. ఈలోగా రాజియ్య వచ్చి పాపలూ మీకేమి కావాలో వ్రాసి ఇవ్వ౦డి అని చెపుతాడు . ఉదయం కూరగాయలు తెచ్చాక ఆవాల మల్లి ఒకసారి ప్రత్యేకం గా చెరుకుపల్లి పంపిస్తారు తనని మాకోసం పువ్వులు, ప్రూట్స్ తేవడానికి.  సరే ము౦దు ఒక యాపిల్, అందరితో పాటు  అరటిపళ్ళు  చాలు అని  చెప్పేసి వస్తామా(డబ్బులు మనియ్యే మరి), మిగిలిన వాళ్ళెం వ్రాసారు అని చూసి ..హ్మ్మ్ జామ కాయలు ఒక రెండు తినాలనిపిస్తుంది . బత్తాయిలు కుడా (అసలు విష్యం బిస్కట్స్ చాకేల్ట్లు తప్ప ఇలా౦టివి మేము అడిగి తెప్పి౦చుకోవడము మామూలు రోజుల్లో కుదరదన్న మాట. ) అలా అన్ని చెప్పేసి  ఆ అంకం  పూర్తయ్యే సరికి టిఫిన్ సర్దుబాట్లు వాళ్ళు తేలిపోతారు. 

 
                                           

కా౦పస్ లో అటు ఇటు తిరిగితే పి యి టి ఊరుకోదు. కాబట్టి మళ్ళీ  డార్మిటరీ   లో చేరి కబుర్ల తో పాటు సెమి ఉపవాసాల వాళ్ళ పై జోకులు, ఒక అర కొబ్బరి చిప్ప కలిపి నమిలేస్తాము. ఇక కాస్త తీరికగా జడలు అల౦కరి౦చుకోదమ్, దాడి ఆట, ఇక పెన్ను పేపర్ పట్టుకొని ఏది కుదిరితే అవి. అంతలో  ప్రూట్స్ , పువ్వులు వచ్చేస్తాయి. మని పేరు వఛ్చినదాక ,అన్ని దొరికాయో లేదో కంగారు , కొన్నే ఉంటే మన దాకా రాకు౦డా కొన్ని అయిపోతాయి..హమ్మయ్య ఉన్నవరకి తిసేసికొని ఒక సంతకం పెడితే డబ్బులు మన 'హవుస్ మని' ను౦డి తీస్కుంటారు. సరే ఇక ము౦దు యాపిలూ , తర్వాతా జాన్కాయి ఇలా టై౦పాస్ చేస్తూ ప్రసాదాల గురించి చర్చ వచ్చేస్తుంది. క్రిస్టియన్ అమ్మాయిలూ ఒకరిద్దరు మమ్మల్ని ఏ౦ చేస్తున్నామా  అని చూడడానికి వస్తారు కదా (మిగిలిన వాళ్ళు కూడాను ) . ఇంక కాస్త కొబ్బరి ముక్కల ప్రసాదం వాళ్లకి ప౦చడమ్, మేము తినము అన్న క్రిస్టియన్ అమ్మాయిలతో గొడవ  మొదలు ప్రసాదం వద్దన్నారని ,మేము అయితే వద్దు అనం ..మీ ప్రసాదం మే౦ తి౦టే మీరెందుకు కొబ్బరి ముక్కలు తినరు అని. కాస్సేపు పోట్లాడి నవ్వేస్కు౦టాము . అసలు విష్యం మాకు ఉన్న తి౦డి పిచ్చి వాళ్లకి లేక పోవడము అని అప్పటికి తెలీదు గా.... తరవాతా కాసేపు స్కూల్ వెనక వైపు ఉన్న ఫారెస్టు కి వెళ్లి రావచ్చు.

                                            

నాల్గు, అయిదయ్యేసరికి గుడికి వెళ్ళాలి  వచ్చెయ్యమని ప్రిన్సిపాల్ గారి నుండి కబురు. చెరుకు పల్లి దాకా నడిచేవేల్లేది అనుకు౦టా. గు౦పుకు ము౦దు మేడంస్ ఉండి జాగ్రత్తగా తీసికేల్లెవారు. అక్కడ ఒక గ౦ట ఉ౦డి నెమ్మదిగా నడుచుకొని వచ్చి ఇక నిద్రపోవడమే అనుకొ౦టే భోజనానికి తీసికేల్లెవారు . ఆస్చర్యం గా మాకోసం ప్రత్యేకంగ చేయి౦చిన  రుచికరమైన పులిహోర, పూర్ణాలు, వ౦కాయ కుర, పప్పుచారు, కొబ్బరి పచ్చడి, పెరుగన్నం ఘుమ ఘుమలాడి పోయేవి.సుష్టుగా తినేసి ఉపవాసం ముగి౦చి వచ్చి నిద్రపోయే వారం. అ౦తేనా మళ్ళి ఉదయాన్నే ఎక్సర్సైజులు కి వెళ్లక్కరలేదు. తల౦టుకోని రడీ అయ్యి రమ్మని చెప్పేవారు. మళ్ళి ఉదయాన్నే ఉపవాసం ఉన్న  అ౦దరికీ ప్రత్యేకమ గా ఉదయాన్నే కిచిడి, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, పొ౦గలి తో మనసు మురిసేలా ఇ౦కో స్సారి చలి మ౦చు వేళలో :)  అలా ఉపవాసం ముగిసి పోయేది . అక్కడ వున్నా మూడేళ్ళు కాక మల్లి కార్తీక మాసం పాటి౦చి౦దే లేదు :) 

ఇక వనభోజనాలేమో క్లాసుల చుట్టూ బోలెడన్ని ఉసిరి చెట్లు ఉన్నా, ఒక ఆదివారం పుట ఫారెస్టు లోకి వెళ్ళిపోయే వాళ్ళమీ. ము౦దుగానే పని వాళ్ళతో అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు  చుట్టూ శుభ్రం చేయి౦చేవారు . 'ప్రిన్సి' మ౦చి భోజన ప్రియులు ఆయనే ఏర్పాట్లు చేయి౦చేవారు దగ్గరు౦డి. మేడంస్ , సార్లు తో పాటు మెమ౦దరమ్ మూదువమ్దలమ౦ది అమ్మాయిలం ఆటలు, పాటలు,  పద్యాలతో సరదాగా గడిచేది.  ప్రతి సంవత్సరం ఈ నెలలో వాళ్ళని గుర్తు చెసికోకు౦డా ఉ౦డను.కాకపొతే ఈ సారి బోనస్ గా కొంత మంది ఆచూకి తెల్సింది . చక్కగా ఫోన్ చేసి కబుర్లాడుకోవచ్చు . 

అ౦దరికి కార్తీక పౌర్ణమి సుభాకా౦క్శలు. జ్యోతి గారు బ్లాగ్వానభోజనాలకు పిలుపు నిచ్చారు. అ౦దరు ఉపవాసాలు౦టారు కదా మామూలు వ౦టలు చూసి ఆన౦ది౦చినా ఇలా మాలా కొబ్బరి చెక్కలు, పళ్ళు, ఇ౦కా స్వీట్స్ బాగా తినాలి మీరు కుడా :)








కృష్ణ ప్రియ గారు ఎలాగు నోరు ఊరిమ్చేసారు కదాని ఉసిరికాయిలు  కుడా పెట్టాను, చక్కగా ఆరగించి సాయంత్రం మాత్రం పులిహోర పాయసం, పెరుగన్నం తో  చక్కగా తిని మీ మీ ఉపవాసాలు ముగించాలని కొరుకు౦టూ . మల్లి ఇన్నాళ్ళకి కార్తీక పౌర్ణమి   టపాలు వ్రాసే  వాళ్ళ పేర్లు ఇస్తున్నారని  తెలిసి నేను కూడా :) జ్యోతిగారికి ధన్యవాదములు.