6, జూన్ 2012, బుధవారం

ఒక అబ్బాయి - ఒక అమ్మాయి - వేధింపుల పర్వం



ఆ అబ్బాయి ఎందుకు వేదిస్తున్నాడు రేణుక ను??? ఇదే అందరిని వేధిస్తున్న ప్రశ్న. మొదట సీనియర్  గా యెంతో అభిమానం గా సాయం చేసాడు, ఇప్పుడు బెదిరిస్తున్నాడు. అందరు చెప్పేది ఒకటే  మాములు గా చాలామంచి వాడు  స్టేట్ రాంకర్ కూడా. ఇంకెవరితోనూ అమర్యాదగా మాట్లాడిందే లేదు. రేణుక గురించి చెప్పాలంటే చదువుల సరస్వతి. అందరితో స్నేహం గా ఉండే తత్త్వం. సరదాకి కూడా ఎవరినీ నొప్పించదు తను. అతని తో సమస్యను వీలయినంత సామరస్యం గానే పరిష్కరించుకోవాలని ఆశ పడింది.

ప్రెషర్స్ పార్టి లో ఆ అమ్మాయి నాట్య ప్రదర్శన కు బోల్డన్ని ఫోటో లు తీసాడు. నెగెటివ్స్ తో సహా అడక్కుండానే తెచ్చి అమ్మాయికి ఇచ్చేసాడు. ఒక రోజు ఉన్నట్టుండి నెగెటివ్స్ కావాలని అడిగాడు. రేణుక ఇవ్వడం ఇష్టం లేకో , నిజం గానే కనిపించకో ఎక్కడో పెట్టేసాను లేవు అని సమాధానం చెపుతూ వచ్చింది. ఉహూ అతనికా సమాధానం నచ్చలేదు. అహం దెబ్బతిందో ఏమో ఆ అమ్మాయిని మాత్రమె బెదిరిస్తూ పోయాడు.పాపం అతన్ని వదిలించుకోవడానికి అని నిజం గానే వెతికింది ఫోటోలు , నెగెటివ్స్ కోసం  కాని దొరకలేదు. అక్కడే సమస్య మరింత జటిలం అయ్యింది.

కాలేజ్ మానేజ్మెంట్ కి పలు కంప్లైంట్స్ వెళ్ళాయి , అతన్ని హాస్టల్ నుండి కొన్నాళ్ళు తొలగించారు. ఆ అమ్మాయికి రక్షణ కావాలి అని అందరికి అర్ధం అయ్యింది. కాని సంవత్సరం పొడుగుతా రక్షణ ఇవ్వలేరు కదా. ఇంకా గట్టిగా అడిగితె అమ్మాయిని హాస్టల్ నుండి పంపేసినా దిక్కులేదు. మధ్యలో కొంచెం మారాడు అనుకొంటున్నారు. మిగిలిన అమ్మాయిలు కూడా అప్పుడప్పుడు రిక్వెస్ట్ చేసేవారు తనని ఏమి చెయ్యొద్దు అని, విని నవ్వేసి వెళ్ళిపోయేవాడు.


అసలు వాళ్ళిద్దరి పరిచయమే పెద్దవారి ద్వార జరిగింది. అమ్మాయి కాలేజ్ లో జాయిన్ అయ్యేసమయం లో , తమ ప్రాంతం అనో ఒకే ఊరు అనో తెలిసి సీనియర్ అయిన ఆ  అబ్బాయి ని కలిసి , అమ్మాయి తల్లి  'చెల్లె ని' బాగా చూసుకో నాయనా అని బోల్డంత బాధ్యత అబ్బాయికి అప్పగించేరన్న మాట. కాని ఇపుడు అమ్మాయిని బాధ పెడుతున్నాడు అని తెలిసి అబ్బాయి తల్లిదండ్రులకు అమ్మాయి తరపువారు  సమస్య చెప్పారు. మేము చెప్పగలిగినది చెప్పాం అని, ఇంకా తాము కొడుకు కి పలుమార్లు చెప్పి విసిగిపోయామని  వదిలేశామని వారు చేతులెత్తేశారు !!!

 ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే వేళ ఒకరోజు తాపిగా పరీక్షా వ్రాసి , అమ్మాయి మెస్ నుండి బయటికి వచ్చే టైం లో గేటు దగ్గర కాపలా కాసి వెంట పడ్డాడు. పదునైన కత్తి(బ్లేడు ?)  తో మొహం నిండా, ఇంకా చేతి మణి కట్టు దగ్గరా కసితీరా గాయ పరిచాడు. ఆ  అమ్మాయి అందం గా కనిపించ కూడదని మొహం పై పాశవికం గా దాడిచేసాడు. చెయ్యి అడ్డుపెట్టడం తో మణికట్టు దగ్గర నరం తెగి రక్తం ధార కట్టింది . కళ్ళు మూసి తెరిచేంత లో పరారు అయ్యాడు.  గబా గబా తనని హాస్పిటల్ కి తీసికొనే వెళ్ళడమే కాక ప్రిన్సిపాల్ కి మరియు పేరెంట్స్ కి కూడా సంఘటన గురించి తెలియపరచడం జరిగాయి. విద్యార్ధినీ విద్యార్దులు అందరు రేణుకకు మద్దతు గా నిలిచారు. చాలా రక్తం పోయింది కాని, గండం గట్టెక్కినట్లే. వాళ్ళ ఒక్క బాచ్ కి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి.

 పోలీసులు అతని కోసం వెతకడం మొదలుపెట్టారు. నాలుగు రోజులకి ఎమ్మెల్యేని వెంట బెట్టుకొని వచ్చి పోలీసుల ముందు తనే లొంగిపోయాడు. ఒక ఫోటో ఆమ్మయితో కలిసి ఉన్నది చూపి , నాతొ ఆ అమ్మాయి తిరిగినది అని అభియోగం మోపాడు. అప్పటి దాకా అమ్మాయికి అండగా నిలిచినా తండ్రి , ఆ పిల్లని తిట్టిపోయ్యడం మొదలుపెట్టారు. ఆయనకీ తెలుసు అది అంత అబద్దం అని , కాని ఫోటో దిగి చెప్పలేదు అని బాగా కోపం తెచ్చు కొన్నారు .


నిజానికి ఒక సెలవురోజు అమ్మాయి తన మిత్ర బృందం తో ఫోటో లు తీసికొంటూ ఉండగా, అటుగా వెళ్తున్న ఈ అబ్బాయి నాతొ కూడా ఫోటో అని మొహమాట పెట్టి  తన ప్రక్క నిలుచున్నాడు . అందరు అన్నయ్య అని పిలుస్తారు కదా, అందునా సీనియర్ కాబట్టి వద్దు అని ధైర్యము చెయ్యలేదు, అలాగని అనుమానమూ లేదు. అదన్నమాట ఫోటో వెనుక కధ. అసలా సంగతే మర్చిపోయారు. కాని తండ్రి అర్ధం చేసుకొంటే కదా. ఆయనకీ కూతురు అమాయకత్వం కన్నా, కేసు నీరుకారిపోతున్నదన్న బాదే ఎక్కువయ్యిందా, ఏం చేస్తాం.

బెయిల్ పై బయటికి వచ్చి సాక్షులు  గా ఉన్న ఆ అమ్మాయి సహ విద్యర్దినులను అందరినీ  కత్తి తో బెదిరించి  వెళ్ళాడు .నిజానికి ప్రత్యక్ష సాక్షి గా ఉన్న  రేణుక కు రూం మేటు ఒక అమ్మాయి , ముందే తను మాత్రం సాక్ష్యం చెప్పేది లేదు అని నిర్ణయించుకొంది, కెరీర్ కి ట్రబుల్ రావోచ్చును అని.  ప్రిన్సిపాల్ కూడా కొన్ని అనివార్య కారణాలు, స్వప్రయోజనాలు కూడా దృష్టి లో ఉంచుకొని విచారణ కి దూరం గా ఉన్నారు. ఇంకా మిగిలిన వారిలో వేరే బ్రాంచ్ కి చెందిన ఒకమ్మాయి ( పేరు స్వాతి ) మాత్రం మనస్సాక్షి ముఖ్యం అని సాయం చెయ్యడానికి ముందుకు వచ్చినా తన స్నేహితులు  ఒట్టు పెట్టిన్చుకొన్నారు, అబ్బాయి చంపేస్తాడు అన్న భయం తో . సాక్ష్యం చెప్పనివ్వని మిత్రులపై కూడా అలిగి తానూ మౌనాన్ని ఆశ్రయించింది.



అప్పటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆ అబ్బాయి, ఆ ఫోటో ని ఆధారం గా చూపడం మోసం కాదా అని. సమాధానం ఇంకో అమ్మాయి ఇందు ద్వార వెలుగులోకి వచ్చింది. తనతో ఉన్నట్టుండి ఒకసారి ఆ అబ్బాయి ఒక మాట చెప్పాడు , పెద్ద వాళ్ళు తను చెల్లి వరుస అవుతుంది అని మొదట చెప్పారు కాని ఇంకో వరుసలో మరదలు అవుతుందని అతనికి తెలిసింది అని . ఇందు ఆ విషయం అప్పుడే వదిలేసింది పొడిగించడం సభ్యత కాదు కాబట్టి. హ్మ్ అలా  అతను రేణుకను ప్రేమించాడు, వ్యక్త పరిచడానికి వీలు లేదు అన్నయ్య గా పరిచయం అయ్యాడు కాబట్టి. అలాగని తనలో తాను దాచుకోలేక, మణిరత్నం సినిమా లో విలన్ గా మారిపోయాడు .



తర్వాతి సంవత్సరం మొదలయ్యింది. కేసు చాలా మలుపులు తీసికొంది. అబ్బాయి తల్లి దండ్రులకి కడుపు తీపి గుర్తుకొచ్చింది, అమ్మాయి కాళ్ళా వేళ్ళ పడ్డారు  కేసు వెనక్కి తీసికొమ్మని, ఇద్దరికీ పెళ్లి ఒక పరిష్కారం గా కూడా సూచించారు. ప్రాణహాని గురించి  చెప్పి కాదంటే వ్రాయడానికి వీలు కానన్ని తిట్లు శాపనార్ధాలు పెట్టారు. సాక్ష్యము ఇవ్వాలని ఉన్న స్వాతి  కి మిత్ర బృందం చివరికి తామంతా రక్షణ గా ఉంటాము ఏదయితే అది అవుతుంది అని ఆమెని సాక్ష్యం ఇవ్వడానికి అనుమతించారు  . ప్రత్యక్ష సాక్షి అయిన అమ్మాయిని మాత్రం ఎవరు బలవంత పెట్టలేదు. ఈ లోగా ఆ అబ్బాయి తన బెదిరింపుల పర్వం లో ప్రిన్సిపాల్ ని కూడా  ఈ కేసు లో ఇన్వాల్వ్ అయితే చంపేస్తా అని  బెదిరించేసరికి  ఆయన అహం బోల్డంత దెబ్బతినేసింది .ఇంకేం ఆయన తను చెప్పాల్సింది కోర్టు లో న్యాయమూర్తి ఎదుట చెప్పేశారు, మిగిలిన సాక్ష్యాలు అన్ని కూడా విన్న జడ్జి అతనికి పదేళ్ళు జైలు శిక్ష విధించాడు.

ఇంకో మూడు సంవత్సరాలు గడిచాయి, ఇన్ని సమస్యలను దాటి రేణుక చదువు అయిపోయింది . ఒక కాలేజి లో లెక్చరర్ గా ఉద్యోగం లో చేరింది. తను నేను ఇపుడు బాగానే ఉన్నాను , అతని భవిష్యత్తు పాడయిపోతున్నది అని కేసు వాపస్ తీసికొని అతని విడుదల అయ్యేలా చూసింది అని తెలిసి చాలా సంతోషం వేసింది. అంత మంచి అమ్మాయి రేణుక.

అబ్బాయి కూడా మంచి వాడే. కాని మన వ్యవస్థ లో ఈ పెద్ద వాళ్ళు అమ్మాయి కి అదే కాలేజి లో చదువుతున్న అబ్బాయి రక్షణ అని వాళ్ళిష్టం వచ్చినట్లు పరిచయం చెయ్యడం, పదే పదే ఇంటికి పిలిచి భోజనం పెట్టి చెల్లె జాగ్రత్త అని చెప్పడం కూడా స్వార్ధం తో కూడిన  సామాజిక పొరపాటు అని నా అభిప్రాయం . అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం  కావాలి అని ఈ పెద్దవాళ్ళకి ఎప్పుడు అర్ధం అవుతుంది.  ఇక రేణుక లాంటి అమ్మాయిలు పెద్దవాళ్ళ పిరికితనం, అభద్రతా భావం తమని, తమ స్నేహాల్ని ప్రభావితం చెయ్యకుండా చూసుకోవాలి.

ఆడపిల్లల పై దాడి జరిగిన చాలా సంఘటనల్లో అబ్బాయిలని మాత్రమె బాధ్యులని చెయ్యకుండా , అమ్మాయిలు వీలయినంత వరకు తమ తమ పరిచయాలను పునః పరిశీలన చేసుకొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎవరి రక్షణ కు వారే మొదటి బాధ్యత వహించాలి.

 ఒక అబ్బాయి  , లేదా అమ్మాయి ని 'సెలెక్టివ్' గా అన్న, చెల్లి ,అక్క  లేదా తమ్ముడు అని వ్యవహరించాల్సిన ఖర్మ తెలుగువాళ్ళకే నేమో . ఇది నవీన కాలపు సామజిక దురాచరమా అని అనుమానం వస్తుంది.



12 కామెంట్‌లు:

  1. "ఆడపిల్లల పై దాడి జరిగిన చాలా సంఘటనల్లో అబ్బాయిలని మాత్రమె బాధ్యులని చెయ్యకుండా , అమ్మాయిలు వీలయినంత వరకు తమ తమ పరిచయాలను పునః పరిశీలన చేసుకొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఎవరి రక్షణ కు వారే మొదటి బాధ్యత వహించాలి.
    ఒక అబ్బాయి , లేదా అమ్మాయి ని 'సెలెక్టివ్' గా అన్న, చెల్లి ,అక్క లేదా తమ్ముడు అని వ్యవహరించాల్సిన ఖర్మ తెలుగువాళ్ళకే నేమో . ఇది నవీన కాలపు సామజిక దురాచరమా అని అనుమానం వస్తుంది. "

    జరిగింది శోచనీయం. మీ విశ్లేషణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా వ్రాశారండీ! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. అప్పటి దాకా అమ్మాయికి అండగా నిలిచినా తండ్రి , ఆ పిల్లని తిట్టిపోయ్యడం మొదలుపెట్టారు. ఇది మాత్రం దారుణం. అమ్మాయి మీద ఆ మాత్రం నమ్మకం లేనప్పుడు పరిచయం చేయడమెందుకు? తల్లిదండ్రులు పిల్లలకి ఎంత స్వేచ్చనిస్తే అంత పద్ధతిగా ఉంటారు. అనుకోని పరిస్థితుల్లో ఏదయినా చెడు మార్గంలోకి వెల్లబోయినా మా ఇంట్లో వాళ్ళకి నా మీద ఉన్న నమ్మకాన్ని కాపాడాలి అన్న ఆలోచనతో అన్నా ఆగుతారు అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ

      తన తండ్రి అలా ప్రవర్తించడానికి కారణం నమ్మకం లేక కాదు. చాలా కఠిన సమయం అది. ఒక ఎమ్మెల్యే అండ ఉన్న వ్యక్తి తో పోరాడగల సామర్ధ్యం కాదు ఆయనది. ఫోటో చూపించి ఆ అబ్బాయి చెప్పిన కట్టు కధని తిప్పి కొట్టడం చేతకాని అశక్తత వల్లనే, కనీసం ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు అని మొదట కోప్పడ్డారు.

      మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదములు

      తొలగించండి
  3. అమ్మాయి కి తన వ్యక్తిత్వమే తనకు సాయం

    కరెక్టుగా చెప్పారు....

    రిప్లయితొలగించండి
  4. katha baagundi,edanna magazine ki pampinchaka poyaaraa

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాత,

    మీరు నా నిజమైన అభిమాని అని ఒప్పుకుంటాను, కాని అంత రిస్క్ అవసరమా.

    టైపో లు ఉన్నాయి ,సరిచేస్తాను.

    స్పందించినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. True. Girls need to rely on themselves. And parents/teachers/elders should inculcate such confidence and wisdom.

    రిప్లయితొలగించండి
  7. Narayanaswamy గారు

    అవునండీ, స్పందించినందుకు నెనర్లు.

    రిప్లయితొలగించండి
  8. మల్లీశ్వరి నీ కథనం బాగుంది, ఇంకా బాగా చెప్పి ఉండవచ్చు any way good to see these type of narrations from ur side.

    రిప్లయితొలగించండి