26, ఆగస్టు 2013, సోమవారం

ఆంధ్రా లో సమైక్య హింస నుండి కాపాడే దేవుడా కే సి ఆర్ ?



న్యూస్ పేపర్స్ సమైక్య ఉదయం తీవ్రత గురించి అంతా ఇంతా కాదని చెప్తోంటే ఏమిటో అనుకొన్నాం గాని , ఒక్కో కధ వింటుంటే నవ్వు వస్తుంది. వీళ్ళకి ఆవేశం వచ్చి బందులు చేస్తుంటే సామాన్యజనం పట్టించుకోవట్లేదని ఉద్యమకారులు తీవ్రంగా పగ బట్టేసారు.  ముందు ఊర్లకి బస్సులు ఆపేశారు. కచ్చితంగా తెలిసి చస్తుంది ఇక అనుకొన్నారు కాని, బస్సులు వచ్చినా రాకపోయినా సగమందికి పెద్ద లెక్క కాదు, ఇక షాపులు మూయించి పడేసారు . నెలకొకసారి కొనుక్కునే జీవులు కాదుగా కాస్త చిరాకు పడ్డారు కాని, అదేన్నాల్లు లే, గవర్మెంట్ ఉద్యోగం కాదుగా కిరాణా కొట్టు . ఏదో బస్సుల్లేవు కాబట్టి పక్కోరికేల్లి కొనుక్కోలేరులే అని నాలుగు రోజులు కొట్టు కట్టేసి కావాల్సిన నాలుగు రకాలు వండుకొని సుష్టుగా తిని రెస్టు తీసుకొన్న దుకాణు దారులు మళ్ళీ విధుల్లోకి అదేనండీ వ్యాపారం లోకి వచ్చేసారు. ఇక ఆటోల వాళ్ళపై పది ఎడుస్తున్నారట బాగు పడి పోతున్నారని , వాళ్ళకీ ఉపాయం తట్టింది రోజుకో కూడలి దగ్గర ఒక్కో గ్రూప్ బంద్  పాటిస్తారు, మిగిలినవాళ్ళు బంద్  పండగ పుణ్యమా అని నాలుగు రాళ్ళు వెనకేసుకునే హడావుడి మామూలే .

రోగాలకి ట్రీట్మెంట్ తీసుకొనే వాళ్లకి ఆటోల ఖర్చులు అదనం కాక, అసలు గమ్యం చేరుతారో లేదో తెలియదు . ఇంకొందరికేమో  బీరువా నిండా చీరలున్నా పాడు బందు షాపింగ్ కి కూడా వెళ్ళలేకపోతున్నాం అని దిగులు జ్వరం పట్టికుంది కాని ప్రచారంలో ఉన్నట్లోల్ అయ్యో అయిదరబాదు  పోతుందే అన్న బెంగ మాత్రం లేదంటే నమ్మండి .

ఇది చాలదన్నట్లు కాస్త పెళ్ళిళ్ళు ఫంక్షన్ల సీజనాయే . అక్కడా ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయట . అంటే

ఇదికాక సచ్చినోళ్ళు ఇంకో రెండ్రోజుల్లో కరెంట్, నీళ్ళు కూడా ఆపెస్తారంటా అని ఫోన్ లో చెప్తుంటే పకాల్న నవ్వొచ్చింది. పాపం ఈ గొడవేమో గాని జనాలు టీవీలకు అతుక్కు పోయారు. మా పిన్ని చెప్తున్నారు, వాడు  డి ల్లీ పొయ్యాడు ఏం చేత్తాడో అని అంటుంటే, వాడా వాడెవడూ అంటే కే సీ ఆర్ అట . మరి ఈ కరెంటూ, నీళ్ళ కష్టాలు తీర్చడానికి ఆంధ్రలో మనిషే లేనట్టు పాపం సగటు సీమాంధ్ర కేసీఆర్ వైపు ఆశగా చూస్తోంది . వార్నీ వీడింత పాపులర్ అయ్యాడా ఆంధ్రలో అని ముక్కున వేలేసికోవాలి.

ఏదేమైనా అన్ని పార్టీల ఆశలూ ఆంధ్ర పైనే ఉండడం ఇప్పుడు ఆంధ్రులకి శాపం అయ్యింది . ఎక్కడ పక్కోడి  మాటలు నమ్మేస్తారో అని పతోక్కడూ ఉద్యమం మొదలెట్టాడు . ఇప్పుడు దీక్ష చేస్తే వచ్చే మైలేజీ  ఎలక్షన్లో పదికోట్లు పంచినా రాదనీ అర్ధమై పోయింది . అందుకే నాలుగు రోజు కడుపు మాడ్చుకొని ఉద్యమ నేత అయిపోవాలని తపన పడుతున్నారు .

ఇంత  చేస్తున్నా ఆంధ్రులకి ముందుకొచ్చి ఇదేంటి అని అడగాలని తోచదో ఏంటో . కరెంటూ నీళ్ళూ రాకుండా చెయ్యడమేంటి వీళ్ళ తిక్క తగలెయ్య, రాష్ట్రం గబ్బు పట్టి పోతది . 

18, ఆగస్టు 2013, ఆదివారం

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు -2

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు మొదటి భాగం ఇక్కడ :


ప్రవీణ చెప్తూ ఉంటె చాలా కోపం వచ్చింది అప్పట్లో . అంకుల్ సరే అంటీ కూడా ఇలా చేయవచ్చునా  . నాకెంత అభిమానమో ఆమె అంటే , ఒక్కసారిగా ఇలా మారిపోయారా అని చాలా కష్టం అనిపించిన్ది.

సరే  ప్రవీణ తమ్ముల్లలో ఇద్దరు నాకు బాగా క్లోజ్. వాళ్ళలో రమేష్ కి అయితే  ప్రవీణ  భర్త ట్రైనింగ్ ఇప్పించి, తానె పూర్తిగా సహకరించి ఒక మల్టినేషనల్ కంపెనీ లో ప్రోగ్రామర్ గా జాబ్ తెప్పించారు . చిన్న తమ్ముడు అయితే సెలవుల్లో తప్పక ఒక వారం వచ్చి వెళుతున్నాడు . కాని అమ్మ మాత్రం మొదటి సారి ప్రెగ్నెంట్ గా ఉన్నపుడు ఒక నాలుగు రోజులు అదీ కూతురు బ్రతిమిలాడితే వచ్చి వెళ్ళారు. తనే డెలివరీకి , పండుగలకి అని పుట్టింటికి వెళ్లి వస్తు ఉంది .


 మరి తమ్ముళ్ళు ఏమంటున్నారు అంటే, వాళ్ళు అమ్మకే సపోర్ట్ ...తన బాధ తనది అని అంటున్నారన్నది . ఇది ఇంకో షాక్ .

 మీ అమ్మకి  చక్కగా డబ్బులు అవీ ఇస్తూ కాస్త మంచి చేసికోవచ్చు కదా కాస్త మారతారేమో అని అడిగి చూసాను . నవ్వ్వేసింది , అలాంటివి చేస్తే మా అమ్మ ఇంకోసారి నా ముఖం కూడా చూడదు. ఛీ కొడుతుంది ఇంకేం లేదు అన్న తర్వాత ...ఇదెక్కడి  సమస్య అనిపించింది .


 ఆంటీ  నాకు ప్రశ్నగానే మారిపోయారు . తర్వాత ఒకసారి మా ఇంటికి నన్ను చూడ్డానికి వచ్చారు , ఇంకోసారి గుడిలో కనిపించారు. అదే ప్రేమ ..వాల్లమ్మాయి  గురించి కూడా సంతోషం గానే మాట్లాడారు . ఆమెని నేనెక్కడో అర్ధం చేసికోలేదనిపించింది .


చాలా రోజులు పట్టింది ఆమె అంతరంగం అర్ధం కావడానికి. ఒక ఆడపిల్లకి తల్లిగా మన సంస్కృతి ఇన్నాళ్ళు పెళ్లి చేసి అత్తారింటికి పంపెవరకే మన అమ్మాయి అని నూరి పోసింది . బహుసా అదే గుడ్డి నమ్మానేమో , ఆమెని అర్ధం చేసుకోవడం లో పొరపాటు జరిగింది .

ఆవిడకి నలుగురు పిల్లలు , నలుగురూ ఆడపిల్లలో మగపిల్లలో అయితే ఏ గొడవాలేదు కాని ముందు అమ్మాయి తర్వాత ముగ్గురు అబ్బాయిలు. కాని మగపిల్లలతో సమానంగా, ఇంకా కాస్త ఎక్కువ ప్రేమ అభిమానాలు కలిపి తనని పెంచారు . మగపిల్లలకి ఆడపిల్లగా, అక్కయ్యగా తనకెంత విలువ ఇవ్వాలో కూడా చక్కగా నేర్పించారు . అప్పటి అందరు ఆడవాళ్ళ లా భర్త సంపాదిస్తుంటే  కేవలం పిల్లల్ని బాధ్యతగా పెంచడమే కాకుండా, గేదెల్ని పెట్టుకుని , ఇంకా అంకుల్ కి వ్యవసాయం లో కూడా సాయం చేస్తూ తన సంతోషం అంటా పిల్లల్లోనే చోసుకొన్నారు. నలుగురిని పెంచాలి కాబట్టి సంవత్సరానికి   రెండు చీరల్ని మించి  ఎప్పుడు కొనుక్కోలేదు.


 తను  ఉద్యోగం మారి గుంటూరు కి వస్తే ఫామిలీ షిఫ్ట్ చేసి మరీ తనతో ఉన్నారు. అంకుల్ రోజు వెళ్లి వచ్చేవారు. కూతురు పెళ్లి విషయం లో యెంత ఆలోచన చేసారో నాకే తెలుసు . కట్నం విషయానికి వస్తే ఆయన మాటలు నవ్వు తెప్పించేవి . కట్నం ఇవ్వనన్నారు సరే, వచ్చి వెళ్ళే మారేజ్ బ్రోకర్స్ కి కూడా పైసా ఇవ్వనన్నారు ముందే . ఆయన పెంపకం పై ఉన్న నమ్మకం అదీ .

 పెళ్లి  తర్వాత కూడా అత్తా మామలేమి తన బాధ్యతా తీసికోలేదు , వీళ్ళే ఉన్నారు తనకి  భర్త ఉండే చోటుకి బదిలీ అవడానికి ముందువరకూ . కాని ఒకరోజు అలా వదిలేసి వెళ్ళిపోయారు . ఎందుకంటె!!!!


మన సంస్కృతిలో కూతురికి , కొడుకు కి చాలా తేడా ఉంది . కొడుకు కి తల్లిదండ్రులంటే బాధ్యత, జవాబుదారీ ఉండాలి . వారికి  సంపాదన పై హక్కు, కొండకచో అజమాయిషీ కూడా ఉండి  తీరాలి. కాని  అంతే కష్టపడి చదివించి, మంచి ఉద్యోగంలో చేరాక పెళ్లి చేసి అల్లుడి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్ళు చల్లుకోవాలి . అమ్మాయి భర్త అడగ్గానే తన మరిది వీసా ప్రాసెస్ కోసం   అకవుంట్ ఖాళీ చేసి ఇచ్చెయ్యాలి . అక్కడే ఉన్న అమ్మా నాన్నకి చెప్పనవసరం లేదు , ఎందుకంటే ఇప్పుడు తన కుటుంబం వేరు . కాని తన కుటుంబం అనుకునే ఆ అత్తా మామలు కాని , భర్త కాని వచ్చి తన బాధ్యత  తీసికోరు .

బహుసా అందుకేనేమో ప్రవీణ వాళ్ళ అమ్మ ఇప్పుడు మవునం గా వదిలి వెళ్ళడం లో  నాకు  ఒకే అర్ధం కనిపించింది . హక్కులు అత్తా , మామ కుటుంబం మరియు భర్తవి అయితే, బాధ్యతలు కూడా పూర్తిగా వారివే. ఇప్పటి వరకు కష్టపడింది చాలు . మిగిలిన పిల్లల సమస్యలు చూసుకోవాలి కాబట్టి కూతురు విషయంలో తన ప్రమేయం ఇంచుక కూడా అక్కర్లేదు అని తప్పుకొన్నారు.  ఈ నిర్ణయానికి రావాలంటే ఒక స్త్రీకి యెంత ఆత్మాభిమానం కావాలి !!! అంతకుమించిన జీవితానుభవం, ఆలోచనా పరిణితి ముఖ్యమ్.

అమ్మాయి అంటే గారాబం గా పెంచి ఇంకో ఇంటికి దానం చేసే ఆస్తి కాదు. తనకూ వ్యక్తిత్వం వుందని అవతలి వాళ్ళు తెలుసుకోనంత కాలం ప్రవీణ కూడా తనకి అందరి అమ్మాయిలకు ఉన్న లాంటి కన్న తల్లి ప్రేమ దొరకట్లేదు ఎందుకు అని అత్తగారితో చెప్పుకొని బాధ పడుతూనే ఉంటుంది .

ఆఖరుకు కొడుకులకు కూతురు అల్లుడు సహకరిస్తున్నారు అని స్వార్ధం తో ఆలోచించి కొందరు కలిసిపోతారు కాని ఆంటీ అలా కాదు . అది వాళ్ళ అక్కా తమ్ముళ్ళకి సంబంధించినది . వ్యక్తిత్వాన్ని సందర్భానికోకరకంగా మార్చుకోకుండా ఆదర్శ మాతృమూర్తిగా నిలబడడం కొందరికే సాధ్యం .

మూడవ భాగం లో అత్తగారి వెర్షన్ వివరిస్తాను 

30, ఏప్రిల్ 2013, మంగళవారం

బ్లాగు వ్యాఖ్యల కధ


చాలా మంది  వాదనకు భయపడి అసలు అభిప్రాయాలు ఉన్నా వ్యక్త పరచడం మానేస్తున్నారు అని, ఇంకొందరు అజ్ఞాత ఆప్షన్ లేక  , ఆఫీసులో గూగుల్ ఓపెన్ అవ్వక వ్యాఖ్యానించడం లేదని చెప్తారు . మరి అయితే మాట్లాడేవాళ్ళు ఎలా ఈ అవరోధాలు దాటి వస్తున్నారు అన్నది సమస్య . వ్యాఖ్యానించ  దలుచుకొన్నవారు ఇలా ఎలా మౌనమ్గా ఉంటారు ? అది మనసుకి ముసుగు వెయ్యడమే కదా. మనసుకు ఇష్టం  లేకపోవడం వేరు , ఇష్టం ఉంది ముసుగు వెయ్యడం వేరు . ఇది మన భ్రమే కావచ్చు. నిజంగా వ్యాఖ్య వ్రాసేంత  బలమైన అభిప్రాయం ఉండకపోవచ్చు . మనకెందుకొచ్చిన గోల అనుకోవడం అసలు కారణం . ఒక వ్యాఖ్య   చర్చలోకి మళ్ళితే ఎక్కడ/ఎప్పుడు తేలుతుందో , అలా ఆ వ్యాఖ్యలన్నీ అనుసరించడం లో  బోలెడు సమయం వృధా అని చక్కని వ్యాఖ్యాతలు మవునం వహిస్తున్నారా అన్న అభిప్రాయమే చాలా రోజులు ఉంది . ఇదే ప్రశ్నను 'జాజిమల్లి' బ్లాగర్ మల్లీశ్వరి  గారిని అడగ్గా ఇలా సమాధానం చెప్పారు .
వ్యాఖ్యలు కానీ టపాలు కానీ ఎవరి ఉద్వేగాల బలాన్ని బట్టి వారు స్పందిస్తారు. ఎన్ని రాజకీయాలున్నా అది ఊపిరాడ నివ్వదు

ఇక నొ. కా బ్లా స అని , గుం  వ్యా కా స అని  రక రకాల వ్యాఖ్హ్యాల సంఘాలు పేర్లు వచ్చాయ్ . ఇందు మూలంగా నో కా బ్లాస అధ్యక్షులు అర్ధం చేసికోవాల్సింది ఏమిటి అంటే , పలానా వ్యాఖ్యాతల  ఉద్వేగాలను మీరు టచ్ చెయ్యడం లేదు, చాలా సాఫ్ట్ గా సున్నితంగా వ్రాసిన టపా  నేమలీకతో వ్రాసిన వెన్నలా చల్లగా మనసులోకి వెళ్ళింది కాని వుద్వేగంలా తిరిగి  రావడం లేదు అని .

ఇక గుం  వ్యా కా స హడావిడి చూసి డిప్రెషన్ కి వెళ్ళడం ఇష్టం లేని ధైర్యవంతులయిన రచయితలు మాకెందుకు వ్రాయరు వ్యాఖ్యలు అని యుద్ధం చేస్తారు . ఖచ్చితం గా చెప్పాలంటే సింగిల్ గా ఉన్న వారు ఐ యాం సింగిల్ , రెడీ టు  మింగిల్  అని అనౌన్స్ చేసినట్లుగా. అప్పుడు ఆ సింగిల్ ఈజీ టార్గెట్ అని కన్ఫర్మ్  అవ్వుద్ది , ఎవరయినా  పని చూసుకోవడానికి ప్రోసీడ్ అవుతారు. ఇలా అనడం  ఎందుకంటె అభిప్రాయం అనేది చిన్నదో పెద్దదో ఉద్వేగం  రావాలి కాని ఇలాంటి రిక్వెస్ట్ లు ఫేక్ వ్యాఖ్యలనే తెచ్చి పడేస్తాయి . 

మనం టపా వ్రాసినపుడే సంతృప్తి వస్తుంది . వ్యాఖ్యలు ప్రోత్సాహం అయితే ఏ వ్యాఖ్య లేకుండడం, లేదా తక్కువ ఉండడం  అంతకన్నా శుభం , మీరు ముఖ స్తుతికి తేలిగ్గా  పడిపోరనీ , గుంపులు గోవిందయ్యలుగా ఉండరనీ  కన్ఫర్మ్ చేసిసికున్నారన్న మాటే . కాబట్టి పండగ చేసుకోవాలి కాని నొచ్చుకోవచ్చునా !!!

29, ఏప్రిల్ 2013, సోమవారం

ఫెమినిజం లో అమ్మా , అత్తగార్లు

ఏంటమ్మా నువ్వు చెప్పేది , అంకుల్ నీతో అలా  ఎలా చెప్తారు. చెప్పడమే తప్పు కాదా ఆయన్ని మనడ్లించడం మానేసి నిజమని నమ్మి నాకు చెప్తున్నావా?  ఆ అమ్మాయి అలా చేసే తత్త్వం కానే కాదు.  ఒకవేళ చేసినా కూతురుగురించి ఎవరయినా అలా చెప్తారా? నీకర్ధం కాలేదే ? ఛ  ఆయన ఇలా మాట్లాడుతారనుకోలేదేప్పుడు . అయినా ఆ విషయం నీకెందుకు చెప్పారు?  ఏమో ఆయనే ప్రస్తావించి చెప్పాడు  అమ్మ సమాధానం .

అమ్మతో నాకెప్పుడు ఇది సమస్యే, అమ్మే కాదు తన చుట్టూ  అందరు దాదాపు ఇంతే, ఎవరో ఏదన్నా చెప్తే కాస్త కూడా ఆలోచించరు. నమ్మేస్తారు అదేమంటే మనకెందుకు వాళ్ళ గోల అని మాట తప్పించేస్తారు.

అంకుల్ నా కాలేజ్మేట్  ప్రవీణ వాళ్ళ నాన్న గారు. సాధారణం గా ఎవరితో మాట్లాడరు , స్నేహం కూడా చెయ్యరు. స్కూల్లో హెడ్మాస్టర్ గా చేస్తున్నారప్పటికి. తన పనేదో తనది. ఉద్యోగం తో పాటు వ్యవసాయం కూడా చేస్తూ నలుగురు పిల్లలని జాగ్రత్తగా పెంచారు. మొదటి సారి వాళ్ళింటికి వెళ్ళినపుడు ఆయన మాటలు చిత్రం గా తోచాయి. అందరు భోజనాలు చేస్తుండగా సరదాగా మాట్లాడుతూ కలిసి తింటే పచ్చడన్నం కూడా కడుపు నింపేస్తుంది అమ్మా అని ఇంకా మా ఇంటికి ఎవరైనా రావడం చాలా అరుదు అని సంతోషంగా కలిసిపోయారు .  ఇక ఆంటీ చెప్పక్కర్లేదు సాయంత్రం దాకా అన్నిపనులు  ఆడుతూ పాడుతూ చేస్తూ , వంటిల్లు సర్ది నిద్రపోయే సరికి పది దాటుతుంది . అయినా తెల్లవారి మేము లేచేసరికి చక్కగా స్నానం అదీ చేసేసి తలదు వ్వుకొని, అంతే కాదు అప్పటికే చావిట్లో గేదేలదగ్గర పనిచేసేసి పాలు గిన్నె తో కనిపించేస్తారు . అయినా ఎండాకాలం ఏమో ముందురోజు అట్టే పెట్టిన మల్లె పువ్వులు ఆంటీ తలలో నలగకుండా ఫ్రెష్ గా పలకరిస్తూ ఉంటాయి . మళ్ళీ అందరికీ టిఫిన్లు పెట్టేసి వంట కానిచ్చి కాస్సేపు మాతో సరదాగా గడుపుతారు . రోజంతా పిల్లల కోడిలా కబుర్లాడుతూ నిండుగా , చిరునవ్వుతో అలుపనేది లేకుండా అందరికీ  తలలో నాలుకలా వుంటూ పనులు కానిచ్చేస్తారు .  అసలు కాలేజ్ లో  ఆంటీ పరిచయమే చిత్రంగా జరిగింది . ఏ వూరు అని , అలా మా అమ్మ వాళ్ళు కొంచెం తెలుసు అని చెప్పారు. అలా వాళ్ళ పక్కూరిలో ఉన్న మా తాతయ్య గారి వివరాలు చెప్పగానే అయితే మీ  పెద్దమ్మగారే నమ్మా నాకు, అంకుల్ కి  పెళ్లి కుదిర్చింది అని బాగా దగ్గరయి పోయారు. ఎగ్జామ్స్ అయి ఇంటికి వచ్చేప్పుడు వాళ్ళూరి లో దిగేదాకా వదల్లేదు . సాయంత్రం వెలుదువుగాని అని ఒప్పించి వెళ్ళాక నాలుగు రోజులకి గాని పంపలేదు.


వాళ్ళిద్దరూ ఉద్యోగం ఒక్కటి కాకుండా ఇంత  కష్ట పడి పదో పరకో జీతానికి తోడూ సంపాదిస్తూ ఉంటే ఇంకా ఒకరి గురించి చెడ్డగా మాట్లాడుకోడానికి తీరికెక్కడ . అలాంటి అంకుల్ రెండేళ్ళ తర్వాత అమ్మతో అలా వాళ్ళమ్మాయి గురించి చెప్పడం నాకు అస్సలు నచ్చలేదు . అంత కోపం రావడానికి ఇంకో కారణం కూడా ఉంది . అసలు ప్రవీణ నేను దూరంగా ఉండడానికి అసలు కారణమే తను ఎప్పుడూ వాళ్ళ నాన్న కి నచ్చినట్లు ఉండడమే . అలాంటిది ఆయనే కూతురిని ఇలా తక్కువ చెయ్యడమా .

సరే నేను పెట్టిన వారం రోజులు సెలవ్ అయిపోవడంతో మళ్ళీ బెంగుళూరు వెళ్ళిపోయాను . ఆ వాళ ఎలాను లేట్ అయ్యింది ఆఫ్ఫీస్లోనే డిన్నర్ చేసి వెళదాం అని డిసైడ్ అయ్యాము . అలా కాస్సేపు కాంపస్ లో చక్కర్లు కొట్టి కాంటీన్ కి వెళ్దాం అని  నడుస్తూ ఉండగా ఒకబ్బాయి ఇంకెవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. పట్టరాని సంతోషం వేసింది , వెనగ్గా వెళ్లి ఫోన్ తో వీపు పై దేబ్బెసాను , తనూ వెనక్కి తిరిగి చూసి  మొహం మతాబులా వెలిగించేసాడు . తను ఎవరో కాదు ప్రవీణ రెండో తమ్ముడు రమేష్  , ఎమ్సియ్యే కి ప్రిపేర్ అవుతుండగా చివరిసారి కలవడం . ముగ్గురు తమ్ముళ్ళ లో రమేష్ తో కాస్త ఎక్కువ అభిమానం. నువ్వేంటి ఇక్కడ అని ఇద్దరం ఒకరిని ఒకరు పలకరించేసుకోన్నాక అక్కయ్యదగ్గరే ఉంటున్నా అని , ఇంటికి రమ్మని గొడవ చేసాడు . ఉహూ , వాళ్ళక్క అంటే నాకు కోపం ఇంకా అలానే ఉంది .  మా అక్క ఇప్పుడు పూర్తిగా మారిపోయింది . తెగ ఖర్చు పెట్టేస్తుంది అని చెప్పినా అబ్బే మనం తగ్గలేదు . సంతోషంగా ఫోన్ నెంబర్ లు  అయితే ఇచ్చి పుచ్చుకున్నాం.


ఒక రెండు నెలల తర్వాత రమేష్ వాళ్ళ టీం  మెంబర్ కన్పిస్తే  మాటల్లో ఆ   పూనే ట్రాన్స్ఫర్ చెయ్యించుకొన్నాడు  అని తెల్సింది . అయ్యో అని వెంటనే నంబర్ తీసికొని కాల్ చేసాను. మళ్లీ  అదే కంప్లైంట్ అక్కని కలవలేదు ఇంకా అని పోట్లాడేసాడు . బాబు నేను వెళ్ళలేను కాని నంబర్ ఇవ్వు మాట్లాడుతాను అని చెప్పాను. అలా ప్రవీణ కి చివరికి తప్పదని ఫోన్ చేసాను . ఆ పిల్లేమో కాస్తకూడా మాట్లాడకుండా నువ్వు ముందు వస్తావలేదా చెప్పమంది . తన క్లాస్మేట్ మా ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాడు తను తీసికొని వస్తాడు , అని నాకు మాట్లాడే చాన్స్ ఇవ్వకుండా అతన్ని మా బ్లాక్ కి పంపించింది .


సరే తర్వాతి  రోజు తన బర్త్ డే కూడా కదా మూవీ కి వెళ్దాం అని ప్లాన్ చేసికొన్నాం . వాళ్ళాయన విదేశంలో ఉండడం బాగా కలిసొచ్చింది . ఆ చుట్టూ పక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా వచ్చారు. సరదాగా గడిచిపొయ్యాయి . అందరు వెళ్ళాక అసలు మాట్లాడినట్లే లేదు అని సోమవారం కూడా సెలవు పెట్టి అక్కడే ఉన్నాను .  ఉన్నానే కాని నేను అంకుల్  మాటలకి కోపం వచ్చి ఆయన్ని చెడామడా తిట్టడం నా బుర్రను వదలడం లేదు . తనకి వాళ్ళ నాన్న అంటే  ఎంతిష్టమో తెలుసు , అలాంటిది నేనలా అనేసి ఈ పిల్లతో మామూలుగా ఉండడం ఇబ్బంది అయ్యింది అలా అని నేను ఊరికే అనలేదు కదా. తనగురించి వాళ్ళ నాన్న అలా చెప్పారని చెప్పలేను కాని . నాకు  వచ్చిన కోపం అలాంటిది . అదే సమయం లో వాళ్ళ నాన్న గురించి అలా మాట్లాడి తనతో మామూలుగా ఉండడం బాలేదు .  అందుకే నెమ్మదిగా సారీ చెప్పి ఇలా జరిగింది , నాకు నచ్చక మీ డాడీ గురించి కోపంగా మాట్లాడాను అని అతి కష్టం మీద చెప్పాను . చిత్రం గా నేననుకొన్నట్లు తను నా పై కోప్పడలేదు . వదిలేయ్ మౌళీ , చాలా జరిగింది. ఇన్నాళ్ళు పెంచారు .  ఇంత  మంచి జీవితం ఇచ్చారు అందుకే వాల్లనేమి అనొద్దు అనుకున్నాను  అంది . మొదట గట్టిగా ఊపిరిపీల్చుకోన్నాను అమ్మయ్య నేను పొరపాటు చెయ్యలేదు అప్పుడు ఇప్పుడు  అని . అసలేం జరిగింది అని అడగకుండా ఉండలేకపోయాను .  తను చెప్తూ ఉంటె నాకసలు మెదడు మొద్దుబారిపోయింది . అవునా అని తప్ప ఇంకేం అనలేని సంఘటనలు  .

( మిగిలినది తర్వాతి భాగం లో ..)

ఈ  టపా సెరిస్ ప్రవీణ వాళ్ళ అమ్మ , ఆత్తయ్య లను స్త్రీవాద కోణం లో వివరించే ప్రయత్నం . )

28, ఏప్రిల్ 2013, ఆదివారం

కెమెరామెన్ గంగ తో రాంబాబు - జగన్ కధ

పూరీ జగన్ దర్శకత్వం  వహించిన సిన్మా జగన్ కధ కాక త్రివిక్రమ్ కధ  అవుతుందా  అని అనుమానం వచ్చిందా మీకు?  అయితే మీకు జ్ఞాన పీఠం  వచ్చేసినట్లే .

వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ ఆక్సిడెంట్ లో మరణించిన కొద్ది రోజులకే ఆయన పై సినిమా ని పూరి జగన్ దర్సకత్వం లో ప్లాన్ చేసినట్లుగా హడావిడి చేశారు . మొత్తానికి ముహూర్తం పెట్టడమే తరవాయి అని ప్రచారం కూడా జరిగింది . అప్పట్లో కాస్త దర్శకుడికి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కోసం తయారు చేసుకొన్న ముడిసరుకు అలా ఉండిపోయి ఉంటుంది . అదే  కెమెరామెన్ గంగ తో రాంబాబు కి మూల కధ అనుకోవచ్చు. సినిమా చూస్తున్నంత సేపు పూరీ జగన్ వై ఎస్ కుటుంబ అభిమాని కాదా అని బోలెడు ఆశ్చర్యం వేసింది. కేవలం దర్శకుడిగా మాత్రమె కొడుకు జగన్ కి సిన్మా చేస్తానన్నాడా?

గబ్బర్సింగ్ చూసాక పవన్ సిన్మాలంటే చిరాకేసింది . అందుకే ఇప్పటి వరకు ఈ సిన్మా వైపు కూడా చూడలేదు .కాని మన తిరుట్టు వెబ్ సైట్ లో ఇంతకూ మించిన సిన్మా దొరక్క చూడాల్సి వచ్చింది .  ఒకేసారి చూడ్డం  కాస్త కష్టం ఏమో. అదీ కాక ఎంటర్తైన్మెంట్ కోసం సిన్మా అంటే ఇది నచ్చకపోవచ్చు . నాకు మాత్రం చాలా నచ్చింది . మొత్తం పూరిజగను విశ్వరూపం చూపించేసాడు, డైలాగ్స్ వ్రాయడం లోను అవి ఆయా పాత్రలతో చెప్పించడం తోనూ.

సిన్మా లో రాజకీయ పాత్రల పేర్లు చూసి చంద్రబాబు నాయుడు కధలో ఉన్నాడను కొంటే  మళ్ళీ పప్పులో కాలేసినట్లే.
రెడ్డి పేరు పెట్టినంత మాత్రాన , పాద యాత్ర చేసినంత మాత్రం తో ముఖ్య మంత్రి గా వై ఎస్ ని, కేవలం నాయుడు అన్న పేరుతొ ప్రతి పక్ష నాయకుడిని ఊహించుకోవడం చాలా హాస్యాస్పదం . రెండు టర్మ్స్ ముఖ్యమంత్రిగా చేసింది కేవలం చంద్రబాబే కాదు , వై ఎస్ కూడా :)

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే అక్కడ నాయకుడు, ప్రతినాయకుడు ఒకే వ్యక్తి కధ  నుండి వచ్చారు . ఇద్దరూ వై ఎస్ గారి కధలోని రెండు కోణాలు .  సమకాలీన రాజకీయ అంశాలు సినిమా కధగా పెట్టినపుడు కాస్త కాచీ గా ఉండే పేర్లు వాడడం , అదీ డైరెక్టు ఇది పలానా ముఖ్యమంత్రి పాత్ర అని స్పష్టంగా అర్ధం కాకుండా ఉండేందుకు పూరి జగన్ చేసిన ప్రయోగం చక్కగా ఫలించింది. ఇంకా తండ్రి చనిపోక ముందే కొడుకు జైలు సీన్ రావడం ముఖ్య మంత్రి అయిపోతాడు అని ప్రచారం జరగడం అలా మనకి తెలిసిన వరుసలో కాకున్నా జగన్ రాజకీయ జీవిత ఘట్టాలన్నీ మనకళ్ళముందు జరిగిపోతూ ఉంటాయి . మనం ఊహించని మలుపులు తో ఆశ్చర్య పరుస్తాయి . ఒక సారి తెలుగు తల్లి ఇంటర్వ్యూ  తోనూ , ఇంకొకసారి టీవీ లో ఆవేశపూరిత  ఉపన్యాసంతో జనం అందరినీ కదిలించడం చాలా బావున్నాయి 

రాజకీయం పక్కన పెడితే , మనోభావాలు దెబ్బ తీసుకొనే ప్రేక్షకులకొసమ్ గుడ్డి వారి పై వేసిన సెటైర్ అదుర్స్. ఇంకా సిన్మా ను వెయ్యిప్రింట్లు వేసి హడావిడిగా డబ్బు చేసికొంటున్న నిర్మాతల్నీ వదల్లేదు . ఇక బ్రహ్మానందం పాత్ర నయితే చాలా ఎంజాయ్ చెయ్యొచ్చు .  తమన్నా మొదటి సారి అమ్మాయిగా నటించింది , అందాల బొమ్మ  గా కాకుండా . తను ఎలాంటి అమ్మాయో చెప్పడం సరదాగా ఉంటుంది . ఆర్డినరీ అమ్మాయిల గురించి  దర్శక జగన్ మాటలు పవన్ డైలాగులలో  చక్కగా పేలాయి .

సుజాత గారు దేశభక్తి సిన్మాల పై వ్రాసిన ఎఫ్ఫెక్ట్ ఈ రాష్ట్ర భక్తి  సినిమా  రివ్యు  నేను వ్రాస్తే వస్తుందా , అయినా పర్లేదు సిన్మా నాకు బాగా నచ్చింది  ఽది పంచుకోవడానికే ఈ బుల్లి టపా అన్నమాట. అవార్డ్ రావాల్సిన సిన్మా , నేను బాగుంది అన్నాక ఏ సిన్మా అయినా ఆడిందా అని అసలు :) ఒక ఆరెంజ్ , ఒక మొగుడు, ఒక కెమెరామెన్ :)  పబ్లిక్ కి నచ్చవ్  :)







18, ఏప్రిల్ 2013, గురువారం

ఆసియా లోని అత్యంత ప్రభావశీలురు వీరేనా


ఈనాడుకి ఈ మధ్య సోనియా పై ప్రేమ ఎక్కువయ్యిన్ది. నకిలీ కణికులా మజాకా :) అబ్బే కాదులే జగన్మాయేమో .   అప్పట్లో చంద్రబాబుగురించి ఇలా అంతర్జాతీయ నంబర్ల హడావిడి జరిగెది.  తర్వాత వార్తల్లో కనిపించడం మానేసాడు. ఇప్పుడు మన్మోహనుకో , సోనియాకో ఎదురు దెబ్బ తగలదు కదా.  వివరాల్లోకి వెళ్తే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురైన 100 మంది ఆసియన్లలో మొదటి అయిదు మంది లో సోనియా, మన్మోహనూ మరియు రాహులూ రెండవ, నాల్గవ, అయిదవస్తానాల్లో నిలిచారు. సోనియా తల్లి ప్రేమ యెంత గొప్పది, తన పేరోక్కటి కాకుండా కొడుకు కి కూడా ఇప్పిస్తూ అనుమానం రాకుండా ఆటలో అరటి పండు లా మన్మోహనుక్కూడా ఉదారంగా వేయించేశారు.

ఏమాటకామాటే  చెప్పుకొవాలి. ఒక దశాబ్దం క్రిందట జనాలకి ఈ సోనియా పిచ్చేమిటో అర్ధం అయ్యేది కాదు. అందంగా , ఇంత  పెద్ద బొట్టు పెట్టుకొని  పట్టుచీరకట్టుకొఛ్చిన సుష్మా స్వరాజ్ ని వదిలేసి ఈ బళ్లారోళ్ళు సోనియాని గెలిపించేడం  అస్సలు జీర్ణం కాలేదంటే నమ్మండి .అయినా అదే  సుష్మా స్వరాజ్ గుండు కొట్టిన్చుకోకుండా ప్రధాని పదవిని త్యాగం చేసి  భారతీయ సంప్రదాయాన్ని కాపాడింది అనుకోండి.  ఇప్పుడయితే ఆంద్ర, తెలంగాణా లో ఎక్కడ అయినా గెలిచేస్తుంది అని అర్ధం అయ్యిన్దనుకోండి.

గత పదిహేను, ఇరవై  సంవత్సరాలుగా ఒక మహిళ కేవలం కుటుంబ వారసత్వం వాళ్ళ అయితేనేమి ఇంత పట్టును కలిగి ఉండడం, ఎప్పటికప్పుడు వ్యూహాలు, నిర్ణయాలు ఏర్పరుచుకొని ముందుకి సాగడం మామూలు సంగతి కాదు. ఎవరికేం కావాలో అర్ధం చేసికొని మసులుతూ ఉండడము, అవసరం అయితే కన్నెర్ర చెయ్యడంకూడా తెలుసనీ చెప్పకనే చెప్పింది. ఇంత  పెద్ద ప్రజాస్వామ్యాన్ని తన కనుసన్నలలో నడిపిస్తున్న మహిళా అంటే అంతర్జాతీయ రాజకీయాలు, మార్కెట్ లో యెంత ప్రాముఖ్యతను కలిగి ఉండాలి ? ఆవిడ ఏ ఉద్దేశ్యంతో గాంధి కుటుంబం లో అడుగు పెట్టిందో ఇన్ని సంవత్సరాల తర్వాత చర్చించడం అనవసరం. అంతకు మించిన నాయకత్వం మనకి లేదు అన్నది నిజమ్. 

ప్రస్తుతానికి ఆసియాలో ను, ప్రపంచం లోను అత్యంత గుర్తింపు సోనియాకి లభించడం ఆనంద దాయకమే.  

10, ఏప్రిల్ 2013, బుధవారం

ఇందిరమ్మ హస్తం

అబ్బ పది రోజులనుండి నాకు ఎంత మంచి అయిడియా వచ్చిందో అని మురిసిపొతున్నాను.  ఆచరణలో పెట్టె సమయం కోసం ఎదురు చూపులు కూడా మొదలు పెట్టే సానూ . ఇంతలోనే ఇవ్వాళ వార్త . కాంగ్రెస్ పార్టీ నా ఐడియాని కాపి కొట్టెయ్యడానికి సిద్దమై పోతున్నది . ఇప్పుడు నేనేం చెయ్యాలి. గత పన్నెండు నెలలనుండి ఇరవై ముప్పై ఆలోచనల్లోనుంచి కుదిరేపనిగా ఉందని ఇది ఒక్కటి చేద్దాం అనుకుంటే , వీళ్ళు నా ఆశల పై కళ్ళాపి  చల్లుతున్నారు.  అయినా చూద్దాం  ఎవరు ముందు మొదలు పెట్టేస్తారో .

అసలు విషయానికి వస్తే , నాకు తెలిసిన నాలుగు కుటుంబాలు, ప్రస్తుతానికి ఆడవాళ్లే మిగిలి ఉన్నారు . వాళ్లూ ఎన్నాళ్ళు పనిచెస్తారు. కొద్ది గొప్ప వ్యవసాయానుకూలమైన భూములు ఉన్నా వచ్చే కవులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటూ, రోజు ఏదో పనిలో తమని తాము బిజీగా ఉంచుకుంటూ ఉన్నారు. ఇదంతా అనడరికీ మామూలే .
కాని ఆడవాళ్ళు ఇంతవయస్సులోను బజారుకి వెళ్లి కిరాణా సామాన్లు తెచ్చుకోవాల్సి రావడం మాత్రం చాలా కష్టం గా ఉంటుంది. చిన్నపిల్లలుగా వెళ్ళడం వేరు. కనీసం నెలకోసారి పట్టీ కట్టించుకొనే ఆలోచనకుడా ఇబ్బందే , ఒకేసారి ఖర్చు కి మనసొప్పదు. అందుకే ప్రతినెలా వారికి కావాల్సిన వస్తువులు పట్టీ తయారు చేసి అంతవరకూ జాగ్రత్తగా అందేలా చేస్తే, వాళ్ళు బయటికి వెళ్లి ఎండా, వానల్లో కష్ట పడకుండా ఇంటిదగ్గరే ఉంది చెయ్యగలిగిన పనులు చేస్తూ ఇంకాస్త ఉన్నన్నాళ్ళు మెరుగైన జీవనం గడపగలరు అని . ఎక్కువమందికి ఇవ్వలేము కాని ఇంకెవరూ లేనివారికి ఇంతకూ మించి పరిష్కారం మన చేతుల్లో లెదు.


ఇప్పుడే ఈనాడు లో న్యూస్ ఐటెం 'అమ్మ హస్తం ' పేరు తో 9 నిత్యావసర వస్తువుల పధకం ప్రకిటించే ప్రయత్నం గురించి ఉంది . నాకయితే బాగా నచ్చింది.  ఈ పధకాల వల్ల , ప్రజాధనం యెంత ఖర్చు అవుతుంది, మధ్యలో ఎవరి వాటా యెంత అన్న గొడవ కన్నా, చాలా మందికి కనీస నిత్యావసరాలు కాస్త తక్కువ ధరకు అందుతాయి

మళ్ళీ కాంగ్రెస్ అధికారం లోకి రావడానికి, వై ఎస్ లానే ఇంకాస్త మెరుగైన పధకాలు జనం లోకి తీసికెల్ల డానికి బానే కష్ట పడుతోంది . బాబుకి అయితే ఇప్పట్లో ముఖ్యమంత్రి అయ్యే అవకాసం లెదు. మిగిలింది నలుగురినీ కలుపుకుపోయేది కాంగ్రెస్స్ ఒకటే ( అంటే చిరంజీవినీ, నాగార్జునా, మహేష్ బాబునీ అని కాదండోయ్ )


కిరణ్కుమార్ ఇప్పటిదాకా పదవిలో  ఉండడమే విశేషం , చూద్దాం ఆయన అదృష్టం ఎలా ఉందొ !

8, ఏప్రిల్ 2013, సోమవారం

సినిమాలు, బాంబుదాడులు, ముస్లిమ్స్, జస్టిస్ కట్జూ , ఎన్టీఆర్



ఈనాడు పేపర్ అలవాటయ్యాక ఇంకో పేపర్ అస్సలు నచ్చదనుకుంటా. అందుకే కాస్త టైమ్పాస్ కి న్యూస్ చూడాలి అంటే వేళ్ళు  అలవోకగా ఈనాడు. నెట్  అని వెళ్ళిపోతాయి. ఒక్కటే సమస్య ఏదన్నా న్యూస్ పంచుకొందామంటే అక్కడినుండి బ్లాగులోకి అంట తేలిగ్గా రాదు.

ఏదేమైనా ఒక మంచి వార్త చూసాను, చూడగానే అబ్బో ఇలాంటి వార్తలు కూడా ప్రచురిస్తున్నారా అని ఆశ్చర్యం వేసిందంటే మరి అంత  ఘాటుగా ఉంది.  ఈ మధ్య పాత జడ్జీలు కూడా ఇష్టం వచ్చినట్లు సంజయ్ దత్ కి బెయిలివ్వాలనీ, ఇంకేదో పనికోమాలిన స్టేట్మెంట్ లు ఇస్తుంటే ఈ జస్టిస్ కట్జూ గారేమో మంచి ఆసక్తికరమైన వ్యాఖ్యానం  చేసారు. ఈయన ఇంతకూ ముందు కూడా ఇలానే బుద్దిగా మాట్లాదేరో లేదో ఒకసారి చెక్ చేద్దాం అంటే బద్ధకం వేసి ఇప్పటికిలా కానిచ్చెస్తున్నా. మీకు తెలిస్తే మాత్రం చెప్పండే

మొత్తానికి చాన్నాళ్ళ తర్వాత ఇ లాంటి వ్యాఖ్యలు చూసాను. ఏంటో జీవితం దేనికైనా రెడీ సిన్మా చూసాము అని చెప్పాలంటే ఒక తెలిసిన ఫామిలీ కక్ష పెట్టుకుంటుందేమో అనుమానమ్.  నా ఇంకో ప్రియనేస్తం ముస్లిం. పనికిరాని  సినిమాల  సంగతి సరే. వాళ్లకి తెలుగు  సినిమాలతో పనిలేదు.  హైదరాబాదులో బాంబులు అనగానే అమ్మయ్య తను తెలుగు న్యూస్ చానెల్స్ ఏమి  చూడరు కాబట్టి  పర్వాలేదు. అయినా  చిన్న అసంతృప్తి . నేను చూసినంత లో మిగిలిన అందరికన్నా ముస్లిమ్స్ బహు సౌమ్యులు.  ఇంత మందిలో ఒక్కరుకూడా తొందరపడి మాట్లాడినవారిని  చూడలేదు. కాని ఏ సంఘటన జరిగినా వాళ్ళ గురించి మాట్లాడ్డం , ఇవేవి వారికి మంచివాళ్ళ మీద ఉన్న నమ్మకాన్ని పోగట్టలేదు.


జస్టిస్ కట్జూ మనదేశంలో ఎనభై శాతం మంది ఇరువైపులా మతోన్మాదులే అన్నారు. ముస్లిమ్స్ లో ఎనభై శాతం అంటే మన ఎనభై శాతంలో ఎన్నో వంతో తెలియదు. బ్లాగ్స్ ఆయన మాటలు నిజమని రోజూ నిరుపిస్తున్నాయి.

బ్లాగ్ లే కాదు. ఆ మధ్య మాకు పరిచితులైన ఒక కుటుంబం తో సరదాగా బయటికి వెళ్ళాము ట్రిప్ కి.  తనే ఏదో మాటల్లో తనకు బేధాలు లేవనీ, ఇంకా తను హాస్టల్లో అందరితో ఎలా కలిసి ఉంది చెపుతూ మౌలీ నువ్వు తినే ఎంగిలి  స్పూన్ తో నేను తినేస్తాను అస్సలు ఫీల్ అవ్వను, కాని తర్వాత అదే స్పూన్ నువ్వు ఉప్యొగిస్తావొ లేదో నాకనవసరం అనేసారావిడ. స్పూన్ తో కులాల అంతరాలను చీల్చి వేసిన ఆవిడ ఫిలాసఫీ బొత్తిగా అర్ధం కాకపోయినా , తినను అని అలా చెప్పెయ్యకుండా నవ్వి ఊరుకున్నా .

తర్వాత రోజు సరదాగా బుఫే కి వెళ్ళాము రెండు కుటుంబాలు కలిసి. నా అదృష్టం ఎప్పటిలానే , గ్రూప్ లో నేనొక్కర్తినే. నాన్వెజ్ అయ్యాను.  ఇంట్లో అసలే చెయ్యను , వారం నుండి వీల్లున్నారని హాయిగా వెజ్జే వండుకున్నా, బయటికి వచ్చాక కూడానా . అలా సంభాషణ నాన్వెజ్ లోకి వచ్చిన్ది. మళ్ళీ తనే అన్నది వాళ్ళబ్బాయి కి స్కూల్లో కుకింగ్ క్లాసెస్ లో పార్టనర్ గా ముస్లిం అమ్మాయి వచ్చిందని తెలిసి ఇదేం చండాలం రా నీకు ముస్లిమ్ అమ్మాయి రావడం ఏంటీ అని అన్నాను , లేదులే వెజిటేరియన్ నే ప్రిపేర్ చేసాం ఇద్దరం అని చెప్పాడట వాళ్ళ బాబు.  నాకయితె ఆ మాటకి  కి దిమ్మ తిరిగిపోయింది . అర్ధం కాక అడిగితె మా వారు చెప్పారు..  ముస్లిమ్స్ స్కూల్లో కాని, బయట కాని నాన్వెజ్ తినరట, కాబట్టి ఆ అమ్మాయి కూడా వేజ్జే లాజికల్గా అని. షాక్ ని కవర్ చేసికొంటూ పిల్లల్ని బయట తినవద్దు అనడం ఎందుకు అని వేరే మాట మార్చెసాను. పాపం వాళ్ళాయన అదీ హైజీన్ కాదు హలాల్ చెయ్యని మాంసం, వాళ్ళు తినకపోవడం మంచిదే అని ఆయనా కవర్ చెసారు.

తర్వాత రోజు వాళ్ళు వెళ్ళినా, ఆ మాటలు కష్ట పెడుతూనే ఉన్నాయి.  నిజానికి మనం కాని, మిగిలిన వాళ్ళతో కాని అవసరం కోసం మాత్రమె వీళ్ళు కలిసి ఉన్నారు కాని నిజంగా సంకుచిత మనుష్యులు కదా అంటే , పట్టించుకోకు వదిలేయ్ అన్నారు . అప్పటికి కాని అర్ధం కాలేదు , దగ్గరలోనే ఉన్న ప్రియ నేస్తానికి పలానా తెలుగు వాళ్ళు  వస్తున్నారు,  పిల్లలకి టైమ్పాస్ అవుతుంది రండి అని అడిగినా  కాదు అనకుండా తను అన్ని రోజులు తప్పించుకుంది ఇలాంటి వారిని చూసేనా . తెలిస్తే తనకి చెప్పక పొదును.

మనది హిందూ దేశమా , లౌకిక దేశమా అన్నది నాకు అవసరం లేదు.. మన మధ్య ఉన్నవారి గురించి పిల్లల మనస్సుల్లో విషాన్ని నూరి పొయ్యడం అమానుషం , అలాంటివారు ఎవరైనా వారి పిల్లలకు  చె డుమార్గం ని బోధిస్తున్నట్లే.  అదీ మాటర్

ఇక ఇంకో న్యూస్  ఎన్టీఆర్ ఫోటో గురించి హడావుడి, దానిపై బ్లాగుల్లో కూడా చర్చ అవసరమా? అసలాయన చనిపోయఎనాటి కి ఏ పార్టీ అయితే వాళ్ళు మాట్లాడినా అర్ధం ఉంది. హరికృష్ణ సరిగ్గా సమాధానం చెప్పాదు. రామారావు జనం మనిషి ఎవరయినా బొమ్మ పెట్టుకోవచ్చు అని .  అన్ని పార్టీలకు విస్తరించిన ఏకైక ప్రాంతీయ నాయకుడిగా గిన్నీసు లో వ్రాయోచ్చేమో . అందుకే ఒకసారి జాతీయ పార్టీ లో  గాంధీ, నెహ్రు లేమన్నా ఈ ఖ్యాతి గడించారేమో చూసి లేకపోతె ఏకమొత్తంగా దేశంలోనే పెద్దాయన్ని ఏకైక వ్యక్తిగా ప్రకటించేద్దాము . లేదంటే దేశం లో ఇంకేవరినా ఉంటె మీరే చెప్పాలి మరి. 

23, డిసెంబర్ 2012, ఆదివారం

వోడ్కా విత్ వర్మ -1 ( నిర్జన వారధి )

ఈ మధ్యకాలం లో అనుకోకుండా చదివిన రెండు పుస్తకాలు నిర్జన వారధి , వోడ్కా విత్ వర్మ.  తెలుగు పుస్తకాలు చదవాలి అని ఆసక్తి లేదు. కాని వివాహం లో ఆత్మాభిమానం గురించి, నాకు తెలిసిన ఒక మంచి జంట గురించి ఆలోచిస్తూ మొదట  డాక్టర్ రమణ   గారి టపా నుండి కొన్ని ప్రశ్నల కోసం అన్వేషణ మొదలయ్యింది. అదే రోజు అదృష్టవశాత్తు  జాజిమల్లి గారితో ఇదే అంశాన్ని ప్రస్తావించే అవకాసం కలిగింది. నిర్జన వారధి గురించి నా ఆలోచనలు  ఇక్కడ పంచుకొన్నాను  .

వోడ్కా విత్ వర్మ అది ఒక పుస్తకమని నిన్నటి దాకా తెలియదు  . ఏదో ఒక రివ్యు కంటబడింది. అది వ్రాసినది శ్రీ రమణ గారు కాదనుకుంటా. అందుకే రివ్యు కాస్త సిల్లీ గా అనిపించింది.  క్రిస్మస్ సెలవులు కదా అలా గ్రేట్ ఆంధ్రాలో విహరిస్తూ ఎంబీయస్ గారి వ్యాసం చూడడం,  వెంటనే పుస్తకం చదవాలి అనిపింఛి చదివేసాను. నాకయితే పుస్తకంలో ఎక్కడా వర్మ ని  పొగిడినట్లు అనిపించలేదు. కొంచెం తిట్లు ఎక్కువ కనిపించాయి :) . అలాగే నా ఇష్టం పుస్తకం, అప్పట్లో  నేనే  ఫ్రీ కాపి సంపాదించి బ్లాగుల్లో , బజ్జుల్లో  జానలకి షేర్ చేసికొన్నాను. నా ఇష్టం కి ఏ మాత్రం సంబంధం , పొంతన లేని పుస్తకం వోడ్కా విత్ వర్మ అవడం వల్ల ఆ పుస్తకం లా కేవలం హైప్, క్రేజ్ తో కాక చక్కని కంటెంట్ వల్ల బోలెడన్ని సార్లు ముద్రించ బడుతుంది . అయినా చదివే వారి దృష్టికోణాన్ని బట్టి మాత్రమె వారికి అంతవరకే అర్ధం అవుతుంది, ఈ పుస్తకం కూడా అన్ని పుస్తకాలు లానే. 

నిర్జన వారధి  కీ,  వర్మ పుస్తకానికీ ఉన్న దగ్గరి సంబంధం బహుసా అందరికీ అనుభవం లోకి రానిదేమో.  ఈ రెండింటి ఉన్న సంబంధం నాకయితే నచ్చింది. అచ్చు కొండపల్లి సీతారామయ్య గారి గురించి ఈ టపా లో నా చివరి వ్యాఖ్య లో ఉన్న నా అభిప్రాయం  లానే , ఇంకొకరు ఇంచుమించు అదే విధం గా వర్మ వివాహం విషయం లో ఆయన కుటుంబ సభ్యులు  ప్రస్తావించారు.

మిగిలిన భాగాలలో పుస్తకం పై నా అభిప్రాయాలు వ్రాయాలి.  ఎంబీఎస్ గారికి చాలా చాలా ధన్యవాదములు, ఒక మంచి పుస్తకాన్ని చక్కగా  పరిచయం చేసినందుకు.

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

కమ్యూనిజమూ కమామీషూ

శీర్షిక చూడగానే తల  పట్టేసుకున్తున్నారా ? అబ్బే నేనే పుస్తకాలు సదవలే,  కాబట్టి అంత సినిమా  లేదండీ. కాపోతే  మనికి కుడా ఈ ఇసయం తో కూసంత పని బడింది. మరి మన పని అవ్వుద్దో లేదో గాని, ప్రయత్నిస్తే పోలా !!

 మన పనేదో సెప్పే ముందల, మనకేమి అరదం అయ్యిందో చెప్పుకుందాం. సంపాదించిన సొమ్ములో ప్రతి నెలా ముప్పై శాతం ప్రతి ఒక్కరూ ధర్మం చేసేత్తే చాలు కమ్యూనిజమూ కాకరకాయా అవసరమే లేదు దేశానికి. సరే
మళ్ళీ ముప్పై శాతం  ఎందుకు  , టాక్సు లు గట్రా పడేత్తన్నాము గా అంటే, గుళ్ళో హుండీ లో రూపాయి బిళ్ల  వెయ్యడం మానేయ్యండి.

సరే సరే , సూత్తా సూత్తా ముప్పై శాతం అంటే ఎట్టా కుదురుతదీ అంటే , తప్పదు మరి. కలేజా సైన్మా లో మహేశ్ బాబే ముందల కాదు కూడదు అని ఖరాఖండిగా సెప్పి కూడా తప్పించుకోలేక  పొయ్యాడు, మనమెంతా ?

అయినా మన సేత్తో మనము చెయ్యకపోతే , హుండీ లో రూపాయి వేసిన పాపానికి, ఆ  దేవుడు మన పాపాలు కడిగెయ్యడానికి ఈ కమ్యునిష్టులని పుట్టిస్తన్నాడేమో!!. మరి దేవుడు అందరినీ  మంచోల్లనే పుట్టించడు గా, వాళ్ళలో కూడా కొన్నాళ్ళకి సంపాదన వైపు వెళ్లి మనలా మారిపోయ్యేవాళ్ళు కొందరు వచ్చేస్తారు. అప్పుడు మన బలం పెరిగి 'పాపం' కూడా ఇంకా  ఎక్కువయి పోతుంది. షరా మామూలు.

ఇదంతా ఆసికాలికి వ్రాశా కాని , కమ్యూనిజం ఇక్కడ  నేను   అడిగే  రెండు, మూడు   ప్రశ్నలకి జవాబు చెబుతుందా ?????  అబ్బే పెద్ద ప్రశ్నలు కాదండీ , చిన్న చిన్నవే !

1.  ఈ టపా లో   దత్తత సమస్య పై చర్చించాను. మరి కమ్యునిజం కేవలం ఆస్తి మైకం లో తీసికొనే దత్తతలను    ప్రశ్నిస్తుందా ? ఆ పసి వాళ్లకు ఆస్తులకు ఆతీతం గా ప్రేమను అందిస్తుందా ?  ( ఒకటి కాదు రెండు కాదు ,  మూడు ప్రాణాలు బలి అయ్యాయి మరి ఈ సమస్యలో )

2. ఇంకో టపా లో ఈ అబ్బాయికి పెళ్లి అంటే కట్నాలు కానుకలు, నెల నెలా  జాబు లో సంపాదించే జీతం కాదని  చెపుతుందా? లేక బాగా చదివే పక్కింటబ్బాయి సంపాదనతో పోల్చుకొని స్త్రుగుల్ అవ్వద్దని ఆ అబ్బాయి కి నేర్పుతదా?  తల్లిదండ్రులకు అబ్బాయి ఏదో ఒక లా చదివి చిన్నదయినా పెద్దదయినా ఉద్యోగం లో చేరితే చాలు అన్న మూస లో ఆలోచించి సమస్యల పాలవ్వద్దు అని చెపుతుందా?

అబ్బాయి కి ఎప్పుడు చదువు, ఉద్యోగం అన్నవి జీవిత సమస్యలు కాకుండా చేస్తుందా (చేతనయ్యింది చేసి బ్రతికే అవకాశం చాలదా? )

అమ్మాయిలకి, అబ్బాయిలకి  అమ్మా నాన్న సంబంధం చుస్తే తప్ప తన పెళ్లి తను అరేంజ్ చేసుకొనే  ఆలోచనని ఇస్తుందా ?

అమ్మాయి తనకన్నా తక్కువ సంపాదించే అబ్బాయి పెళ్లి చేసుకొని, కట్న కానుకలు అతని ఆస్తికి తగ్గట్టు గా సమర్పించి మరీ .. ఇంకా అతని లో న్యూనత కి తన జీవితాన్ని బలి చేసుకోకుండా ఉండగలదా ? అంతెందుకు ... ఎక్కువ సంపాదించే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అబ్బాయి లో ఇతర ఆలోచనలు రాకుండా ఆపగలదా ?

3. మరి ఈ టపా లో  మీ కమ్యూనిజం ఆ అబ్బాయికి తన లైఫ్ తాను నిర్ణయించు కొని ,స్వేచ్చ గా బ్రతికే సదుపాయాన్ని ఇస్తుందా?????

ఇవన్ని ఇస్తే ఇంకేది ఇవ్వకపోయినా పర్వాలేదు. హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా!!! లేదంటే కాపిటలిజమో, కమ్యునిజమో  ఏ రాయైతే నేఁ ??